
- కోట్లకు పడగలెత్తిన పలువురు మిల్లర్లు
- ఏడాదిన్నరలో 40కిపైగా మిల్లుల ఏర్పాటు
- సగానికిపైగా బినామీలవే..ఉన్నతస్థాయి విచారణకు రంగం సిద్ధం!
నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలో జరిగిన సీఎంఆర్ ధాన్యం అక్రమాల వ్యవహారంలో బినామీ యాజమాన్యాలే కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని కొంతమంది పెద్దల అండదండలతో పలువురు రైస్ మిల్లర్లు బినామీల పేరిట అదనపు రైస్ మిల్లులను ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున సీఎంఆర్ ధాన్యాన్ని పక్కదోవ పట్టించారు. సీఎంఆర్ ధాన్యాన్ని భారీగా పక్కదారి పట్టిస్తూ కోట్లకు పడగలెత్తిన కొందరు మరిన్ని రైస్‌మిల్లులు ఏర్పాటు చేసుకు న్నారు.
జిల్లాలో ఏడాదిన్నర క్రితం 60 రైస్ మిల్లులుండగా ప్రస్తుతం వాటి సంఖ్య 100కు పైగా చేరాయంటే ఏమేర అక్రమాలు జరుగుతున్నాయో అర్థమవుతోంది. తమ మిల్లులపై ఫిర్యాదులు, ఆరోపణలున్నప్పటికీ కొంతమంది రైస్ మిల్లర్లు రాజకీయ పలుకుబడితో వాటిని ఖాతరు చేయకుండా బినామీల పేరిట మిల్లులను ఏర్పాటు చేసుకుంటున్నారు. పట్టణంలోని ఓ రైస్ మిల్ యజమాని తన బినామీల పేరిట ఏకంగా నాలుగు మిల్లులు ఏర్పాటు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
ఒక మిల్లు నుంచి మరో మిల్లుకు
బినామీల పేరిట ఏర్పాటు చేసిన రైస్ మిల్లుల్లో భారీ ఎత్తున అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ అధికారులు లక్ష్మణచాంద మండలం పొట్టపల్లిలోని రైస్ మిల్లుపై జరిపిన తనిఖీల్లో బినామీల గుట్టురట్టయింది. బినామీ రైస్ మిల్లుల్లోనే కొంతకాలంగా భారీ ఎత్తున ధాన్యం అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఒక మిల్లు నుంచి మరో మిల్లుకు పెద్ద ఎత్తున సీఎంఆర్ ధాన్యం ట్రాన్స ఫర్ చేసినట్లు విచారణలో వెల్లడైంది. దీంతో ఆ రైస్ మిల్లుపై అధికారులు కేసులు నమోదు
చేశారు.
పౌరసరఫరాల శాఖ సిబ్బంది కీలక పాత్ర
జిల్లా పౌరసరఫరాల శాఖలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న కొంతమంది సిబ్బంది సీఎంఆర్ ధాన్యం అక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ అండదండలు పుష్కలంగా ఉండడంతో ఉన్నతాధికారులను సైతం ప్రభావితం చేస్తున్నారు. ఆఫీసులో వారు చెప్పిందే వేదంగా సాగుతోందని విమర్శలున్నాయి. రైస్ మిల్లర్లకు సీఎంఆర్ ధాన్యం కేటాయింపులు, ధాన్యం నిల్వలు, స్టాక్ రిజిస్టర్ల నిర్వహణ లాంటి అంశాలపై అధికారులను పక్కదోవ పట్టిస్తున్నారని తెలుస్తోంది.
ఉన్నత స్థాయి విచారణకు రంగం సిద్ధం
జిల్లాలో జరిగిన సీఎంఆర్ ధాన్యం అక్రమాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారితో పాటు సివిల్ సప్లయిస్ సంస్థ డీఎంను, ఎన్ఫోర్స్మెంట్ డీటీని ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ అక్రమాలపై పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్థాయిలో ఆరా తీస్తున్నట్లు సమాచారం. రైస్ మిల్లర్లకు అండగా నిలిచిన రాజకీయ నేతలు, సంబంధిత శాఖలోని అధికారులు, కిందిస్థాయి సిబ్బంది పాత్రపై కమిషనర్ స్థాయిలో వివరాలు సేకరించారని, విజిలెన్స్ అధికారులు కూడా రంగంలోకి దిగినట్లు సమాచారం.
సన్నబియ్యంతో బయటపడనున్న గుట్టు
ప్రభుత్వం ప్రస్తుతం సన్న బియ్యం పంపిణీ నేపథ్యంలో మిల్లర్లకు కేటాయించిన దొడ్డు బియ్యం లెక్కలన్నీ వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సీఎంఆర్ మిల్లింగ్ కోసం మిల్లులకు ఎక్కువ శాతం సన్న వడ్లనే కేటాయించనుండగా.. మిల్లర్ల వద్ద ఉన్న పాత, దొడ్డు రకం వడ్ల వివరాలన్నిటినీ అధికారులు ఇప్పటికే సేకరించారు. ముఖ్యంగా 2022 వానాకాలం, యాసంగి సీజన్ల నుంచి ఇప్పటి వరకు రైస్ మిల్లులకు కేటాయించిన సీఎంఆర్ ధాన్యం లెక్కలు విశ్లేషించనున్నారు. అక్రమాలకు పాల్పడిన మిల్లులపై చర్యలు తీసుకోనున్నారు.