ఓటేసేందుకు ముందుకు రావడం లేదేం?
సెలవులొస్తే టూర్లకు వెళ్తున్నారా?
సామాజిక బాధ్యత మరిచిన జనం
విద్యాధికులకు ఓటు భారమైందా?
తగ్గతూ వస్తున్న పోలింగ్ శాతం
3 దాటినా 30% దాటని ఓటింగ్
హైదరాబాద్: విద్యాధికులు సామాజిక బాధ్యత మరిచారా..? వరుస సెలువలు వస్తే టూర్లకు వెళ్లపోతున్నారా..? ఐదేండ్లు పాలించే ప్రభుత్వాన్ని ఎన్నుకోవడమే భారంగా మారిందా..? నగర జీవి పోలింగ్ పై ఎందుకంత విముఖత వ్యక్తం చేస్తున్నాడు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని మూడు సెగ్మెంట్లలో 50శాతానికి మించి పోలింగ్ నమోదు కావడం లేదు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఉన్న అధికారిక సమాచారం ప్రకారం హైదరాబాద్ లోనే అతి తక్కువగా పోలింగ్ నమోదైంది. హైదరాబాద్ సెగ్మెంట్ లో 29.47% ఓట్లు మాత్రమే నమోదు కావడం గమనార్హం. మినీ ఇండియాగా పేరున్న అతిపెద్ద పార్లమెంటరీ నియోజకవర్గం మల్కాజ్ గిరి.
ఈ సెగ్మెంట్ లో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఓటర్లున్నారు. వీరితోపాటు ఏపీ వాసులు ఎక్కువగా నివసించే అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఏపీ, తెలంగాణలో ఒకే రోజు పోలింగ్ ఉండటం వల్ల చాలా మంది ఏపీకి వెళ్లిపోయారు. ఏపీ వెళ్లిన వాళ్లలో చాలా మందికి రెండు చోట్లు ఓట్లున్నాయి. దీంతో వారు ఇక్కడి ఓటును వినియోగించుకోలేక పోయారు. ఇక్కడ మధ్యాహ్నం 3 గంటల వరకు 37.69% పోలింగ్ నమోదైంది. సికింద్రాబాద్ సెగ్మెంట్ లో కేవలం 34.58శాతం ఓటింగ్ నమోదు కావడం గమనార్హం. సిటీ శివారులో ఉన్న చేవెళ్లలో 45.35శాతం పోలింగ్ నమోదైంది.
వరుస సెలవులే కారణమా..?
హైదరాబాద్ లో నివసించే వాళ్లలో చాలా మంది ఐటీ ఉద్యోగులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో పనిచేసే సిబ్బంది ఉన్నారు. ఐటీ ఉద్యోగులు శని, ఆదివారాలు సెలవులు, సోమవారం పోలింగ్ నేపథ్యంలో ఈసీ సెలవు ప్రకటించింది. దీంతో ఐటీ సంస్థల్లో పనిచేసే వారి వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. ఉద్యోగాల కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రేతరుల్లో చాలా మంది స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఏపీ వాసులు అక్కడ ఓటింగ్ లో పాల్గొనడంపై ఆసక్తి చూపారనే వాదన ఉంది. వాళ్లు వెళ్లిపోయినా.. హైదరాబాద్ లో ఉండే వారు, ఇక్కడ మాత్రమే ఓటు హక్కు కలిగి ఉన్నవారిలో చాలా మంది ముందస్తుగానే వెకెషన్ టూర్లకు ఫిక్స్ అయ్యారు. వేసవి సెలవులు కూడా కలిసి రావడంతో శుక్రవారం సాయంత్రమే అంతా సిటీకి టాటా చెప్పేశారని తెలుస్తోంది. దీంతో వాళ్ల ఓట్లు పనికిరాకుండా పోయాయి. ఈ కారణంగా పోలింగ్ శాతం పెరగడం లేదనే వాదన బలంగా ఉంది..
సామాజిక బాధ్యత మరస్తున్నామా?
ఓటు అనేది ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం లాంటిదని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సెలబ్రిటీలతో ప్రచారం చేయించింది ఈసీ. ఓటు ఆవశ్యకతపై ఈ సారి ఎలక్షన్ కమిషన్ విస్తృతంగా ప్రచారం చేసింది. అయినా ఎప్పటిలాగే తన పంతాన్నే నెగ్గించుకున్నాడు నగర ఓటరు. ఓటు వేయకుండా ఉండిపోతున్న వాళ్లలే విద్యాధికులే ఎక్కువని సర్వేలు చెబుతున్నాయి. జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి, ఎంటర్ టైన్మెంట్ కు ఇస్తున్న టైం కనీసం ప్రభుత్వానికి ఎన్నుకునేందుకు ఇవ్వడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఓటింగ్ సరళి ఇలా..
నియోజకవర్గం 2019 2024 (మధ్యాహ్నం 3వరకు)
హైదరాబాద్ 44.84 29.47
సికింద్రాబాద్ 46.50 34.58
మల్కాజ్ గిరి 49.63 37.69