ENG v WI 2024: 24 బంతుల్లో టెస్ట్ హాఫ్ సెంచరీ.. 43 ఏళ్ళ రికార్డ్ బద్దలు కొట్టిన ఇంగ్లాండ్ కెప్టెన్

ENG v WI 2024: 24 బంతుల్లో టెస్ట్ హాఫ్ సెంచరీ.. 43 ఏళ్ళ రికార్డ్ బద్దలు కొట్టిన ఇంగ్లాండ్ కెప్టెన్

టెస్టుల్లో ఇంగ్లాండ్ దూకుడు కొనసాగుతుంది. ప్రత్యర్థి ఎవరైనా.. గడ్డ ఎక్కడైనా బజ్ బాల్ ఆటతీరుతో రెచ్చిపోతున్నారు. వెస్టిండీస్ పై సొంతగడ్డపై ముగిసిన మూడో టెస్టులో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ చెలరేగి ఆడాడు. టెస్టుల్లో టీ20 బ్యాటింగ్ చూపిస్తూ సరికొత్త వినోదాన్ని అందించాడు. విండీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో 43 ఏళ్ళ క్రితం ఇంగ్లాండ్ దిగ్గజం ఇయాన్ బోథమ్ నెలకొల్పిన రికార్డ్ ను బద్దలు కొట్టాడు. 

1981 లో ఇయాన్ బోథమ్ భారత్ పై ఢిల్లీ వేదికగా 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని ఇంగ్లాండ్ తరపున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్ గా నిలిచాడు. స్టోక్స్ ఆదివారం (జూలై 28) 24 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయడంతో ఈ రికార్డ్ బ్రేక్ అయింది. బెయిర్ స్టో (30), డకెట్ (32) వరుసగా మూడు నాలుగు స్థానాల్లో ఉన్నారు. ఓవరాల్ గా ఈ లిస్ట్ లో స్టోక్స్ మూడో స్థానంలో నిలిచాడు. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మిస్బాబుల్ ఉల్ హక్ 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. 

ఈ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్ లో స్టోక్స్ 57 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. ఈ మ్యాచ్ విషయానికి వస్తే వెస్టిండీస్ పై ఇంగ్లాండ్ 10 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో మూడు టెస్టుల సిరీస్ కు 3-0 తో క్లీన్ స్వీప్ చేసింది. తొలి ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ 282 పరుగులు చేస్తే.. ఇంగ్లాండ్ 376 పరుగులు చేసి 94 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో కేవలం 175 పరుగులకే ఆలౌట్ కాగా.. 82 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ వికెట్ కోల్పోకుండా 7.2 ఓవర్లలోనే 87 పరుగులు చేసి గెలిచింది.