
బెంగళూరు: బెంగళూరులో మధ్య తరగతి ప్రజల నెత్తిన పెద్ద పిడుగే పడింది. బెంగళూరు నగరంలో మెట్రో రైలు టికెట్ ధరలు, బస్ టికెట్ల ధరలు ఇటీవల భారీగా పెరగడంతో సామాన్య, మధ్య తరగతి జనం అల్లాడిపోతున్నారు. ఇప్పుడు మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా బెంగళూరులో ఆటో ఛార్జీల బాదుడుకు లైన్ క్లియర్ అయింది.
బెంగళూరులోని పలు ఆటో యూనియన్ల డిమాండ్లకు ప్రభుత్వం ఎట్టకేలకు తలొగ్గింది. ఇకపై.. బెంగళూరు పరిధిలో ఒక చోట ఎక్కి మరో చోట దిగితే మినిమం ఛార్జ్ 40 రూపాయలు వసూలు చేయాలని ఆటో యూనియన్లు డిసైడ్ అయ్యాయి. ప్రతీ కిలోమీటరుకు 20 రూపాయలు తీసుకునే అవకాశం కూడా ఇవ్వాలని ఆటో యూనియన్ల ప్రతినిధులు చేసిన ప్రతిపాదనపై ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది.
Also Read:-హైదరాబాద్లో కిరాణా షాపుల్లో నూనె కొంటున్నారా..?
ఇందుకు సంబంధించిన విధివిధానాలపై బెంగళూరు సిటీ డిస్ట్రిక్ట్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మీటింగ్ త్వరలోనే ఉండనుంది. అంటే.. ఇకపై బెంగళూరు నగరంలో ఒకచోట ఎక్కి మరో చోట దిగితే మినిమం ఛార్జ్ 40 రూపాయలు. ఒక్కో కిలోమీటరకు 20 రూపాయలు ఆటో డ్రైవర్కు సమర్పించుకోవాల్సిందే.
ఆటో ఛార్జీలు పెరిగితే ఆటోమేటిక్గా ర్యాపిడో, ఉబర్ కూడా ఛార్జీలను పెంచే అవకాశం లేకపోలేదు. ఎల్పీజీ ధరలు పెరిగాయని, వెహికల్ రిపేర్ ఖర్చులు పెరిగాయని.. వీటికి తోడు ఉబర్, ఓలా, ర్యాపిడోల వల్ల తమకు నష్టం వాటిల్లుతుందని.. ఈ క్రమంలో ఆటో ఛార్జీలు ఈమాత్రం పెంచక తప్పదని ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ (ARDU) ప్రతినిధులు తేల్చి చెప్పారు.
2025, ఫిబ్రవరి 9వ తేదీ నుంచి బెంగళూరు మెట్రో రైల్ టికెట్ ధరలను దాదాపు 91 శాతం పెంచిన సంగతి తెలిసిందే. మరీ ఈ స్థాయిలో మెట్రో టికెట్ ధరలు పెంచడంతో మెట్రో రైల్ ఆక్యుపెన్సీ ఘోరంగా పడిపోయింది. ఛార్జీలు పెంచిన పదే పది రోజుల్లో రోజుకు 6 లక్షల మంది మెట్రో ప్రయాణికుల సంఖ్య తగ్గిపోయింది.
2025 జనవరిలో కర్ణాటక వ్యాప్తంగా బస్ టికెట్ ధరలను 15 శాతం పెంచుతూ కర్ణాటక కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇలా జనవరిలో బస్ టికెట్ ధరల పెంపు, ఫిబ్రవరిలో మెట్రో టికెట్ ధరల పెంపు, మార్చిలో ఆటో ఛార్జీల పెంపుతో బెంగళూరులో సామాన్య, మధ్య తరగతి జనం బతుకుడే కష్టంగా మారింది.