గొర్రెల పంపిణీ ఎప్పుడో.. ఐదేండ్లుగా లబ్ధిదారుల ఎదురుచూపులు 

రాజన్న సిరిసిల్ల, వెలుగు  గొల్ల కుర్మలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు  రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ కార్యక్రమానికి  శ్రీకారం చుట్టింది.  కానీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో  ఐదేండ్ల నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తూనే ఉన్నారు. మొదటి విడత  గొర్రెల పంపిణీని 2017లో  ప్రారంభించారు.  మొదటి విడ త లో  అవకతవకలు జరగడంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది.  రెండో విడత గొర్రెల పంపిణీ  ఎప్పుడూ ఉంటుందోనని ఆశగా ఎదురుచూస్తున్నారు.  

రెండో విడత గొర్రెల పంపిణీకి ప్రారంభమైన  కదలిక 

రెండో విడత గొర్రెల పంపిణీ కోసం 4620  యూనిట్లు పెండింగ్ లో ఉన్నాయి.  ఐదేండ్ల నుంచి  జిల్లాలో గొర్రెల పంపిణీ  ముందుకు సాగడం లేదు.  ఇటీవల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జిల్లా అధికారులతో టెలి కాన్ఫరెన్స్​ నిర్వహించి  రెండో విడత పంపిణీని పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు.    జిల్లా కలెక్టర్​ రెండో విడత గొర్రెల పంపిణీ కోసం టెండర్ల ప్రక్రియ చేపట్టాలని పశుసంవర్థక శాఖ అధికారులను ఆదేశించారు.  లబ్ధిదారుల నుంచి వాటా ధనం సేకరించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. జిల్లాలో 255 గ్రామ పంచాయతీల పరిధిలో 192 సొసైటీలు ఉన్నాయి.  జిల్లాలో మొదటి విడత, రెండో విడత కలిపి 16,162 యూనిట్లను అందించేందుకు అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.  ఇప్పటి వరకు 11,542 యూనిట్లను అందించారు. మొదటి విడతలో 8,139 యూనిట్ల లక్ష్యానికి  7517 యూనిట్లు, రెండో విడతలో 8,015 యూనిట్లు పంపిణీ లక్ష్యం కాగా 4,125 పంపిణీ చేశారు. ఇందులో ఇప్పటి వరకు 4620 యూనిట్లు పంపిణీ చేయాల్సి ఉంది.

75 శాతం రాయితీ

గొర్రెల పంపిణీలో యూనిట్ ధరను ప్రభుత్వం పెంచింది.75 శాతం లబ్ధిదారుడికి రాయితీ లభించనుంది.  25 శాతం  వాటాధనం బెనిపిషరీస్ చెల్లిస్తారు.  జిల్లాలో 190 సొసైటీల్లో 18 సంవత్సరాలు నిండిన గొల్ల కుర్మలను సభ్యులుగా  చేర్చుకొని డ్రా పద్ధతి ద్వారా ఎంపిక చేస్తారు. 

మొదటి విడతలో అవకతవకలు 

మొదటి విడత గొర్రెల పంపిణీలో తీవ్ర అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. జిల్లాకు  కడప  నుంచి  తీసుకొచ్చిన గొర్రెల యూనిట్లను  రీసైక్లింగ్  చేసి జిల్లా యంత్రాంగం అభాసుపాలైంది.  గొర్రెలకు వేసిన ట్యాగ్ లను తొలగించి అమ్మేశారు. ఈ ఘటనలో పశుసంవర్థక శాఖ జిల్లా అధికారి, మండల పశువైద్యాధికారి సస్పెండ్ అయ్యారు.  గొర్రె ల యూనిట్లను అమ్ముకున్న లబ్ధిదారులపై కేసులు నమోదు చేశారు. రెండో విడతలో పంపిణీ పకడ్బం దీగా చేపట్టేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.  జియో ట్యాంగింగ్ తో పాటు  ప్రతి గొర్రెకు  బీ మా సౌకర్యం కల్పించనున్నారు.  గొర్రెలను కొనేం దు కు సమీపంలో ఉన్న  మార్కెట్లను మ్యాపింగ్ చేస్తున్నారు. దీని కోసం జిల్లా స్థాయిలో ప్రత్యేక  కమిటీలను వేస్తున్నారు.