చొరబాట్లు ఆగితేనే బెంగాల్​లో శాంతి...కేంద్ర హోంమంత్రి అమిత్ షా

చొరబాట్లు ఆగితేనే బెంగాల్​లో శాంతి...కేంద్ర హోంమంత్రి అమిత్ షా

కోల్ కతా: పొరుగు దేశాల నుంచి చొరబాట్లు ఆగినపుడే బెంగాల్​లో శాంతిని నెలకొల్పవచ్చని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో మార్పు తీసుకురావాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. పెట్రాపోల్ లో కొత్త ప్యాసింజర్  టెర్మినల్  బిల్డింగ్, కార్గో గేట్ ను షా ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బెంగాల్ లో శాంతిని నెలకొల్పడంలో పోర్టులు ప్రధాన పాత్ర పోషిస్తాయన్నారు.

‘‘చొరబాట్లు పెరిగినప్పుడు దేశంలో శాంతిభద్రతల సమస్య వస్తుంది. పొరుగు దేశాలతో సంబంధాలు, కనెక్టివిటీని మెరుగుపర్చుకోవడంలో పోర్టులు కీలకపాత్ర పోషిస్తాయి. అలాగే, ఆ దేశాలతో వ్యాపార సంబంధాలు పెంచడంలోనూ సాయపడతాయి. పెట్రాపోల్ లో ఆధునిక ల్యాండ్ పోర్టుతో పొరుగు దేశాల మధ్య మైత్రి కుదురుతుంది. స్మగ్లింగ్ కూ అడ్డుకట్ట పడుతుంది.

ఇండియా, బంగ్లాదేశ్  మధ్య 70 శాతం కన్నా ఎక్కువ వాణిజ్యం పెట్రాపోల్  ద్వారానే జరుగుతుంది” అని షా అన్నారు. ఈ సందర్భంగా టీఎంసీ సర్కారుపై ఆయన తీవ్రంగా విమర్శలు చేశారు. 2014లో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి హెల్త్  వంటి రంగాల్లో చాలా కార్యక్రమాలు ప్రారంభించామని... కానీ, హెల్త్  సెక్టార్  బెనిఫిట్లు బెంగాల్  ప్రజలకు దక్కలేదని తెలిపారు. 2026లో అలా జరగదని, అప్పటి నుంచి ప్రజలకు మంచి రోజులు వస్తాయన్నారు.