ఎమ్మెల్యే రారు.. చెక్కులు ఇవ్వరు

  • సూర్యాపేట నియోజకవర్గంలో.. కల్యాణలక్ష్మి చెక్కుల కోసం లబ్ధిదారుల నిరీక్షణ 
  • జగదీశ్​రెడ్డి రాకపోవడంతో పెండింగ్ 
  • 10 నెలలు కావడంతో బౌన్స్ అవుతున్న చెక్కులు 
  • ఎదురుచూస్తున్న 363 మంది లబ్ధిదారులు 

సూర్యాపేట, వెలుగు: దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించని చందంగా తయారైంది సూర్యాపేట నియోజకవర్గంలోని కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారుల పరిస్థితి. సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్​రెడ్డి నియోజవర్గానికి రావడం లేదు.. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ఇవ్వడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గానికి ఎమ్మెల్యే వస్తే కానీ సాయం అందే పరిస్థితి కనిపించడం లేదు. అప్లికేషన్లు ఎంక్వైరీ చేసి చెక్కులు వచ్చినా ఎమ్మెల్యే పంపిణీ చేయకపోవడంతో రెవెన్యూ యంత్రాంగానికి ఇబ్బందిగా మారింది. మరోవైపు 10 నెలలుగా చెక్కులు పెండింగ్ లో ఉంచడంతో బౌన్స్ అవుతున్నాయి. దీనితో ఎమ్మెల్యే ఎప్పుడొస్తారా.. చెక్కులు ఎప్పుడిస్తారా.. అని లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. 

10 నెలలుగా పెండింగ్.. 

సూర్యాపేట నియోజకవర్గంలో 2023–24 సంవత్సరానికి సంబంధించిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు 10 నెలలుగా పెండింగ్ లోనే ఉన్నాయి. మొదట నేరుగా లబ్ధిదారుల అకౌంట్ లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ డబ్బులు జమ అయ్యేవి. తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో చెక్కులు పంపిణీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో గతేడాది అక్టోబర్ లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ నిలిచిపోయింది.

అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో మరోసారి కోడ్ అమలులోకి రావడంతో చెక్కుల పంపిణీ మరింత ఆలస్యమైంది. ఈ రెండు ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఎమ్మెల్యే నియోజకవర్గానికి రాకుండా హైదరాబాద్ లోనే మకాం వేశారు. మరోవైపు విద్యుత్ కొనుగోళ్లలో మాజీ మంత్రిపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆయన పనులు చక్కబెట్టుకుంటున్నారు. ఎమ్మెల్యే నియోజకవర్గానికి రాకపోవడంతో రెవెన్యూ అధికారులు కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కులు పంపిణీ చేయకుండా జాప్యం చేస్తున్నారు. 

నియోజకవర్గంలో 363 మంది లబ్ధిదారులు..

సూర్యాపేట నియోజకవర్గంలో మొత్తం 363 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్​చెక్కులు అందించాల్సి ఉంది. నియోజకవర్గంలో మొత్తం నాలుగు మండలాలు ఉండగా,  సూర్యాపేట మండలంలో 166 మంది లబ్ధిదారులు, ఆత్మకూర్(ఎస్) మండలంలో 88, పెన్ పహాడ్ మండలంలో 63, చివ్వెంల మండలంలో 46 మంది లబ్ధిదారులకు చెక్కులు అందించాల్సి ఉంది. 10 నెలల్లో మూడు సార్లు చెక్కుల వ్యాలిడిటీ ముగియడంతో రెవెన్యూ అధికారులు చెక్కులను రెన్యువల్ చేసేందుకు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు 
చేస్తున్నారు.

ఎమ్మెల్యే కోసం ఎదురుచూస్తున్నాం.. 

సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి సమయం కోసం ఎదురుచూస్తున్నాం. ఆయన అందుబాటులో లేకపోవడంతో చెక్కుల పంపిణీ ఆలస్యమైంది. దీనితోపాటు వరుస ఎన్నికలు రావడంతో కోడ్ కారణంగా చెక్కులు పంపిణీ చేయలేకపోయాం. త్వరలోనే ఎమ్మెల్యే టైమ్ తీసుకొని లబ్ధిదారులకు చెక్కులు 
అందజేస్తాం. 


వేణుమాధవరావు, ఆర్డీవో, సూర్యాపేట