Ben Duckett: తప్పుగా అనుకోకండి.. అతను ప్రపంచ స్థాయి ఆటగాడు: జైశ్వాల్‌పై డకెట్

Ben Duckett: తప్పుగా అనుకోకండి.. అతను ప్రపంచ స్థాయి ఆటగాడు: జైశ్వాల్‌పై డకెట్

స్వదేశంలో ఇంగ్లాండ్ తో ఈ ఏడాది ప్రారంభంలో భారత్ 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆడిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ ను భారత్ 4-1 తేడాతో గెలుచుకోగా.. టీమిండియా ఓపెనర్ యశస్వి జైశ్వాల్ విశ్వరూపమే చూపించాడు. 5 టెస్టుల్లో మొత్తం 712 పరుగులు చేసి ఔరా అనిపించాడు. అతని దూకుడు ధాటికి ఇంగ్లాండ్ బౌలర్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది. అయితే ఈ సిరీస్ లో జైశ్వాల్ దూకుడుగా ఆడడంపై ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. 

రాజ్‌కోట్ టెస్టులో 3వ రోజు జైశ్వాల్ మెరుపు సెంచరీతో అదరగొట్టాడు. ప్రారంభంలో ఆచితూచి ఆడిన ఈ ముంబై కుర్రాడు.. ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బౌలర్లు ఎవరైనా పూనకం వచ్చినట్టు ఆడాడు. ఈ సెంచరీపై ఇంగ్లాండ్ ఓపెనర్ స్పందిస్తూ..జైశ్వాల్ బ్యాటింగ్‌లో అటాకింగ్ గా ఆడటానికి ఇంగ్లండ్‌కు కొంత క్రెడిట్ దక్కుతుందని డకెట్ అన్నాడు. ఈ వ్యాఖ్య అభిమానులకు అసలు నచ్చలేదు. డకెట్ చేసిన వ్యాఖ్యలను ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు నాజర్ హుస్సేన్, మైఖేల్ వాన్ సైతం బెన్ డకెట్ ను విమర్శించారు.

ప్రస్తుతం శ్రీలంకతో ఇంగ్లాండ్ స్వదేశంలో సిరీస్ ఆడనుంది. జూలై 21న ఓల్డ్ ట్రాఫర్డ్ లో తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కు ముందు జైశ్వాల్ పై చేసిన వ్యాఖ్యలకు డకెట్ స్పందించాడు. డైలీ మెయిల్‌తో మాట్లాడుతూ.. తాను యశస్వి జైశ్వాల్ ను విమర్శించలేదని.. అతన్ని అభినందించానని చెప్పుకొచ్చాడు. జైశ్వాల్ ప్రపంచ స్థాయి ఆటగాడని.. నేను అన్న మాటలు జనాలు తప్పుగా అర్ధం చేసుకున్నారని ఈ ఇంగ్లాండ్ ఓపెనర్ తెలిపాడు.