అలాట్​ చేసిన ‘డబుల్’​ ఇండ్లను అప్పగించాలి: లబ్ధిదారుల నిరసన 

అలాట్​ చేసిన ‘డబుల్’​ ఇండ్లను అప్పగించాలి: లబ్ధిదారుల నిరసన 
  • గోషామహల్ కు చెందిన 145 మంది లబ్ధిదారుల నిరసన
  • జీహెచ్ఎంసీ కమిషనర్​కు వినతి

హైదరాబాద్, వెలుగు: గోషామహల్ నియోజకవర్గంలోని దూల్​పేటలో తమకు కేటాయించిన డబుల్​బెడ్​రూమ్​ఇండ్లను వెంటనే అప్పగించాలని 145 మంది లబ్ధిదారులు శుక్రవారం జీహెచ్ఎంసీ హెడ్డాఫీస్​ముందు నిరసనకు దిగారు. తర్వాత కమిషనర్​ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మూడో విడత పంపిణీలో భాగంగా, లాటరీ పద్ధతిన 1,672 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారని గుర్తుచేశారు.

అధికారులు మొదట అందరికీ కొల్లూరులోని ఇండ్లను అప్పగిస్తామని చెప్పారని, తర్వాత లిస్టులోని మొదటి 145 మందికి దూల్​పేటలో కేటాయిస్తామని నిర్ణయించారన్నారు. సీరియల్​నంబర్​146 నుంచి 1,672 వరకు కొల్లూరులో కేటాయించారని, తమకు మాత్రం దూల్​పేటలోని ఇండ్లను అప్పగించకుండా పెండింగ్​పెట్టారని వాపోయారు.

ఎన్నికల కోడ్​ముగిసినా ఇంతవరకు ఇండ్లు అప్పగించలేదని, స్థానిక ఎమ్మెల్యే తమ ఇండ్లను ఇతరులకు ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి ముందుగా నిర్ణయించిన ప్రకారం 145 ఇండ్లను తమకే కేటాయించాలని కోరారు. అయితే ఈ145 మందికి కూడా కొల్లూరులోనే కేటాయించాలని హైదరాబాద్​జిల్లా కలెక్టర్​ఆలోచిస్తున్నట్లు సమాచారం. అక్కడి అధికారులతో మాట్లాడుతున్నట్లు తెలిసింది.