ముందస్తు సమాచారం ఇవ్వలే : బెంగాల్​ సీఎం మమత

ముందస్తు సమాచారం ఇవ్వలే : బెంగాల్​ సీఎం మమత
  • డీవీసీ నుంచి నీటి విడుదలపై బెంగాల్​ సీఎం మమత
  • ప్రధాని నరేంద్ర మోదీకి మరో లేఖ రాసిన దీదీ
  • వరదలతో 50 లక్షల మందికిపైగా ప్రజలు నష్టపోయారని వెల్లడి

కోల్​కతా: బెంగాల్​ను ముంచెత్తిన వరదలపై ప్రధాని నరేంద్ర మోదీకి ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ మరో మారు లేఖ రాశారు. తమ రాష్ట్రాన్ని సంప్రదించకుండానే రిజర్వాయర్లనుంచి దామోదర్​వ్యాలీ కార్పొరేషన్​(డీవీసీ) నీటిని విడుదల చేసిందని తెలిపారు. దీంతో వరదలు సంభవించి, 50 లక్షల మందికిపైగా ప్రజలు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. కేంద్ర సర్కారు వెంటనే నిధులు మంజూరుచేయాలని కోరారు. 

కాగా, పీఎం మోదీకి మమతా బెనర్జీ రాసిన మొదటి లేఖపై కేంద్ర జల్​శక్తి మంత్రి సీఆర్​పాటిల్​స్పందిస్తూ.. రిజర్వాయర్లనుంచి నీటిని విడుదల చేసేటప్పుడు ప్రతి స్టేజ్​లో తమ అధికారులు బెంగాల్​ సర్కారుకు సమాచారం ఇచ్చారన్నారు. తీవ్ర కరువును ఎదుర్కొనేందుకు ఈ నీటి విడుదల తప్పనిసరని చెప్పారు. 

ఏకపక్షంగా నిర్ణయాలు..

కేంద్ర జల్​శక్తి మంత్రి సీఆర్​పాటిల్​వ్యాఖ్యలను మమత తోసిపుచ్చారు. ‘‘అన్ని కీలక నిర్ణయాలు సెంట్రల్​వాటర్​కమిషన్, జల్​శక్తి మంత్రిత్వశాఖ ఏకపక్షంగా తీసుకుంటాయి” అని తెలిపారు. నీటిని విడుదల చేసేటప్పుడు తమ​ప్రభుత్వంతో చర్చించాలె. కానీ, అలా జరగలేదని అన్నారు. రాష్ట్ర సర్కారుకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే కొన్నిసార్లు నీటిని విడుదల చేస్తున్నారని, తమ అభిప్రాయాలను గౌరవించడం లేదని తెలిపారు. 

రిజర్వాయర్లనుంచి తొమ్మిది గంటలపాటు నీటిని విడుదల చేసినప్పుడు కేవలం 3 గంటల ముందే సమాచారం ఇచ్చారని, అంత తక్కువ సమయంలో అత్యవసర సహాయక చర్యలు తీసుకోవడం కుదరదని అన్నారు.