ట్రాఫిక్ అంటే భయపడ్డారు: మెట్రో స్టేషన్ల దగ్గర కిలోమీటర్ క్యూ..

ట్రాఫిక్ అంటే భయపడ్డారు: మెట్రో స్టేషన్ల దగ్గర కిలోమీటర్ క్యూ..

మెట్రో జర్నీ.. సిటీలో రియల్లీ హ్యాపీనే అని చెప్పాలి.. ట్రాఫిక్, పొల్యూషన్ నుంచి హ్యాపీగా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లొచ్చు.. రోజురోజుకు రోడ్లపై పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తప్పించుకునేందుకు.. చాలా మంది మెట్రో వైపు మళ్లుతున్నారు.

దేశంలోనే ట్రాఫిక్ రద్దీకి పేరుగాంచిన బెంగళూరు సిటీలో.. ట్రాఫిక్ అంటే చాలు వణికిపోవటమే.. ఈ క్రమంలోనే 2024, నవంబర్ 4వ తేదీ బెంగళూరు సిటీలోని నాగసంద్ర మెట్రో స్టేషన్ దగ్గర అరుదైన దృశ్యం దేశం మొత్తాన్ని ఆకర్షించింది. మెట్రో స్టేషన్ దగ్గర కిలోమీటర్ క్యూ కనిపించింది. వెళితే మెట్రోలోనే వెళతాం.. ఎంతసేపు అయినా పర్వాలేదు అన్నట్లు ప్రయాణికులు కిలోమీటర్ క్యూలో అలాగే నిల్చున్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అసలు ఈ పరిస్థితికి కారణం ఏంటంటే.. దీపావళి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లిన వాళ్లంతా పండగ అయిపోయాక బెంగళూరుకు రిటర్న్ అయ్యారు. ఉత్తర కర్నాటకలోని దాదాపు 22 జిల్లాల నుంచి సిటీలో స్థిరపడిన, జాబ్స్ చేస్తున్న పబ్లిక్ తిరిగి సిటీకి వచ్చారు. బెంగళూరు ట్రాఫిక్కు భయపడి మొత్తం మెట్రో ట్రైన్ బాట పట్టారు. ఇంకేముంది.. కట్ చేస్తే ఇదీ సీన్. నాగసంద్ర మెట్రో స్టేషన్ జన సంద్రమైంది.

ఒక్క ఈ మెట్రో స్టేషన్ దగ్గరే కాదు గోరగుంటెపాళ్య, యశ్వంత్‌పూర్ దగ్గర కూడా సేమ్ సీన్ కనిపించింది. నాగసంద్ర మెట్రో స్టేషన్ మాత్రమే గ్రీన్ లైన్ కావడంతో మిగిలిన మెట్రో స్టేషన్ల దగ్గర కంటే ఎక్కువ రష్ కనిపించింది. మరో మూడు మెట్రో స్టేషన్లలో గ్రీన్ లైన్ ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ ఇంకా కార్యరూపం దాల్చలేదు. మెట్రో లైన్ ను పొడిగించకపోవడంపై కూడా ప్రయాణికుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం బెంగళూరు మెట్రో గ్రీన్ లైన్ 29 స్టేషన్లను కవర్ చేస్తుంది. నాగసంద్ర నుంచి తుమకూరు రోడ్ టూ కనకపుర రోడ్ సిల్క్ ఇన్స్టిట్యూట్. ఇదీ బెంగళూరు మెట్రో గ్రీన్ లైన్ పరిధి. నాగసంద్ర నుంచి మంజునాథ్ నగర్, చిక్క బిదరకల్లు, మాదవర వరకూ మెట్రో పనులు కొనసాగుతున్నాయి. రైల్వే టెస్ట్లు కూడా చేస్తున్నారు. ఈ రూట్ ప్రారంభం కాకపోవడానికి కర్నాటకలోని రాజకీయ పరిస్థితులే కారణమని నగరవాసులు మండిపడుతున్నారు.