కొత్త రేషన్ కార్డులొచ్చేశాయ్ .. మే నుంచి లబ్ధిదారులకు బియ్యం పంపిణీ

కొత్త రేషన్ కార్డులొచ్చేశాయ్ .. మే నుంచి లబ్ధిదారులకు బియ్యం పంపిణీ
  • 97,821 అప్లికేషన్లు రాగా..21 వేల అప్లికేషన్లు వెరిఫై
  • తొలి విడతలో 405 కార్డులకు ఓకే
  • పాత కార్డుల్లో 20,133 కొత్త మెంబర్లు యాడ్​ 

యాదాద్రి, వెలుగు : జిల్లాలో తొలి విడతలో కొత్త రేషన్ కార్డులు వచ్చిన లబ్ధిదారులకు మే నుంచి సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కారు వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే సన్నబియ్యం పంపిణీ ప్రారంభించిన ప్రభుత్వం.. కొత్త రేషన్​కార్డుల పంపిణీపై దృష్టి పెట్టింది. మీ సేవ, గ్రామసభల్లో తీసుకున్న అప్లికేషన్లకు వెరిఫికేషన్ ప్రారంభించి, తొలుత కొన్ని కొత్త రేషన్​కార్డులు, పాత కార్డుల్లో కొత్త మెంబర్లను చేర్చడానికి ఓకే చెప్పింది. 

పదేండ్లు పవర్​లో ఉన్న గత బీఆర్ఎస్ సర్కారు.. 

కొత్త రేషన్​ కార్డుల పంపిణీపై గత ప్రభుత్వం పెద్దగా దృష్టి సారించలేదు. జిల్లావ్యాప్తంగా 2019లో 2,14,560 రేషన్​ కార్డులు ఉండగా, 6,71,533 యూనిట్లు (లబ్ధిదారులు) ఉన్నాయి. కొత్త కార్డులు, మెంబర్లను యాడ్​చేయాలని వేలాది మంది అప్లయ్ చేసుకున్నా పట్టించుకోలేదు. తాజా లెక్కల ప్రకారం జిల్లాలో 2,16,904 కార్డులు ఉండగా, 6,76,188 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఈ లెక్కన గత సర్కారు ఐదేండ్లలో 2,344 కార్డులు మాత్రమే అందించి, 4,655 మంది మెంబర్లను మాత్రమే యాడ్​చేసింది.​

కొత్త కార్డుల కోసం 97,821 అప్లికేషన్లు..

ప్రజా పాలనలో భాగంగా కొత్త రేషన్ కార్డుల కోసం డిసెంబర్ 28, 2023 నుంచి జనవరి 6, 2024 మధ్య అప్లికేషన్లను స్వీకరించింది.  ఆరు గ్యారంటీలతోపాటు ఇతర సంక్షేమ పథకాలకు రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకోవడంతో ప్రజల నుంచి కొత్త రేషన్ కార్డులకు అనూహ్య స్పందన వచ్చింది. మీ సేవ ద్వారా 1029 మంది అప్లికేషన్లు చేసుకోగా, గ్రామసభల్లో 96,792 మంది దరఖాస్తు చేసుకున్నారు. పాత కార్డుల్లో మెంబర్​గా యాడ్ చేయాలని 21,770 అప్లికేషన్లు వచ్చాయి. ఈ క్రమంలోనే రేషన్ కార్డుల పంపిణీకి సర్కారు నిర్ణయం తీసుకున్నది. 

405 కార్డులు, 20,133 మెంబర్లు ఓకే..

కొత్త కార్డుల కోసం వచ్చిన అప్లికేషన్లను ఆఫీసర్లు  స్క్రూటినీ చేశారు. తొలుత మీ సేవ ద్వారా వచ్చిన 1029 అప్లికేషన్లలో 89 తిరస్కరించారు. మిగిలిన వాటిలో ఇప్పటివరకు 405 ఓకే చేశారు. మిగిలిన అప్లికేషన్లు 535 వివిధ దశల్లో ఉన్నాయి. మరోవైపు గ్రామసభల్లో వచ్చిన 96,792 అప్లికేషన్లలో 20,379 వెరిఫై చేశారు. 76,413 పెండింగ్​లో ఉన్నాయి.  మెంబర్లుగా యాడ్ చేయడానికి వచ్చిన 21,770 అప్లికేషన్లను ఆఫీసర్లు వెరిఫై చేశారు. వీటిలో 63 అప్లికేషన్లను తిరస్కరించారు. 20,133 ఓకే చేయగా, 1,636 పెండింగ్​లో ఉన్నాయి. 

మే నుంచి కొత్త కార్డులకు బియ్యం..

ఈ ఏడాది ఏప్రిల్ కోటా ప్రకారం జిల్లాలో 2,16,904 కార్డులు ఉండగా, కుటుంబ సభ్యులు 6,76,188 మంది  ఉన్నారు. వీరికి 4,307 టన్నుల బియ్యం అందుతున్నాయి. అయితే తాజాగా మంజూరు చేసిన 405 రేషన్​కార్డులు పెంచిన20,133 మందికి మేలో బియ్యం పంపిణీ చేయనుంది. ఈ లెక్కన మే నెలలో 21,400 మందికి ఆరు కిలోల చొప్పున 1279 టన్నుల బియ్యం అందించనున్నారు. మొత్తంగా మేలో 5,587 టన్నుల సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. 

త్వరలో అర్హులకు కార్డులు 

కొత్త రేషన్​కార్డులు, మెంబర్ల యాడ్ కోసం వచ్చిన అప్లికేషన్ల వెరిఫికేషన్​నడుస్తోంది. ఇప్పటికే కొందరికి కొత్త కార్డులు మంజూరు చేయడంతోపాటు మెంబర్లను యాడ్ చేశాం. వీరికి మే నుంచి బియ్యం అందిస్తాం. మిగిలిన అప్లికేషన్లలో అర్హులను త్వరలోనే గుర్తించి కార్డులు పంపిణీ చేస్తాం.  

వీరారెడ్డి, అడిషనల్​కలెక్టర్​, యాదాద్రి