Bengaluru: పై నోటు, కింద నోటే ఒరిజినల్.. రూ.30 లక్షల దొంగ నోట్ల యమా ఇంట్రస్టింగ్ ముచ్చట..

Bengaluru: పై నోటు, కింద నోటే ఒరిజినల్.. రూ.30 లక్షల దొంగ నోట్ల యమా ఇంట్రస్టింగ్ ముచ్చట..

బెంగళూరులో ఓ వ్యాపారికి చేదు అనుభవం ఎదురైంది. అర్జెంట్గా రూ.30 లక్షలు అవసరమై బయట అప్పు తీసుకోగా కేటుగాళ్లు ఫేక్ కరెన్సీ అంటగట్టారు. ప్రతీ బండిల్లో పై నోటు, కింద నోటు మాత్రమే ఒరిజినల్ కరెన్సీ. మధ్యలో ఉన్న నోట్లన్నీ దొంగనోట్లేనని తెలిసి సదరు వ్యాపారికి బుర్ర తిరిగిపోయింది. 30 లక్షలకు ఫేక్ కరెన్సీని సృష్టించారని తెలిసి బెంగళూరు నగరంలో దొంగ నోట్ల దందాపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని ఇందిరానగర్లో దివ్యాన్ష్ సంక్లేచా అనే ఢిల్లీ వ్యాపారికి ఫర్నీచర్ ఔట్లెట్ ఉంది. ఆయనకు అర్జంట్గా రూ.30 లక్షలు అవసరం పడ్డాయి. బెంగళూరులో ఉన్న ఆయనకు ఢిల్లీకి వెళ్లేందుకు వీలు కుదరకపోవడంతో ఢిల్లీలో ఉండే తన బంధువైన జ్యోతి బాబుకు విషయం చెప్పాలనుకున్నాడు. బిజినెస్లో బిజీగా ఉండి జ్యోతి బాబుతో, బంధువులతో మాట్లాడి డబ్బులు సమకూర్చే పనిని దివ్యాన్ష్ తన తండ్రికి అప్పగించాడు. జులై 2న దివ్యాన్ష్ తండ్రికి రమేష్ అనే ఒకతని నుంచి కాల్ వచ్చింది. రూ.30 లక్షల అవసరం గురించి జ్యోతి బాబు తమకు చెప్పాడని, ఆయన నుంచి డబ్బు తీసుకొచ్చి మీకు ఇస్తామని చెప్పారు.

బెంగళూరులో తమ మనిషైన సురేష్ అనే అతను రూ.30 లక్షలు తీసుకొచ్చి ఇస్తాడని తెలిపారు. జులై 3న పొద్దుపోయాక 2 గంటల సమయంలో మారతహళ్లిలో సురేష్ అనే అతను దివ్యాన్ష్ సంక్లేచను కలిసి ఆ రూ.30 లక్షలు 500 నోట్ల కట్టల రూపంలో ఇచ్చాడు. అన్ని బండిల్స్కు బ్యాంక్ సీల్ ఉండటంతో దివ్యాన్ష్కు అనుమానం రాలేదు. డబ్బు తీసుకున్న తర్వాత జ్యోతి బాబుకు దివ్యాన్ష్ సమాచారం ఇచ్చాడు. ఇంటికొచ్చి ఆ నోట్ల కట్టలను పరిశీలించాడు. ఆ నోట్ల కట్టలో పై నోటు, కింద నోటు తప్ప మిగిలిన నోట్లన్నీ దొంగనోట్లని గుర్తించి అవాక్కయ్యాడు. మోసపోయినట్లు గ్రహించాడు. ఈ ఒక్క ఘటనే కాదు.. ఇటీవల ఈ తరహా మోసాలు బెంగళూరు నగరంలో కలకలం రేపుతున్నాయి. ఇటీవల 92 లక్షల దొంగ నోట్ల వరకూ బెంగళూరు పోలీసులు గుర్తించినట్లు తెలిసింది.