- కరీంనగర్ కలెక్టరేట్ ముట్టడికి హుజూరాబాద్ లబ్ధిదారుల యత్నం
- గత ప్రభుత్వం సగం పైసలే ఇచ్చిందని ఆవేదన
కరీంనగర్, వెలుగు: దళితబంధు స్కీమ్ లో రెండో విడత రావాల్సిన రూ.5 లక్షలు తమ అకౌంట్లలో జమ చేయాలని డిమాండ్ చేస్తూ హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులు సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు. అప్పటికే అక్కడ బందోబస్తులో ఉన్న పోలీసులు అటువైపు వెళ్లిన లబ్ధిదారులను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు.
ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విడతలవారీగా పది నుంచి 20 మంది చొప్పున కలెక్టరేట్ వైపు నినాదాలు చేస్తూ దూసుకెళ్లారు. వెంటనే పోలీసులు వారిని అరెస్ట్ చేయడంతో కలెక్టరేట్ వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది. హుజూరాబాద్ బైపోల్ సందర్భంగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దళితబంధును ప్రవేశపెట్టడంతో పాటు ఈ నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గంలో సుమారు 18,021 మందిని లబ్ధిదారులుగా గుర్తించారు.
వారిలో సుమారు 13,400 మందికి పూర్తి స్థాయిలో పథకం వర్తింపజేయగా మరో 4,600 మందికి మాత్రం గత ప్రభుత్వం రూ.5 లక్షలు మాత్రమే జమ చేసింది. ఎన్నికల షెడ్యూల్ రావడానికి నెలన్నర ముందు నుంచే కరీంనగర్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సెలవులో వెళ్లడంతో లబ్ధిదారులకు డబ్బులు జమచేసే ప్రక్రియ నిలిచిపోయింది. ఉద్దేశపూర్వకంగానే ఆయన అందుబాటులో లేకుండానే వెళ్లారనే విమర్శలు ఉన్నాయి. ఈ లోపు అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో లబ్ధిదారుల ఖాతాల్లో మిగతా రూ.5 లక్షలు జమచేయలేదు.
అప్పులు తెచ్చి యూనిట్లు ప్రారంభించామని, కొత్త ప్రభుత్వమైనా తమకు మిగతా డబ్బులు ఇవ్వాలని లబ్ధిదారులు సోమవారం కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. లబ్ధిదారులు మాట్లాడుతూ దళితబంధు స్కీమ్ లో ఎంపికైన తమకు గత ప్రభుత్వం సగం పైసలే ఇచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పైసలు వస్తాయనన్న ఆశతో అప్పులు చేసి డెయిరీ, సిమెంట్, ఐరన్, సెంట్రింగ్ తదితర యూనిట్లు ప్రారంభించామని, ఎన్నికల కోడ్ పేరు చెప్పి సగం పైసలే జమచేశారని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వమైనా మిగతా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. వినతిపత్రాలు తమకు ఇస్తే కలెక్టర్ కు ఇస్తామని చెప్పి ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినకపోవడంతో అరెస్ట్ చేసి పోలీస్ ట్రైనింగ్ కాలేజీకి తరలించారు. సాయంత్రం విడుల చేశారు. అంతకుముందు మరికొందరు లబ్ధిదారులను మానకొండూరు వద్దే అడ్డుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.