- ఇండెక్స్ ఫండ్స్‌లో పెట్టుబడులకు మంచి అవకాశం
- రిస్క్ తక్కువ..రిటర్న్స్ పొందే ఛాన్స్
- రెండు రోజుల మార్కెట్ లాభాలకు మంగళవారం బ్రేక్
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం, పెరిగిన బాండ్ ఈల్డ్‌లు, ఇన్‌ఫ్లేషన్ భయాలతో బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు గత కొన్ని నెలలుగా పడుతున్నాయి. కానీ, లాంగ్ టెర్మ్‌లో ఇండియన్ మార్కెట్‌లు ముందుకే తప్ప వెనకడుగేయవని సీనియర్ ఎనలిస్టులు చెబుతున్నారు. అంటే బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు సెన్సెక్స్, నిఫ్టీ రిలేటెడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టెర్మ్‌లో మంచి రిటర్న్స్ పొందే అవకాశాలే ఎక్కువ. కానీ, ఓపిక తప్పకుండా ఉండాలి. సెన్సెక్స్ ఇంకో ఐదేళ్లలోనే లక్ష పాయింట్లకు చేరుకుంటుందని సీనియర్ ఇన్వెస్టర్ మార్క్ మొబియస్ అంచనావేస్తున్నారు.
మంగళవారం సెన్సెక్స్ 63,875 దగ్గర క్లోజయ్యింది. సెన్సెక్స్‌ను 1986 జనవరి 1 న లాంచ్ చేశారు. అంటే 65 వేల లెవెల్‌ను చేరుకోవడానికి సెన్సెక్స్‌కు సుమారు 38 ఏళ్లు పట్టిందని అర్థం. ఎనలిస్టులు మాత్రం ఇంకో ఐదేళ్లలోనే ఈ ఇండెక్స్ మరో 35 వేల పాయింట్లు పెరుగుతుందని బలంగా నమ్ముతున్నారు. ‘సెన్సెక్స్ ఇంకో ఐదేళ్లలో లక్ష పాయింట్ల మార్క్‌ను క్రాస్ చేస్తుందని నమ్ముతున్నాను. కానీ, ఈ మధ్యలో మార్కెట్‌లో కరెక్షన్ ఉంటుంది’ అని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ కాన్ఫరెన్స్‌లో మొబియస్ వెల్లడించారు. మార్కెట్‌లో ఎత్తుపల్లాలు సహజమన్నారు.
మార్కెట్ పడితే షేర్లను తక్కువ ధరకు కొనుక్కునే అవకాశం ఉంటుందని, ఈ అవకాశం కోసం డబ్బులు పొదుపు చేస్తుంటానని ఆయన వివరించారు. ఉదాహరణకు కరోనా సంక్షోభం టైమ్‌లో అంటే 2020 మార్చిలో సెన్సెక్స్ 25,639 పాయింట్లకు పడిపోయింది. ఆ లెవెల్‌లో రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ వంటి క్వాలిటీ షేర్లు తక్కువ ధరకే దొరికాయి. చాలా ఐటీ షేర్లు కొన్నేళ్ల కనిష్టాలకు పడిపోయాయి.
ఈ లెవెల్ నుంచి మార్కెట్ పెరగడం మొదలు పెట్టగా, ఆ ఏడాదిని 47,751 పాయింట్లు దగ్గర సెన్సెక్స్ ముగించింది. సుమారు రెండింతలు పెరిగింది. దేశ ఎకానమీపై మొబియస్ పాజిటివ్‌గా ఉన్నారు. ఇండియాలో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తున్నామని, గత కొన్నేళ్లలో భారీ లాభాలు సాధించామని చెప్పారు. డైవర్సిటీనే ఇండియా బలమని, టెక్నాలజీ వాడుతున్న యువత ఎకానమీకి సపోర్ట్‌గా నిలుస్తున్నారని చెప్పారు.
19,100 దిగువన నిఫ్టీ
రియల్టీ మినహా అన్ని సెక్టార్ల షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొనడంతో బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు మంగళవారం నష్టాల్లో ట్రేడయ్యాయి. సెన్సెక్స్ 238 పాయింట్లు (0.37 శాతం) తగ్గి 63,875 దగ్గర ముగిసింది. నిఫ్టీ 61 పాయింట్లు పడి 19,080 దగ్గర క్లోజయ్యింది. లాభాల్లో ఓపెన్ అయిన బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు ఇంట్రాడేలో నష్టాల్లోకి జారుకున్నాయి. నిఫ్టీలో ఎం అండ్ ఎం, సన్ ఫార్మా, ఐషర్ మోటార్స్, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, ఓఎన్‌జీసీ షేర్లు ఎక్కువగా పడ్డాయి. ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, టైటాన్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో క్లోజయ్యాయి.
రియల్టీ ఇండెక్స్ గ్రీన్‌లో ముగియగా, ఆటో, బ్యాంక్, హెల్త్‌కేర్ ఇండెక్స్‌లు అర శాతం మేర పడ్డాయి. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్, మిడ్‌క్యాప్ ఇండెక్స్‌లు ఫ్లాట్‌గా ముగిశాయి. బ్యాంకింగ్, ఆటో, ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొనడంతో బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు నెగెటివ్‌లో ట్రేడయ్యాయని కోటక్ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ శ్రీకాంత్ చౌహాన్ అన్నారు. సమీప భవిష్యత్‌లో మార్కెట్ రేంజ్ బౌండ్‌లో కదలొచ్చని చెప్పారు. డైలీ చార్ట్‌లో నిఫ్టీ బేరిష్ క్యాండిల్‌ను ఏర్పరిచిందని, ప్రస్తుత లెవెల్స్ నుంచి ఇండెక్స్‌లు మరింత పడే అవకాశం ఉందని అన్నారు. నిఫ్టీ 18,980 – 19,220 మధ్య కదులుతుందని ఆయన అంచనా వేశారు. 18,980 దిగువన ట్రేడర్లు తమ లాంగ్ పొజిషన్ల నుంచి ఎగ్జిట్ అవ్వడం మంచిదని అన్నారు.
బయటకు పోతున్న విదేశీ పెట్టుబడులు..
పెద్ద కంపెనీల సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ మెప్పించలేకపోవడం, యూఎస్ బాండ్ ఈల్డ్‌లు 18 ఏళ్ల గరిష్టాలకు చేరుకోవడంతో విదేశీ ఇన్వెస్ట్‌మెంట్లు (ఎఫ్‌పీఐ) ఇండియన్ ఈక్విటీ మార్కెట్ నుంచి పెద్ద మొత్తంలో వెళ్లిపోతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో నికరంగా 2.3 బిలియన్ డాలర్ల (రూ.19,100 కోట్ల) విలువైన షేర్లను అమ్మేసిన ఎఫ్‌పీఐలు , అక్టోబర్‌లో 2.6 బిలియన్ డాలర్ల (రూ.21,580 కోట్ల) పెట్టుబడులను బయటకు తీసేశారు. గత రెండు నెలల్లోనే 5 బిలియన్ డాలర్ల విలువైన ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్‌లు ఈక్విటీ మార్కెట్ నుంచి వెళ్లిపోయాయి. గత రెండు నెలల్లోని 37 ట్రేడింగ్ సెషన్లు జరగగా, ఇందులో 26 సెషన్లలో ఎఫ్‌పీఐలు నికర అమ్మకందారులుగా ఉన్నారు.
ఈ ఏడాది పాపులరైన ఇండెక్స్ ఫండ్‌లు..
1. యూటీఐ నిఫ్టీ నెక్స్ట్ 50 ఇండెక్స్ ఫండ్ డైరెక్ట్
2. యాక్సిస్ నిఫ్టీ నెక్స్ట్ 50 ఇండెక్స్ ఫండ్ డైరెక్ట్
3. మోతీలాల్ ఓస్వాల్ ఎస్ అండ్ పీ బీఎస్‌ఈ లో- వోలటాలిటీ ఇండెక్స్ ఫండ్ డైరెక్ట్
4. నిప్పాన్ ఇండియా నిఫ్టీ స్మాల్‌క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్ డైరెక్ట్
5. ఐడీఎఫ్‌సీ గిల్ట్ 2028 ఇండెక్స్ ఫండ్ డైరెక్ట్