T20 World Cup 2024: ఇంగ్లాండ్‌కు భారీ షాక్.. టీ20 ప్రపంచకప్‌ నుంచి తప్పుకున్న బెన్ స్టోక్స్

టీ20 ప్రపంచకప్‌కు ముందు ఇంగ్లాండ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ మెగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న పొట్టి ప్రపంచ కప్ ఎంపికలో తనను పరిగణించకూడదని స్టోక్స్.. ఇంగ్లాండ్ మేనేజ్‌మెంట్‌(ఈససీబీ)కు తెలియజేశాడు. 

మోకాలి శస్త్రచికిత్స అనంతరం ఇటీవల భారత పర్యటనకు వచ్చిన స్టోక్స్.. కేవలం 5 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయగలిగాడు. పూర్తి ఫిట్‌గా లేకపోవడమే అందుకు కారణం. దీంతో ఈసారి ఆడకూడదని నిర్ణయించుకున్నాడు. ఆల్‌రౌండర్‌గా అందుబాటులోకి రావడానికి తాను పూర్తి ఫిట్‌నెస్‌ను తిరిగి పొందాలనుకుంటున్నట్లు స్టోక్స్ స్వయంగా తెలియజేశాడు. అంతర్జాతీయ ప్రారంభానికి ముందు కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో డర్హామ్ తరపున ఆడతానని చెప్పుకొచ్చాడు. 

గత ఎడిషన్‌(2022 టీ20 ప్రపంచకప్‌)లో పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్‌ పోరులో స్టోక్స్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 49 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్ 52 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. అలాంటి ఆటగాడు మెగా టోర్నీ నుంచి వైదొలగడం పెద్ద లోటే. కాగా, మోకాలి గాయం కారణంగా స్టోక్స్ ఐపిఎల్ 2024 నుండి కూడా వైదొలిగాడు.

స్కాట్లాండ్‌తో తొలి మ్యాచ్

టీ20 ప్రపంచ కప్‌లో ఇంగ్లాండ్‌ జట్టు.. ఆస్ట్రేలియా, స్కాట్‌లాండ్‌, నమీబియా, ఒమన్‌లతో కలిసి గ్రూప్‌--బిలో ఉంది. ఇంగ్లాండ్.. జూన్ 4న కెన్సింగ్టన్ ఓవల్‌(బార్బడోస్‌) వేదికగా స్కాట్లాండ్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. అనంతరం జూన్ 8న అదే వేదికపై చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియాతో తలపడనుంది.

ALSO READ :- IPL 2024: ఐపీఎల్‌ 2024లో రెండు మ్యాచ్‌లు రీషెడ్యూల్