భువనగిరి అంటే సాయుధ పోరాట నేత రావి నారాయణరెడ్డి యాదికొస్తారు. తర్వాత ప్రజా ఉద్యమ పాటకు ప్రతిరూపమైన బెల్లి లలిత గుర్తుకొస్తారు. బెల్లి కృష్ణకే కాదు ఉద్యమకారులందరికి ఆమె చెల్లె, అక్క. ప్రత్యేక రాష్ట్రం కోసం అరవై ఏండ్లు సాగిన మహోధృత పోరాటంలో ఆత్మబలిదానం చేసిన వారిలో అగ్రగామి మహిళ బెల్లి లలిత. దగా పడ్డ తెలంగాణ కోసం ఆమె తన గళంతో ఉద్యమ పాటగా చేసిన పోరాటంలో 1999 మే 26న అత్యంత కిరాతకంగా హత్యకు గురైంది. 25 ఏండ్లకే ఈ గడ్డ కోసం రక్త తర్పణం ఇచ్చిన బెల్లి లలిత నేటి తరం పోరాటాలకు, యువతకు ఎనలేని స్ఫూర్తి.
తెలంగాణ ఉద్యమ త్యాగాలు బెల్లి లలిత రూపంలో ఇంకా సలుపుతూనే ఉన్నాయి. ఎందుకంటే సాయుధ పోరాట కాలం నుంచి అన్ని రకాల త్యాగాలను, బలిదానాలను, రక్తతర్పణలను గుండె లోతుల్లోంచి ఆర్ద్రంగా గానం చేసిన విముక్తి గీతం లలిత. ఆమె పాట, ఆమె ఉచ్ఛారణ లేకుండా మలిదశ ఉద్యమమే మొదలు కాలేదు. పాటతోనే నాటి ప్రభుత్వ నిర్బంధాలను సవాల్ చేసిన సాంస్కృతిక సేనాని. మలిదశ ఉద్యమంలో ప్రతికొండ, చెరువు, చెట్టు, చేమ ఆమె గానంతో మార్మోగాయి. అంతర్గత వలస పాలనలో తలాపున పారుతున్నా గొంతు తడవని, మడి తడవని బతుకుల గురించి, పోడు కూడా సాగు చేసుకోలేని పాడు జీవితాల గురించి, పట్టణీకరణకు పట్టని పల్లెల దైన్యం గురించి చైతన్యగీతాలు ఆలపించి, ఎందరిలోనో ఉద్యమ స్పూర్తి నింపింది బెల్లి లలిత.
చిన్నతనంలోనే బడి వీడి.. కార్మికురాలైంది
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం నాంచారిపేటలో నిరుపేద కుటుంబంలో బెల్లి లలిత పుట్టింది. ఒక అన్న, ఐదుగురు చెల్లెళ్లు. తండ్రి పేద వ్యవసాయ కూలి. గొర్రెలు కాసి, ఒగ్గు కథలు చెప్పి, కుటుంబాన్ని పోషించేవాడు. తండ్రి ఆట, పాటకు తాళాలు మోగించి, గొంతులో గొంతు కలిపి పాదం ఆడించడం, పదం పలకడం చిన్ననాడే నేర్చుకుంది. బడి చదువులు కూడా పూర్తికాకుండానే.. కుటుంబ భారాన్ని మోయడానికి లలిత చిన్నప్పటి నుంచి భువనగిరి దగ్గరలోని ఒక స్పిన్నింగ్ మిల్లులో కార్మికురాలిగా చేరింది. జీవన పోరాటంలో కార్మికురాలిగా పనిచేస్తూనే.. తన చుట్టూ ఉన్న సమాజాన్ని చదివింది.
దగా పడ్డ తెలంగాణ సభతో..
ప్రజల సమస్యలపై పాట, మాటలతో ప్రజలను చైతన్యపరుస్తూ వచ్చింది బెల్లి లలిత. 1997 మార్చిలో భువనగిరిలో జరిగిన మొట్టమొదటి ‘దగా పడ్డ తెలంగాణ’ సభను విజయవంతం చేయడంలో ఆమెది కీలకపాత్ర. బహిరంగ సభ ద్వారా తెలంగాణ నినాదానికి జీవం పోయడంలో ఆమె పాట, మాట ప్రత్యేకంగా నిలిచాయి. భువనగిరి సభతో మొదలై.. మెదక్, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల్లో తెలంగాణ పాటకు పర్యాయ పదంగా మారిందామె. ఆమె పౌర స్వేచ్ఛా ఉద్యమంలో చురుకుగా పాల్గొంది. ప్రాంతీయ అసమానతలను ప్రశ్నిస్తూ.. పాలకులను నిలదీసింది. శ్రామిక జీవులు, బడుగు జనుల విముక్తి గీతమైంది.
ప్రశ్నించే గొంతును ఖండించిన్రు
సమస్య ఎక్కడ ఉన్నా గొంతెత్తి నినదించింది బెల్లి లలిత. సమైక్య అణచివేతలు, నిర్బంధాలతో విసిగిపోయి తెలంగాణ వాదానికి గొంతుకై నిలిచింది. తన పాటతో ఉద్యమాన్ని ప్రబలంగా మార్చింది. ఇది సహించని పాలకులు ప్రశ్నించే గొంతును నొక్కాలని నిర్ణయించుకున్నారు. కొన్ని శక్తులతో దుర్మార్గంగా.. ఆ విముక్తి పాటను పాడిన గొంతును 1999 మే 26 తెగ నరికించింది. గజ్జె కట్టినందుకు కాళ్లు, పిడికిలెత్తిన చేతుల్ని, గద్దించిన గొంతును, ఒక్కొక్క భాగాన్ని ఖండించి శరీరం మొత్తాన్ని 17 ముక్కలుగా నరికించింది అప్పటి సమైక్యవాద సర్కార్. ఆ సాయంత్రం తాను పనిచేస్తున్న స్పిన్నింగ్ మిల్లు నుంచి ఇంటికి వచ్చి మరో గంటలో తిరిగి వస్తానని బయటకి వెళ్లిన ఆమెను కిడ్నాప్ చేసి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఆ విషయం వెంటనే బయటకు రాకుండా నొక్కిపెట్టారు. రోజులు గడుస్తున్నా లలిత ఆచూకీ లేకపోవడంతో.. నాడు ప్రభుత్వ నిర్బంధాలు, భువనగిరిలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఆమెకు సర్కారు ఏదైనా అపాయం తలపెట్టవచ్చని అందరూ భయపడ్డారు.
4 రోజులకు బయటపడిన శరీర భాగాలు
లలిత కిడ్నాప్ అయిన నాలుగో రోజు భువనగిరిలోని వ్యవసాయ బావుల్లో ఎవరివో శరీర భాగాలు నీటిపై తేలాడుతున్నాయని ప్రచారం జరిగింది. అంతే ఒక్కసారిగా భువనగిరి ఉలిక్కిపడింది. లలితను కుట్రపూరితంగా ప్రభుత్వమే హత్య చేయించిందని ఆగ్రహం వెల్లువెత్తింది. అయినా ప్రభుత్వం శరీర భాగాలను ప్రజలకు చూపకుండా.. బెల్లి లలితవి కావని బుకాయించింది. లలిత ఎక్కడికో నక్సల్ దళాల్లోకి వెళ్లి ఉంటుందని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. ఈ వ్యవహారంలో బెల్లి లలిత వ్యక్తిత్వానికి మసి పూసేందుకు ప్రభుత్వం కుట్రలకు దిగింది. లలితను హత్య చేసి తెలంగాణ నినాదాన్ని, వాదాన్ని రూపుమాపవచ్చని పాలకులు కుట్రపూరితంగా హత్యచేశారు. బెల్లి లలిత గొంతును తెగనరికి తెలంగాణ పాటను ఆపామని కలగన్న పాలకులకు కోట్ల గొంతులతో తెలంగాణ పాట హోరెత్తుతున్నది.
ఉద్యమ పునాదులైన వీరుల్ని మరిస్తే ఎట్ల?
ఉద్యమం రగిలించిన పాపానికి లలిత కుటుంబ సభ్యులందరినీ పుట్టకొకరిని, గుట్టకొకరిని తరిమేసింది నాటి సర్కార్. మారోజు వీరన్న సహా భువనగిరి పరిసరాల్లో 16 మంది తెలంగాణవాదులను హత్య చేయించింది ఆనాటి సమైక్య సర్కారే. ఇన్ని హత్యలు జరిగినా, హంతకులను వదిలేయడం, వారికి సన్మానాలు చేయడమే సర్కార్ ప్రోత్సాహానికి నిదర్శనం. ఇంత మంది బలిదానాలు, హత్యల పునాదుల మీదనే తెలంగాణ ఉద్యమం బలపడి మన రాష్ట్రం మనం సాధించుకున్నం. కానీ నాటి ఉద్యమకారుల హత్యలకు హంతకులు దొరకలేదు. వారికి శిక్షలు పడలేదు. మనదైన రాష్ట్రంలో మన సర్కారు కూడా దీనికి సమాధానం వెతకాలని అనుకోకవడం లేదు. ఉద్యమానికి పునాదులేసిన వీరులను స్వరాష్ట్ర పాలకులు కూడా గుర్తుచేసుకోకపోవడమే నేటి విషాదం. అమరుల త్యాగాలను విస్మరిస్తే రాష్ట్రం ఏర్పాటుకు మూలాలను మరిచినట్టు కాదా? అన్నది ప్రశ్నించుకోవాలె.
మహిళలు, యువతలో చైతన్యం నింపింది
తన అనుభవాలు, ఫ్యాక్టరీలో కార్మిక సంఘం ఇచ్చిన చైతన్యం అన్నీ కలిసి లలితను చైతన్య దీప్తిగా తీర్చిదిద్దాయి. అప్పుడే భువనగిరిలో సాహితీ మిత్రమండలి ప్రత్యామ్నాయ సాహిత్య, రాజకీయ కృషిని ప్రారంభించింది. ప్రతి బుధవారం అధ్యయన తరగతులు, సాహిత్య సభలతో ప్రజల్లో చైతన్యాన్ని నింపేందుకు కార్యాచరణను చేపట్టింది. సీఐటీయూ కార్మిక సంఘం సమైక్య వాదంతో విసిగి.. బయటకి వచ్చిన లలిత తెలంగాణ ఉద్యమ కార్యాచరణను ఎన్నుకున్నది. ఆ క్రమంలో భువనగిరిలో ఓ నిత్య చైతన్య జ్వాలయై వెలిగింది. భువనగిరి బస్తీల్లోని సమస్యల పరిష్కారానికి, ముఖ్యంగా నీటి సమస్యను పరిష్కరించేందుకు ఉద్యమం చేపట్టింది. మహిళలను చైతన్య పరచి, సంఘటితం చేసేందుకు ‘మహిళా స్రవంతి’ని ఏర్పాటు చేసింది. మహిళల హక్కుల కోసం, యువతలో పెరిగిపోయిన గుట్కా, పాన్‌పరాగ్, సారా లాంటి వ్యసనాలకు వ్యతిరేకంగా పాటలు కట్టి ఊరూరా ప్రదర్శనలు చేపట్టింది.
- దొడ్డి చంద్రం, జర్నలిస్ట్, కడవెండి గ్రామం, జనగామ జిల్లా