- ఇంట్రాడే కనిష్టాల నుంచి 2 శాతం పెరిగిన సెన్సెక్స్
- మెరిసిన టెలీకమ్యూనికేషన్, టెక్, కన్జూమర్ డ్యూరబుల్స్ షేర్లు
- రేంజ్ బౌండ్ నుంచి నిఫ్టీ బయటకు : ఎనలిస్టులు
ముంబై : బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు ఇంట్రాడే కనిష్టాల నుంచి 2 శాతానికి పైగా లాభపడ్డాయి. గ్లోబల్ మార్కెట్లు నష్టాల్లో కదలడంతో సెన్సెక్స్ ఓపెనింగ్ సెషన్‌లో 1,207 పాయింట్లు నష్టపోయింది. టెలీకమ్యూనికేషన్, టెక్, కన్జూమర్ డ్యూరబుల్ షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో ఈ నష్టాల నుంచి రికవర్ అవ్వడమే కాకుండా 800 పాయింట్లకు పైగా లాభపడింది. నవంబర్‌లో ఇన్‌ఫ్లేషన్ తగ్గడం ఇన్వెస్టర్ల కాన్ఫిడెన్స్ పెంచింది. సెన్సెక్స్ శుక్రవారం 843 పాయింట్లు (1.04 శాతం) లాభపడి 82,133 వద్ద ముగియగా, నిఫ్టీ 220 పాయింట్లు పెరిగి 24,768 దగ్గర సెటిలయ్యింది.
నిఫ్టీ ఇంట్రాడేలో 368 పాయింట్లు పతనమైంది. వారం ప్రాతిపదికన చూస్తే బీఎస్‌ఈ సెన్సెక్స్ ఈ వారం 623 పాయింట్లు (0.76 శాతం) పెరగగా, నిఫ్టీ 91 పాయింట్లు లాభపడింది. సెన్సెక్స్‌లో ఎయిర్‌టెల్, ఐటీసీ, కోటక్ బ్యాంక్, హిందుస్తాన్ యూనిలీవర్, టైటాన్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, అల్ట్రాటెక్ సిమెంట్, పవర్ గ్రిడ్ షేర్లు శుక్రవారం ఎక్కువగా లాభపడగా, టాటా స్టీల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు నష్టాల్లో క్లోజయ్యాయి.
బ్రాడ్ మార్కెట్ మాత్రం నెగెటివ్‌లో కదిలింది. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.30 శాతం పడగా, మిడ్ క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ముగిసింది. సెక్టార్ల పరంగా చూస్తే, టెలికమ్యూనికేషన్ ఇండెక్స్ 2 శాతానికి పైగా ర్యాలీ చేసింది. టెక్, కన్జూమర్ డ్యూరబుల్స్ ఒక శాతం చొప్పున, బ్యాంకెక్స్, ఐటీ షేర్లు అర శాతం చొప్పున లాభపడ్డాయి. మెటల్, సర్వీసెస్, కమొడిటీస్, ఇండస్ట్రియల్ ఇండెక్స్‌లు మాత్రం మార్కెట్‌ను కిందకి లాగాయి.
ఎనలిస్టులు ఏమంటున్నారంటే?
ఇంట్రాడే కనిష్టాల నుంచి బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు షార్ప్‌గా రికవర్ అయ్యాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అన్నారు. హెవీ వెయిట్ షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో నిఫ్టీ కన్సాలిడేషన్ రేంజ్ నుంచి బయటపడిందని అన్నారు. ‘ఇన్‌ఫ్లేషన్ తగ్గడం, ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు రేట్లను పెంచడంతో పాటు తాజాగా చాలా కంపెనీల వాల్యుయేషన్స్ తక్కువగా ఉండడంతో శుక్రవారం పుంజుకున్నాయి. ఫెస్టివల్ సీజన్‌తో వినియోగం పుంజుకుంది. నెల చివరిలోని హాలిడేస్‌తో ఇదే ట్రెండ్ కొనసాగుతుందని అంచనావేస్తున్నాం’ అని వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు.
యూఎస్‌లో వినియోగం పెరగడంతో ఐటీ షేర్లు ర్యాలీ చేస్తున్నాయి. బ్యాంకింగ్, ఐటీ, టెలికం షేర్లలో కొనుగోళ్లు పెరిగాయని, ఇన్‌ఫ్లేషన్ తగ్గడం కలిసొచ్చిందని మెహతా ఈక్విటీస్ ఎనలిస్ట్ ప్రశాంత్ తాప్సే అన్నారు. ఇన్‌ఫ్లేషన్ తగ్గడంతో ఫిబ్రవరి నుంచి రేట్లకు కోత పెట్టడానికి ఆర్‌బీఐకి వీలుంటుందని స్టాక్స్‌బాక్స్ టెక్నికల్ ఎనలిస్ట్ అమెయా రణదివ్ అన్నారు. ఇన్వెస్టర్ల భయాన్ని కొలిచే విక్స్ ఇండెక్స్ శుక్రవారం 8 శాతం తగ్గి 13.05 దగ్గర సెటిలయ్యిందని అన్నారు.
ఫారెక్స్ నిల్వలు 655 బిలియన్ డాలర్లు..
దేశ ఫారెక్స్ నిల్వలు ఈ నెల 6 తో ముగిసిన వారంలో 654.857 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అంతకు ముందు వారంలో రికార్డ్ అయిన 658.091 బిలియన్ డాలర్ల నుంచి 3.235 బిలియన్ డాలర్లు తగ్గాయి. ఈ ఏడాది సెప్టెంబర్ చివరిలో ఫారెక్స్ నిల్వలు 704.885 బిలియన్ డాలర్లకు చేరుకొని రికార్డ్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 6 తో ముగిసిన వారంలో ఫారిన్ కరెన్సీ అసెట్స్ 3.228 బిలియన్ డాలర్లు తగ్గి 565.623 బిలియన్ డాలర్లకు, గోల్డ్ రిజర్వ్‌లు 43 మిలియన్ డాలర్లు తగ్గి 66.936 బిలియన్ డాలర్లుకు పడ్డాయి.