మహబూబ్‌నగర్, వెలుగు : జిల్లాలో డబుల్‌బెడ్ రూం ఇండ్లలో సౌలత్లు లేక లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం ఎలాంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయకుండానే గృహ ప్రవేశాలు చేయించడంతో రోజూ కష్టాలు పడుతున్నారు. టాయిలెట్స్ఉన్నా.. డ్రైనేజీ పైపులు వేసి వదిలేయడంతో వాడుకోలేని పరిస్థితి ఉంది. తాగునీరు కూడా పదిరోజులకోసారి సరఫరా అవుతుండడంతో ఉండలేక తిరిగి పాత ఇండ్లలోకి వెళ్లిపోతున్నారు. ఈ సమస్యలపై ఇటీవల జరిగిన జడ్పీ మీటింగ్‌లో సభ్యులు కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లారు.
దేవరకద్ర నియోజకవర్గంలోని ముచ్చింతలలో 40 డబుల్బెడ్రూం ఇండ్లకు గాను 20 ఇండ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించారు. నిజాలాపూర్‌లో 104, కురుమూర్తిలో 140 , సిద్ధాయిపల్లిలో 288 ఇండ్లకు గాను 42 మంది లబ్ధిదారులకు ఇండ్లు పంచారు. సిద్ధాయిపల్లిలో మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ ఓపెన్ చేసి, లబ్ధిదారులతో స్వయంగా గృహ ప్రవేశం చేయించారు. అయితే, సిద్ధాయిపల్లిలో ఉన్న ఇండ్లతో పాటు నిజాలాపూర్, కురుమూర్తి, ముచ్చింతలలో లబ్ధిదారులకు కేటాయించిన ఇండ్లలో కనీస సౌకర్యాలు కల్పించలేదు. ఇండ్లు కట్టుడు పూర్తి చే శారు కానీ.. తాగునీరు, అండర్ డ్రైనేజీ , కరెంట్ సప్లై లాంటి పనులను ఎక్కడికక్కడే పెండింగ్‌లో పె ట్టారు. ఈ 4 ప్రాంతాల్లో తాగునీటికి ప్రజలు గోస ప డుతున్నారు. గ్రామాలకు దూరంగా ఈ కాలనీలు ఉండడంతో మినరల్ వాటర్ ప్లాంట్లు కూడా అందుబాటులో ఉండటం లేదు. చాలా ఇళ్లకు ‘భగీరథ’ కనెక్షన్లు ఇవ్వకపోవడంతో తాగునీరు లేక లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. కొన్ని ఏరియాల్లో కాలనీ మొత్తానికి ఒకే బోరు ఉండడంతో ఆ నీటినే అన్ని అవసరాలకు వాడుకుంటున్నారు. సిద్ధాయిపల్లి వద్ద ఉన్న ఇళ్లను 42 మందికి పంచగా ఆ కాలనీలో ప్రస్తుతం ఐదుగురు మాత్రమే ఉంటున్నారు.
ఏడాదిగా పనులు చేయట్లే..
సిద్ధాయిపల్లిలో ఆరు నెలల కింద, ముచ్చింతల, కురుమూర్తి, నిజాలాపూర్ లో ‘డబుల్’ ఇళ్లను ప్రారంభించి ఏడాది అవుతోంది. కానీ, ఇంత వరకు అండర్ డ్రైనేజీ పనులు పూర్తి చేయలేదు. కిచెన్, బాత్రూమ్స్, టాయ్‌లెట్స్‌లలో పైపులైన్లు, నల్లాలు ఫిట్ చేసినా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయ లేదు. ప్రస్తుతం అన్ని చోట్ల మురుగు నీరు మొత్తం బయటకే వస్తోంది. నిజాలాపూర్ డబుల్ఇండ్ల వద్ద అండర్ డ్రైనేజీ సిస్టం లేకపోవడంతో మురుగునీరంతా పక్కనే ఉన్న పంట పొలాల నుంచి దగ్గరలోని కుంటలోకి చేరుతోంది. దీంతో ఆ ప్రాంతమంతా కంపు వాసన వస్తోందని స్థానికులు వాపోతున్నారు.
కరెంటు కనెక్షన్లు కూడా ఇయ్యట్లే..
ఇండ్లలో కరెంటు కనెక్షన్లు కూడా ఇయ్యలేదు. కొన్ని ఇళ్లల్లో స్విచ్‌బోర్డులు, వైరింగ్ పనులు కూడా చేయలేదు. ఆదరాబాదరాగా కొన్ని ఇండ్లకు మాత్రమే స్విచ్ బోర్డులు, వైరింగ్ ఏర్పాటు చేశారు. దీంతో చాలా మంది లబ్ధిదారులు సొంతంగా హౌస్ వైరింగ్ చేయించుకున్నారు.
పనులు శాంక్షన్ అయినవి
‘కురుమూర్తి’, నిజాలాపూర్ ప్రాంతాల్లోని ‘డబుల్’ ఇండ్ల కాలనీలకు శానిటేషన్పనులు శాంక్షన్ అయ్యాయి. వాటికి టెండర్లు కూడా పూర్తయ్యాయి. త్వరలో పనులు ప్రారంభిస్తాం. సిద్ధాయిపల్లి వద్ద ఎలక్ర్టికల్ లైన్ పూర్తయింది. ఇండ్లలోకి కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. వాటర్ సప్లై పనులు కూడా ఆర్డబ్ల్యూఎస్ ఆఫీసర్లు త్వరలో పూర్తి చేస్తారు.
- రామకృష్ణ, డీఈ, పంచాయతీ రాజ్
డ్రైనేజీ లేక కంపు వాసన
మాకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చినప్పటి నుంచి ఇక్కడ డ్రైనేజీ లేదు. ఇండ్లలో నుంచి వచ్చే మురుగు నీళ్లు మొత్తం బయటకు వస్తున్నాయి. ఈ నీళ్లు పక్కనే ఉన్న పొలాల మీదుగా కుంటలోకి చేరుతున్నాయి. ఈ ప్రాంతమంతా కంపు వాసన వస్తోంది. దోమలు కూడా పెరుగుతున్నాయి.
- ప్రకాశ్, నిజాలాపూర్
పొలాల్లోకి వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నం
మాకు రెండేళ్ల కిందట డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చిండ్రు. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాం. కానీ, మాకు తాగునీళ్లు వస్తలేవు. ఉప్పు నీళ్లే వస్తున్నయ్. అవి కూడా పది రోజులుగా వస్తలేవు. పక్కనే ఉన్న పొలాల పొంటి పోయి నీళ్లు తెచ్చుకుంటున్నాం. ఆ నీళ్లనే తాగుతున్నాం.
- సునీత, నిజాలాపూర్