జాబ్ చేసే మహిళల కోసం బెంగళూరు.. బెస్ట్ సిటీ

  • నాల్గో స్థానంలో  హైదరాబాద్
  • క్వాలిటీ లైఫ్, సేఫ్టీ, జాబ్ ఆఫర్లలో ది బెస్ట్
  • అవతార్ గ్రూప్ 2024 సర్వేలో వెల్లడి

బెంగళూరు: ఉద్యోగాలు చేసే మహిళల కోసం బెంగళూరు.. బెస్ట్ సిటీగా నిలిచింది. దేశంలోనే నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నది. ఇక్కడ మహిళలకు మంచి ఉద్యోగ అవకాశాలు, కట్టుదిట్టమైన భద్రతతో పాటు హై క్వాలిటీ లైఫ్ ఉండటమే దీనికి కారణం. 

అవతార్ గ్రూప్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 2024లో చాలా మంది మహిళలకు బెంగళూరులో ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఇక్కడ ఉన్న అన్ని ఆఫీసుల్లో వర్క్ విషయంలో మహిళలకు ఎక్కువ ప్రోత్సాహం అందించినట్లు సర్వే సంస్థ వివరించింది. 

జాబ్ చేసే మహిళల విషయంలో భద్రత కూడా బాగుందని తెలిపింది. వర్క్ ప్లేసుల్లో మహిళలందరికీ అనుకూలమైన వాతావరణం ఉండటంతో.. చెన్నైను వెనక్కి నెట్టేసి బెంగళూరులో టాప్ నిలిచింది. ఇక్కడి వీధులు కూడా మహిళలకు ఎంతో సేఫ్ అని తేలింది. 

ఇక రెండో ప్లేస్​లో చెన్నై, మూడో స్థానంలో ముంబై నిలిచాయి. నాలుగో స్థానంలో హైదరాబాద్, ఐదో ప్లేస్​లో పుణె ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో కోల్​కతా, అహ్మదాబాద్, ఢిల్లీ, గురుగ్రామ్, కొయంబత్తూరు నిలిచాయి. 

టాప్ 25 నగరాల్లో అత్యధికంగా 16 సిటీస్ సౌత్ ఇండియా నుంచే ఉన్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న 120 ప్రధాన నగరాల్లో అవతార్ గ్రూప్ సర్వే నిర్వహించింది. 

ఈ మేరకు ‘టాప్ సిటీస్ ఫర్ విమెన్ ఇన్ ఇండియా’ (టీసీడబ్ల్యూఐ) ఇండెక్స్​ను గురువారం రిలీజ్ చేసింది. స్కిల్, ఎంప్లాయ్​మెంట్, ఇన్​ఫ్రాస్ట్రక్చర్, కేరింగ్, సపోర్టు వంటి అంశాల్లో బెంగళూరు మంచి స్కోర్ సాధించింది.