పౌర సరఫరాల శాఖలో బినామీల దందా

  • కార్పొరేషన్​ గోడౌన్లు, ఎంఎల్ఎస్​ పాయింట్ల వద్ద అక్రమాలు..  
  • కాంట్రాక్టర్లు, మిల్లర్లు అధికారుల మిలాఖత్​ 
  • లారీలు లేకపోయినా బియ్యం రవాణా కాంట్రాక్టులు 
  • జీపీఎస్ సిస్టమ్​ గాలికి 
  • కాంట్రాక్టు ఉద్యోగులను అడ్డంపెట్టుకుని ఆఫీసర్ల దందా

నల్గొండ, వెలుగు: పౌర సరఫరాల శాఖలో బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం కనిపించడం లేదు. పీడీఎస్​లో జరుగుతున్న అక్రమాలకు చెక్ ​పెట్టేందుకు అందుబాటులోకి తెచ్చిన జీపీఎస్, ఈ పాస్​ సిస్టమ్ ​సైతం పనికి రాకుండా పోతోంది. స్టేజ్–1,​ స్టేజ్​–2 కాంట్రాక్టర్లు, మిల్లర్లు, అధికారులు కుమ్మకై  పీడీఎస్​ రైస్​తో ఇల్లీగల్​ దందా చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 17,318 రేషన్​షాపులుండగా.. 3,92,643 మంది కార్డుదారులున్నారు.  ప్రతి నెలా లక్షా70 వేల మెట్రిక్​ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. దీంట్లో పోర్టబులిటీ (రాష్ట్రంలో ఎక్కడైనా బియ్యం తీసుకుంటున్న వాళ్లు) సదుపాయాన్ని వాడుకుంటున్న కార్డుదారులు 1,16, 5 00 మంది వరకు ఉన్నారు. బియ్యం పంపిణీలో అవకతవకలకు అరికట్టేందుకు అప్పటి కమిషనర్ ​సీవీ ఆనంద్​ఈ పాస్, జీపీఎస్ ​సిస్టమ్​ తీసుకువచ్చారు. దీంతో లాభం లేదని భావించిన కాంట్రాక్టర్లు, మిల్లర్లు, అధికారులు కలిసి అక్రమ రవాణాకు అడ్డదారులు వెతికారు. 

బినామీల పేర్లతో దందా.. 

కార్పొరేషన్ ​గోడౌన్ల వద్ద స్టేజ్​వన్ ​కాంట్రాక్టర్లు, ఎంఎల్ఎస్​ పాయింట్ల వద్ద స్టేజ్​–2 కాంట్రాక్టర్ల హవా నడుస్తోంది. వీళ్లకు కాంట్రాక్టు అప్పగించేటప్పుడే డిపార్ట్​మెంట్​కు అందజేసిన లారీలకు జీపీఎస్​సిస్టమ్​ పర్మినెంట్​గా అమరుస్తారు. స్టేజ్​ వన్ ​నుంచి బియ్యం రవాణా చేసేందుకు ఒక్కో జిల్లాలో సుమారు 25 నుంచి 40 లారీలు అవసరం. ఇక ఎంఎల్ఎస్​ పాయింట్ల వద్ద 10, 15 లారీలు కావాల్సి ఉంటుంది. కొంతమంది  కాంట్రాక్టర్లు బినామీల పేర్లతో బియ్యం ట్రాన్స్​పోర్ట్​ కాంట్రాక్టు దక్కించుకున్నారు. ప్రస్తుతం అక్రమంగా బియ్యం రవాణా  జరుగుతున్న వాహనాలన్నీ ఈ కోవకు చెందినవే. అసలుకాంట్రాక్టర్​ఒక రైతే,  లారీలు మరొకరి పేరు మీద ఉంటున్నాయి. ఇంకొన్ని చోట్ల అసలు డిపార్ట్​మెంట్​తో సంబంధం లేని ప్రైవేటు లారీలను గోడౌన్లలోకి అనుమతిస్తున్నారు. లారీలకు బదులు ఆటోలు, ట్రాక్టర్లలో బియ్యాన్ని లోడింగ్​చేస్తున్నారు. పీడీఎస్​ బియ్యం రవాణా చేసేటప్పుడు లారీలకు అతికించే ‘ప్రజా పంపిణీ బియ్యం’ ఫ్లెక్సీలను సైతం బియ్యం అక్రమ రవాణాకు వాడుతున్నారు. నల్గొండ జిల్లాలో పెద్దవూర, హాలియాల్లో ఈ రకమైన దోపిడీ జరిగింది. ఒక లారీకి మాత్రమే జీపీఎస్​ఉండి ఇంకోదానికి లేకపోవడంతో టాస్క్​ఫోర్స్​ ఆఫీసర్లు కంగుతిన్నారు. 

రికార్డుల్లో ఒక కాంట్రాక్టర్​ పేరుంటే, ఫీల్డ్​మీద ఇంకొకరు ఉంటున్నారు. తనిఖీల్లో వాహనాలు పట్టుబడగానే అసలు పేర్లకు బదులు బినామీల పేర్లను కేసుల్లో ఇరికిస్తున్నారు. లేదంటే రాజకీయ నాయకుల పలుకుబడితో ఎఫ్ఐఆర్​లను మార్చేస్తున్నారు. నల్గొండలో స్టేజ్​వన్​ కాంట్రాక్టర్​ సమీప బంధువే స్టేజ్​2 కాంట్రాక్టర్​గా కూడా ఉన్నాడు. ఇక గోడౌన్లు, ఎంఎల్​ఎస్​ పాయింట్లలో ఉన్న సీసీ కెమెరాలు పనికి రాకుండా పోయాయి. జిల్లాలో కమాండ్​ కంట్రోల్​రూమ్​లు పని చేయడం లేదు.