బెంగళూరులో ట్యూషన్ కు అని వెళ్లి 2024 జనవరి 21వ తేదీ ఆదివారం రోజున అదృశ్యమైన 12 ఏళ్ల బాలుడు ఆచూకీ జనవరి 24వ తేదీ బుధవారం హైదరాబాద్‌లోని నాంపల్లి మెట్రో స్టేషన్‌లో లభించింది. సీసీటీవీ కెమెరాల ఆధారంగా బాలుడిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. తమ బిడ్డ ఆచూకీ కనిపెట్టిన పోలీసులకు బాలుడి తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే.. గుంజూర్‌లోని డెన్ అకాడమీ స్కూల్‌లో 6వ తరగతి చదువుతున్న పరిణవ్ అనే బాలుడు ఆదివారం ట్యూషన్‌కు అని చెప్పి వెళ్లాడు. ఆ తరువాత నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో వైట్‌ఫీల్డ్ పోలీస్ స్టేషన్‌లో బాలుడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా వారు వెంటనే విచారణ చేపట్టారు. బాలుడు తన తండ్రితో కలిసి మధ్యాహ్నం 12.15 గంటల సమయంలో ట్యూషన్ కు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో కావేరీ ఆస్పత్రిలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో బాలుడు చివరగా కనిపించాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఆ బాలుడి వద్ద డబ్బులు, మొబైల్ ఫోన్ కూడా లేవు.
సీసీటీవీ ఫుటేజీల ద్వారా పోలీసులు అతడిని పట్టుకునే ప్రయత్నం చేసేలోపే ఒక చోటి నుంచి మరోచోటికి వెళ్లిపోయాడు బాలుడు. అప్పుడే సోషల్ మీడియా రంగంలోకి దిగింది. బాలుడి పోస్టర్లను ఆన్ లైన్ లో సర్క్యులేట్ చేశారు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం హైదరాబాద్ వచ్చిన బెంగళూరు వాసి ఆ బాలుడిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని అతన్ని పట్టుకుని బాలుడి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అయితే ఆ బాలుడు బెంగళూరు నుంచి హైదరాబాద్ కు ఎలా వచ్చాడో ఇంకా తెలియరాలేదు.
అంతకుముందు పరిణవ్ ఇంటికి తిరిగి రావాలని కోరుతూ అతని తల్లి ఓ వీడియో చేయగా.. తాజాగా ఇప్పుడు మరో వీడియోను పోస్ట్ చేసింది. ఇది కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన కుమారుడి ఆచూకీ కనుగొనడంలో తమకు సహాయం చేసిన వారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపింది. కుమారుడిని కలుసుకునేందుకు తన భర్తతో కలిసి హైదరాబాద్ కు బయలుదేరింది.
PARINAV has been found at Nampally metro station, Hyderabad. He is safe & parents are going to pick him up
— Karnataka Weather (@Bnglrweatherman) January 24, 2024
Thank you to each one of you for your efforts ? https://t.co/OlwcU8Aia6 pic.twitter.com/u5FD6at1rV