వంగూరు, వెలుగు: మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో ఇండ్ల స్థలాల కేటాయింపు కోసం శుక్రవారం సర్పంచ్ కాయితీ భారతమ్మ అధ్యక్షతన జరిగిన గ్రామసభ రసాభసాగా మారింది. డీటీ వెంకటరమణ, జడ్పీటీసీ కెవిన్రెడ్డి, ఉప సర్పంచ్ వేమారెడ్డి హాజరయ్యారు. గ్రామ శివారులోని శ్రీశైలం హైవే పక్కన ఉన్న రాంనగర్ గేటు వద్ద ఉన్న ప్రభుత్వ భూమిని పేదల ఇండ్ల స్థలాలకు కేటాయించారు. ఆ స్థలాన్ని పంపిణీ చేసే కార్యక్రమంలో లబ్ధిదారులు ఆందోళనకు దిగారు.
అర్హులకు ఇవ్వకుండా బీఆర్ఎస్ కార్యకర్తలకే పంపిణీ చేస్తున్నారని అధికారులను నిలదీశారు. దీంతో గ్రామసభను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మరోసారి పరిశీలించి ఇండ్ల స్థలాలు పంపిణీ చేస్తామని, అర్హులకు అన్యాయం జరగకుండా చూస్తామని చెప్పడంతో లబ్ధిదారులు శాంతించారు.