28 లోగా డబుల్​ బెడ్​రూమ్ ​ఇండ్ల లబ్ధిదారుల పరిశీలన పూర్తి చేయాలి

  • భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశం

భూపాలపల్లి అర్బన్, వెలుగు: ఈ నెల 28 లోపు డబుల్​ బెడ్​రూమ్​ఇండ్ల లబ్ధిదారుల పరిశీలన పూర్తి చేసి, రిపోర్టు అందజేయాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఇండ్ల కేటాయింపుపై మంగళవారం అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూపాలపల్లిలో నిర్మించిన ఇండ్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు వస్తున్నాయన్నారు. 

అనర్హులు ఉంటే వెంటనే గుర్తించేందుకు 8 టీమ్స్​ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దరఖాస్తుదారులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. అర్హులకు ఇండ్లు అందుతాయన్నారు. భూపాలపల్లిలోని భాస్కర గడ్డ వద్ద నిర్మించిన 416 ఇండ్ల కేటాయింపుపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వెంటనే రాత పూర్వకంగా అందజేయాలన్నారు. ఇండ్లు ఇప్పిస్తామంటూ ఎవరైనా ప్రలోభాలకు దిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

సమావేశంలో అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ అనిల్ పాల్గొన్నారు. అలాగే పలు రాజకీయ పార్టీల నాయకులు, తహసీల్దార్లు, ఎన్నికల సిబ్బందితో కలెక్టర్ భవేశ్​మిశ్రా సమావేశమయ్యారు. కొత్త పోలింగ్​కేంద్రాల ఏర్పాటుపై చర్చించారు. 1,500 మంది ఓటర్ల కంటే ఎక్కువ ఉంటే కొత్త కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు.