పెళ్లాం ఇంటి ఎదుట.. క్యాబ్ డ్రైవర్ ఆత్మహత్య

పెళ్లాం ఇంటి ఎదుట.. క్యాబ్ డ్రైవర్ ఆత్మహత్య

దేశవ్యాప్తంగా ఆత్మహత్యలపై అలారం మోగుతోంది. ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా ఆత్మహత్యలు జరుగుతున్నాయి.. నిన్నటికి నిన్న ఏపీలోని ఓ కార్పొరేట్ కాలేజీలో ఎగ్జామ్ రాస్తున్న స్టూడెంట్.. అలాగే బయటకు వచ్చి బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటన మరవక ముందే.. బెంగళూరులో క్యాబ్ డ్రైవర్ ఆత్మహత్య కలకలం రేపుతోంది. 

కర్నాటక రాష్ట్రం తుమకూరుకు చెందిన మంజునాథ్ అనే 39 ఏళ్ల వ్యక్తి వెస్ట్ బెంగళూరు ఏరియాలోని జ్ణానభారతి ఏరియాలో నివాసం ఉంటున్నాడు. మంజునాథ్ కు నయనరాజ్ అనే మహిళతో 2013లోనే పెళ్లయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు. కొన్నాళ్లుగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే భార్య నయనరాజ్ మరో ఇంట్లో నివాసం ఉంటుంది. ఆ తర్వాత విడాకుల కోసం కోర్టుకు వెళ్లింది. విడాకుల అంశంపై భార్యభర్తల మధ్య గొడవ జరుగుతుంది. 

విడాకులు వద్దని.. కలిసే ఉందాం అని భర్త మంజునాథ్ పదే పదే డిమాండ్ చేస్తూ వస్తున్నాడు. విడాకుల విషయంలో వెనక్కి తగ్గలేదు భార్య నయనరాజ్. ఈ క్రమంలోనే.. 2025, జనవరి 23వ తేదీ అర్థరాత్రి తన క్యాబ్ లోనే భార్య నయనరాజ్ ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో భార్య ఇంటి తలుపులు తీయలేదు. దీంతో తీవ్ర మనోవేదన, ఆవేశంతో ఒంటికి నిప్పంటించుకున్నాడు.

భార్య ఇంటి ఎదుటే రోడ్డుపై మంజునాథ్ ఒంటికి నిప్పంటిచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బెంగళూరు సిటీలో కలకలం రేపుతోంది. ఈ ఘటనపై డీసీపీ ఆధ్వర్యంలో విచారణ జరుగుతుంది. ఇది భార్యభర్తల మధ్య వివాదం అని.. గతంలోనూ భార్య ఇంటికి మంజునాథ్ చాలాసార్లు వచ్చాడని.. ఈసారి ఆమె తలుపులు తీయకపోవటంతో.. మాట్లాడకపోవటంతోనే ఇలా జరిగినట్లు చెబుతున్నారు. 

ఇటీవల కాలంలో ఆత్మహత్యలు విపరీతంగా పెరిగాయని.. ఈ విషయంలో కౌన్సెలింగ్ అవసరం అని.. చిన్న కారణాలకే తీవ్ర ఆలోచనలు చేయటం మంచిది కాదంటున్నారు డీసీపీ. బెంగళూరు సిటీలోనే ఓ మాల్ పై నుంచి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవటం కూడా చర్చనీయాంశం అయ్యింది.