మోదీజీ.. జవాబివ్వలేదేం : మమతా బెనర్జీ

  • కోల్​కతా ఘటనపై నేరుగా స్పందించండి: మమతా బెనర్జీ
  • 22వ తేదీన లేఖ రాసినా సమాధానం లేదు
  • అందుకే మళ్లీ లెటర్ రాస్తున్న
  • మహిళలపై అఘాయిత్యాలు అరికట్టాలని విజ్ఞప్తి

కోల్​కతా: కోల్​కతా ట్రైనీ డాక్టర్​పై జరిగిన అత్యాచారం, హత్య ఘటనలో నేరుగా స్పందించాలని ప్రధాని నరేంద్ర మోదీని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోరారు. 22వ తేదీన ఈ ఘటనపై తాను లేఖ రాసినా ఎలాంటి సమాధానం రాలేదని శుక్రవారం రాసిన మరో లెటర్​లో ఆమె పేర్కొన్నారు. గతంలో తాను రాసిన లేఖకు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ నుంచి రిప్లై వచ్చిందని లేఖలో ప్రస్తావించారు. కోల్​కతా ఘటన చాలా సున్నితమైన అంశమని, ప్రధానియే నేరుగా స్పందించాలని కోరారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి నిందితులను 15 రోజుల్లోనే కఠినంగా శిక్షించేలా చట్టాలు తీసుకురావాలని కోరినట్లు ఆమె తెలిపారు. వారం దాటినా జవాబు రాకపోవడంతోనే రెండో లేఖ రాస్తున్నట్లు వివరించారు. 

ఈమేరకు శుక్రవారం రాసిన లేఖను ట్వీట్​ చేశారు. ‘‘కోల్‌‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్ ఘటన తర్వాత దేశంలో మహిళలపై జరిగే దారుణాల్ని అరికట్టేలా కఠిన చట్టాలు అమలు చేయాలి. ఈ కేసును బెంగాల్‌‌ ప్రభుత్వం సీరియస్‌‌గా తీసుకున్నది. దేశవ్యాప్తంగా రోజుకు 90 మంది మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఈ దారుణాల్లో బాధితులు హత్యకు గురవుతున్నారు. ఈ దారుణాలకు ముగింపు పలకాల్సిన అవసరం ఉన్నది. మహిళలు, చిన్నారులకు రక్షణ కల్పించాలి. తాము సేఫ్​గా ఉన్నామనే భరోసా వారిలో తీసుకురావాలి’’ అని మమతా బెనర్జీ అన్నారు.

మీ మౌనం.. బాధను మరింత పెంచుతున్నది

ప్రధాని నరేంద్ర మోదీ నుంచి సమాధానం రాకపోవడం బాధేస్తున్నదని సీఎం మమతా బెనర్జీ అన్నారు. ‘‘మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు జరిగితే సత్వర విచారణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా అదనంగా 88 ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు (ఎఫ్​టీఎస్​సీ)లు, 62 పోక్సో కోర్టులు, పది ఎక్స్​క్లూజివ్ పోక్సో కోర్టులు ఏర్పాటు చేశాం. వీటి నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వమే నిధులు ఇస్తున్నది. ఈ కోర్టుల్లో పర్మినెంట్ జడ్జీలు లేరు. 

ప్రధాని మోదీ జోక్యం చేసుకుని జడ్జీల నియామకాలకు అనుమతి ఇవ్వాలి’’ అని మమతా బెనర్జీ అన్నారు. కాగా, 22న మమతా బెనర్జీ రాసిన లేఖపై కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణా దేవి ఆగ్రహం వ్యక్తంచేశారు. బెంగాల్​లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉన్నప్పటికీ... పనితీరు బాగాలేదని విమర్శించారు. మహిళలకు భద్రత కల్పించడంలో బెంగాల్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.