అబ్బా! వింటర్ వస్తే.. అన్నం తినాలనిపించట్లేదు. ఏది తిన్నా నోటికి రుచించట్లేదు” అంటారు చాలామంది. అలాగని తినకుండా ఉండలేం కదా. అలాగే పోషకాలన్నీ ఉండేలా చూసుకుని తినాలి. కాబట్టి అన్నం,కూరల బదులు ఇలా వెరైటీలు ట్రై చేయండి. లంచ్, డిన్నర్లకే కాదు..బ్రేక్ ఫాస్ట్‌లో కూడా ఇష్టంగా తింటారు. మరింకెందుకాలస్యం..వెంటనే ఈ రైస్ రెసిపీలు ఎలా తయారుచేయాలో ఇక్కడ చదివేయండి.
పెప్పర్ రైస్
కావాల్సినవి :
- బియ్యం – ఒక కప్పు, నీళ్లు – రెండు కప్పులు, ఉప్పు – సరిపడా
- ఎండు మిర్చి – రెండు, నల్ల మిరియాలు – ఒక టేబుల్ స్పూన్
- నూనె – ఒక టీస్పూన్, జీలకర్ర – అర టీస్పూన్, నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి – పది, కరివేపాకు – కొంచెం, ఇంగువ – చిటికెడు జీడిపప్పులు – మూడు టేబుల్ స్పూన్లు, ఉల్లిగడ్డ తరుగు – పావుకప్పు టొమాటో – ఒకటి
తయారీ :
ప్రెజర్ కుక్కర్లో కడిగిన బియ్యం వేసి, నీళ్లు పోసి, ఉప్పు చల్లాలి. మూతపెట్టి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. పాన్‌లో నూనె వేడి చేసి అందులో మిరియాలు, ఎండు మిర్చి, జీలకర్ర వేసి వేగించాలి. అవి వేగాక వాటిని ఒక ప్లేట్లోకి తీయాలి. అవి చల్లారాక వాటిని గ్రైండ్ చేయాలి. పాన్‌లో నెయ్యి వేసి వెల్లుల్లి, కరివేపాకు, ఇంగువ, జీడిపప్పులు వేసి వేగించాలి. తర్వాత ఉల్లిగడ్డ తరుగు కూడా వేసి, అది వేగాక టొమాటో తరుగు వేయాలి. ఆపై పసుపు, ఉప్పుతోపాటు రెడీగా ఉన్న అన్నం కూడా వేసి కలపాలి. ఆ తర్వాత రెడీ చేసుకున్న మిరియాల మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలపాలి. చివరిగా కొత్తిమీర చల్లుకుంటే సరి.
గ్రీన్ పులావ్
కావాల్సినవి :
- నూనె – మూడు టేబుల్ స్పూన్లు
- జీలకర్ర – ఒకటిన్నర టీస్పూన్లు
- లవంగాలు – మూడు
- బిర్యానీ ఆకులు – రెండు
- ఉల్లికాడల తరుగు, పాలకూర పేస్ట్ – ఒక్కోటి అర కప్పు, వెల్లుల్లి తరుగు – ఒక టేబుల్ స్పూన్
- అల్లం, వెల్లుల్లి పేస్ట్ – అర టేబుల్ స్పూన్
- క్యాప్సికమ్ – ఒకటి
- పచ్చిబటానీ – పావు కప్పు
- ఉప్పు – సరిపడా, పసుపు – పావు టీస్పూన్
- పావ్ భాజీ మసాలా – రెండు టీస్పూన్లు
- నీళ్లు – పావు కప్పు, బాస్మతీ అన్నం – మూడు కప్పులు
- మేతీ చూర్ పౌడర్ – పావు టీస్పూన్
- నిమ్మరసం, గరం మసాలా – ఒక్కోటి అర టేబుల్ స్పూన్, కొత్తిమీర, నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు
తయారీ :
పాన్‌లో నూనె వేడి చేసి అందులో జీలకర్ర, లవంగాలు, బిర్యానీ ఆకులు, ఉల్లికాడలు, వెల్లుల్లి తరుగు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి వేగించాలి. క్యాప్సికమ్ తరుగు, పచ్చిబటానీ, ఉప్పు, పసుపు, పావ్ భాజీ మసాలా వేసి కలపాలి. తర్వాత అందులో నీళ్లు పోసి ఉడికించాలి. ఆపై పాలకూర పేస్ట్ వేసి కలిపాక, బాస్మతీ అన్నం కూడా వేసి బాగా కలపాలి. కావాలంటే మేతీ చూర్ పౌడర్, నిమ్మరసం కూడా వేసి కలపాలి. ఫైనల్‌గా కొత్తిమీర చల్లి, నెయ్యి వేసి కలిపితే వేడి వేడిగా గ్రీన్ పులావ్ రెడీ.
గ్లారిక్ టర్మరిక్ రైస్
కావాల్సినవి :
అన్నం – మూడు కప్పులు, వెల్లుల్లి రెబ్బలు – ఐదు, బటానీలు, క్యారెట్ తరుగు – ఒక కప్పు, మొక్కజొన్న గింజలు – అర కప్పు, ఉల్లికాడలు – రెండు, రెడ్, గ్రీన్ క్యాప్సికమ్‌లు – ఒక్కోటి, ఉల్లిగడ్డ తరుగు – పావు కప్పు, ఉప్పు – సరిపడా, వెన్న – రెండు టేబుల్ స్పూన్లు, జీలకర్ర, మిరియాలు – ఒక్కోటి అర టీస్పూన్, పసుపు, చిల్లీ ఫ్లేక్స్, గరం మసాలా – ఒక్కో టీస్పూన్
తయారీ :
పాన్‌లో వెన్న వేడి చేసి అందులో ఉల్లిగడ్డ తరుగు, బటానీలు, క్యారెట్, రెడ్, గ్రీన్ క్యాప్సికమ్ తరుగు, మొక్కజొన్న గింజలు వేసి వేగించాలి. తర్వాత అందులో చిల్లీ ఫ్లేక్స్, గరం మసాలా, మిరియాల పొడి, పసుపు, ఉప్పు వేసి కలపాలి. ఆ మిశ్రమంలో అన్నం కూడా వేసి అన్నీ కలిసేలా బాగా కలపాలి. చివరిగా ఉల్లికాడల తరుగు కూడా వేసి కలిపితే కలర్‌ఫుల్ రైస్ రెడీ.