కోదాడ/మునగాల, వెలుగు : ఆపదలో ఉన్న పేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ ఉపయోగపడుతుందని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ చెప్పారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గానికి చెందిన పలువురికి మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బుధవారం క్యాంప్ ఆఫీస్‌లో అందజేశారు. మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బుర్ర సుధారాణి, కోదాడ ఎంపీపీ చింతా కవిత పాల్గొన్నారు. అనంతరం మునగాల మండలం గణపవరానికి చెందిన అరవపల్లి లక్ష్మయ్య ఫ్యామిలీకి రూ. 2 లక్షల ఇన్సూరెన్స్ చెక్కు అందజేశారు.
ఎల్‌వోసీ చెక్కు అందజేత
నేరేడుచర్ల, వెలుగు : సూర్యాపేట జిల్లా నేరేడుచర్లకు చెందిన బాలెన వెంకటకృష్ణ కూతురు నవ్యకు మంజూరైన ఎల్‌వోసీ చెక్కును బుధవారం ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారు ఎవరైనా తనను సంప్రదించవచ్చని చెప్పారు. అనంతరం కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళి అర్పించారు. మున్సిపల్ వైస్ చైర్మన్, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి, మండల అధ్యక్షుడు అరిబండి సురేశ్‌బాబు, గ్రంథాలయ చైర్మన్ గుర్రం మార్కండేయ పాల్గొన్నారు.
హామీల అమలులో టీఆర్‌ఎస్ విఫలం
సూర్యాపేట, వెలుగు : ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు విమర్శించారు. పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు బుధవారం సంకినేని సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమలు కానీ హామీ ఇస్తూ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందన్నారు. టీఆర్‌ఎస్ లీడర్లు అక్రమ ఇసుక రవాణా, లిక్కర్ స్కామ్, భూముల కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కేంద్రం ఇస్తున్న నిధులతో పథకాలు అమలు చేస్తూ, తామే నిధులు ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్ లీడర్ల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు.
ప్రజలు బీజేపీ వైపు చూస్తున్రు
యాదాద్రి, వెలుగు : టీఆర్‌ఎస్‌పై వ్యతిరేకత పెరగడంతో ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ చెప్పారు. యాదాద్రి జిల్లా గుండాలకు చెందిన పలువురు బుధవారం బీజేపీలో చేరారు. వారికి భిక్షమయ్యగౌడ్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేస్తే భవిష్యత్ మొత్తం మనదేనన్నారు. కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.
కొండా లక్ష్మణ్‌కు ఘన నివాళి
సూర్యాపేట/హాలియా/మిర్యాలగూడ, వెలుగు : కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని బుధవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. నల్గొండ జిల్లా హాలియాలో సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి, మిర్యాలగూడలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు, సూర్యాపేట కలెక్టరేట్‌లో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ ఫొటోకు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఆయన పోరాటం మరువలేనిదన్నారు.
పార్టీ మారిన లీడర్ల దిష్టిబొమ్మ దహనం
చండూరు, వెలుగు : నల్గొండ జిల్లా చండూరు జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, గట్టుప్పల్ ఎంపీటీసీ గీత శ్రీనివాస్, చెరిపల్లి భాస్కర్ పార్టీ మారడాన్ని నిరసిస్తూ టీఆర్‌ఎస్ లీడర్లు బుధవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇందులో భాగంగా పార్టీ మారిన లీడర్ల దిష్టిబొమ్మలతో బుధవారం గట్టుప్పల్‌లోశవయాత్ర నిర్వహించారు. అనంతరం స్థానిక చౌరస్తాలో వారి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి టీఆర్‌ఎస్‌తోనే సాధ్యం అవుతుందన్నారు. సర్పంచ్ రోజా, నాయకులు అచ్చని శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ నామని గోపాల్, ఇడం కైలాసం, బండారు చంద్రయ్య పాల్గొన్నారు.
ప్రొటోకాల్ పాటించని ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలి
యాదాద్రి, వెలుగు : ప్రొటోకాల్ పాటించని ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని భువనగిరి మున్సిపాలిటీకి చెందిన కాంగ్రెస్ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. టీయూఎఫ్ ఐడీసీ ఫండ్స్‌తో పట్టణంలో చేపట్టిన డెవలప్‌మెంట్ వర్క్స్ విషయాన్ని ఎంపీ కోమటిరెడ్డి, ప్రతిపక్ష ప్రజాప్రతినిధులకు చెప్పకపోవడాన్ని నిరసిస్తూ బుధవారం మున్సిపల్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ పొత్నక్ ప్రమోద్‌కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ నిధులతో చేపట్టిన డెవలప్‌మెంట్ వర్క్స్‌ను ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి టీఆర్‌ఎస్ కార్యక్రమంలా మారుస్తున్నారని ఆరోపించారు. నిధులు ఎమ్మెల్యే ఇంట్లో నుంచి తెస్తున్నారా ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు మరోసారి జరిగితే సహించేది లేదన్నారు.
విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యం
సూర్యాపేట/పెన్‌పహాడ్, వెలుగు : విద్యాభివృద్ధికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రయారిటీ ఇస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి చెప్పారు. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌లో నిర్మించిన కస్తూర్బా గాంధీ స్కూల్ బిల్డింగ్‌ను బుధవారం ప్రారభించారు. అనంతరం సూర్యాపేటలోని అగ్రికల్చర్ మార్కెట్ యార్డులోని కార్మికులకు యూనిఫామ్స్ పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడక ముందు 400 గురుకులాలే ఉండగా, ప్రస్తుతం 1150 జూనియర్ కాలేజీలను ప్రభుత్వం రెసిడెన్షియల్ కాలేజీలుగా మార్చిందన్నారు. టెన్త్ వరకే ఉన్న కస్తూర్బా స్కూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేశామని చెప్పారు. పైరవీలకు తావు లేకుండా మెరిట్ ప్రకారమే రెసిడెన్షియల్ స్కూళ్లలో సీట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. కొందరు ఐఏఎస్ ఆఫీసర్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, వారి మాటలను ప్రజలు నమ్మొద్దని సూచించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునేందుకే కేంద్రం విద్యుత్ చట్టాలను తీసుకొస్తోందన్నారు. రైతులకు నిరంతరం ఉచిత కరెంట్ ఇస్తున్నది ఒక్క తెలంగాణ రాష్ట్రమే అన్నారు. అంతకుముందు సీడ్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మించనున్న గోదాంకు శంకుస్థాపన చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎడ్యుకేషన్, వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ రావుల శ్రీధర్‌రెడ్డి, కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, జడ్పీ చైర్మన్ గుజ్జ దీపిక, పెన్‌పహాడ్ ఎంపీపీ నెమ్మాది భిక్షం, జడ్పీటీసీ మామిడి అనిత అంజయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పల లలిత ఆనంద్, సెక్రటరీ ఫసియొద్దీన్, మున్సిపల్ చైర్‌పర్సన్ పి.అన్నపూర్ణ పాల్గొన్నారు.
కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి
చండూరు, వెలుగు : నల్గొండ జిల్లా చండూరు మండలం బంగారుగడ్డలో బుధవారం టీఆర్‌ఎస్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి జగదీశ్‌రెడ్డి హాజరై మాట్లాడారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రధాని మోడీకి వణుకు పుట్టిస్తున్నాయన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు తమకూ కావాలని బీజేపీ పాలిత రాష్ట్రాల ప్రజలు అడుగుతున్నారని, ఇందుకే తెలంగాణపై కక్ష కట్టారన్నారు. కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి బీజేపీ దాడులను తిప్పుకొట్టారని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, నోముల భగత్, కార్పొరేషన్ చైర్మన్లు రామచంద్రనాయక్, శ్రీధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
రాజకీయాలకు అతీతంగా దళితబంధు
తుంగతుర్తి, వెలుగు : రాజకీయాలకు అతీతంగా దళితబంధు పథకాన్ని అందజేస్తున్నామని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ చెప్పారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీతో పాటు మండలంలోని తాటిపాముల, గుండెపురి గ్రామాలకు చెందిన పలువురు బుధవారం ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత బంధు పైలట్ ప్రాజెక్ట్ కింద తిరుమలగిరి మండలానికి మొదటి విడతలో రూ.50 కోట్లు రాగా రెండవ విడతలో రూ.170 కోట్లు మంజూరు అయ్యాయన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ పోతరాజు రజిని రాజశేఖర్, వైస్ చైర్మన్ ఎస్.రఘునందన్‌రెడ్డి, తిరుమణి యాదగిరి, ఎంపీపీ నెమరుగొమ్ముల స్నేహలత, జడ్పీటీసీ దూపటి అంజలి మల్లయ్య పాల్గొన్నారు.
తిరుమలగిరి పీఎస్‌ను తనిఖీ చేసిన ఎస్పీ
హాలియా, వెలుగు : నల్గొండ జిల్లా తిరుమలగిరి పోలీస్ స్టేషన్‌ను బుధవారం నల్గొండ ఎస్పీ రెమా రాజేశ్వరి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులను పరిశీలించిన అనంతరం, క్రైమ్ రేట్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ కొత్త బిల్డింగ్ నిర్మాణ విషయంపై ఎంపీపీ ఆంగోతు భగవాన్ నాయక్, జడ్పీటీసీ సూర్యభాష్యానాయక్, తహసీల్దార్ పాండునాయక్‌తో చర్చించారు.
రేషన్ డీలర్ పోస్టులకు అప్లై చేసుకోండి
హుజూర్‌నగర్, వెలుగు : సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ డివిజన్ పరిధిలో ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ల పోస్టులకు అప్లై చేసుకోవాలని ఆర్డీవో వెంకారెడ్డి బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గరిడేపల్లి మండలంలోని కుతుబ్‌షాపురం, గడ్డిపల్లి, మర్రికుంట, హుజూర్‌నగర్ మండలం కరక్కాయలగూడెం, గోపాలపురం, హుజూర్‌నగర్, మఠంపల్లి మండలం మఠంపల్లి, చెన్నాయిపాలెం, నేరేడుచర్ల మండలం ముకుందాపురం, నేరేడుచర్ల 2, తెలగరామయ్య గూడెం, పెంచికల్‌దిన్నె, చింతలపాలెం మండలంలోని చింతలపాలెం, దొండపాడు 2లో ఖాళీలు ఉన్నాయన్నారు. గ్రామానికి చెంది 18 నుంచి 40 ఏళ్ల లోపు ఉండి టెన్త్ పాసైన వారు అక్టోబర్15లోగా తహసీల్దార్ ఆఫీసుల్లో అప్లికేషన్లు ఇవ్వాలని సూచించారు.
ఉద్యోగులు మంచిపేరు తెచ్చుకోవాలి
సూర్యాపేట, వెలుగు : ఉద్యోగులు మంచిగా పనిచేసి పేరు తెచ్చుకోవాలని సూర్యాపేట జడ్పీ చైర్‌పర్సన్ గుజ్జ దీపికా యుగేందర్ సూచించారు. కారుణ్య నియామకం కింద ఎంపికైన వారికి బుధవారం అపాయింట్‌మెంట్ లెటర్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కారుణ్య నియామకం కింద ముగ్గురికి సబార్డినేట్ పోస్టులు కేటాఇయంచామన్నారు. కార్యక్రమంలో జడ్పీసీఈవో సురేశ్,
ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మర్రి యాదయ్య, నల్లగొండ జిల్లా శాఖ అధ్యక్షుడు సోమేశ్, సూర్యాపేట జిల్లా శాఖ అధ్యక్షుడు నాగయ్య పాల్గొన్నారు.
ఎవరైనా వేధిస్తే ధైర్యంగా ఫిర్యాదు చేయండి
సూర్యాపేట, వెలుగు : వేధింపులకు గురైన వారు ధైర్యంగా ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్ చెప్పారు. పోలీస్ భరోసా సెంటర్, షీ టీమ్స్ ఆధ్వర్యంలో ప్రజలకు, మహిళలకు అందించాల్సిన సేవలకు బుధవారం మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈవ్ టీజింగ్ జరిగే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలు, స్టూడెంట్లనువేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేధింపులకు గురైన వారు 100, జిల్లా షీ టీమ్స్ 8332901586, sheteamsuryapeta@gmail.com కు, భరోసా సెంటర్ 79011 58238 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. షీ టీమ్స్ ఇన్‌చార్జి డీఎస్పీ నాగభూషణం, డీసీఆర్‌బీ డీఎస్పీ రవి, ఎస్‌బీ సీఐ శ్రీనివాస్ పాల్గొన్నారు.