The Hundred: ఊత కర్రల సాయంతో నడుస్తున్న ఇంగ్లాండ్ కెప్టెన్.. లంకతో సిరీస్ నుంచి ఔట్

ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కు ఊహించని షాక్ తగిలింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ కు కీలకమైన శ్రీలంకతో సిరీస్ కు అతను దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ది హండ్రెడ్ 2024 టోర్నమెంట్‌లో స్టోక్స్ స్నాయువు గాయమైంది.   నార్తర్న్ సూపర్‌చార్జర్స్‌, మాంచెస్టర్ ఒరిజినల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ లీగ్ లో ఈ ఇంగ్లాండ్ కెప్టెన్ నార్తర్న్ సూపర్‌చార్జర్స్‌ తరపున ఆడుతున్నాడు. 

మాంచెస్టర్ ఒరిజినల్స్ పేసర్ ఆలీ రాబిన్‌సన్‌ బౌలింగ్ లో స్కూప్ షాట్ ఆడే ప్రయత్నంలో స్టోక్స్ కు గాయమైంది. షాట్ ఆడిన తర్వాత సింగిల్ తీసే ప్రయత్నంలో స్టోక్స్ పరుగు తీయడానికి ఇబ్బందిగా కనిపించాడు. పరిగెత్తలేక గ్రౌండ్ లోనే పడిపోయి వైద్య సహాయాన్ని కోరాడు. దీంతో ఫిజియోలు వెంటనే పరిగెత్తుకొచ్చి అతనికి చికిత్స అందించారు. స్ట్రెచర్‌పైన అతన్ని మాంచెస్టర్‌లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్ నుండి అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. 

గంట తర్వాత తిరిగి వేదిక వేదిక వద్దకు వచ్చి మాంచెస్టర్ ఒరిజినల్స్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇస్తూ ఊతకర్రల సహాయంతో నడుస్తూ కనిపించాడు. అనంతరం అభిమానులకు ఆటోగ్రాఫ్‌లపై సంతకం చేశారు. స్టోక్స్ గాయంతో ఇంగ్లాండ్ కు ఇప్పుడు గట్టి ఎదురు దెబ్బ తగలనుంది. గాయపడిన అతను స్వదేశంలో ఆగస్టు 21 నుండి ప్రారంభమయ్యే మూడు టెస్టుల సిరీస్‌కు దూరం కానున్నాడు. 10 రోజుల్లో స్టోక్స్ కోలుకోవడం కష్టంగానే కనిపిస్తుంది. ఇప్పటికే వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో వేలికి గాయమైన జాక్ క్రాలీ.. లంక సిరీస్ కు దూరమయ్యాడు. 

స్టోక్స్ కు గాయమైన అతని ప్రాతినిధ్యం వహిస్తున్న సూపర్‌ఛార్జర్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన  మాంచెస్టర్ ఒరిజినల్స్ నిర్ణీత 100 బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. 61 పరుగులతో సాల్ట్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. లక్ష్య ఛేదనలో సూపర్‌ఛార్జర్స్ మరో 3 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. నికోలస్ పూరన్ (33 బంతుల్లో 66), కెప్టెన్ హ్యారీ బ్రూక్ (26 బంతుల్లో 43) ఆడమ్ హోస్ (14 బంతుల్లో 27) ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.