కార్పొరేట్ ఆస్పత్రి దారుణం : ఉద్యోగుల జీతానికి, రోగుల టెస్టులకు లింక్..

కార్పొరేట్ ఆస్పత్రి దారుణం : ఉద్యోగుల జీతానికి, రోగుల టెస్టులకు లింక్..

నగరంలోని ఓ క్లినిక్‌లో పనిచేస్తున్న బెంగళూరు మహిళకు మూడు నెలలుగా జీతం ఇవ్వకపోవడంతో ఆమెతో పాటు ఆమె సన్నిహితులు సైతం ఆందోళనకు గురయ్యారు. రెడ్డిట్ పోస్ట్‌లో, మహిళ ప్రియుడు ఆమె ప్రస్తుత పరిస్థితిని వివరించాడు. రెండు నెలలుగా ఆమెకు జీతం రాకపోవడంతో, ఆమె జీతం మరుసటి నెలలో జమ చేయబడుతుందని హెచ్ఆర్ ఆమెకు హామీ ఇచ్చారని చెప్పాడు.

అయితే, ఆమె వరుసగా మూడవ నెల కూడా జీతం పొందకపోవడంతో.. మరోసారి ఆమె హెచ్ఆర్ ను సంప్రదించింది. అందుకు గానూ ఈ సారి.. క్లినిక్ నష్టంలో ఉన్నట్టు హెచ్ఆర్ ఆ మహిళకు సమాచారం అందించారు. భవిష్యత్తులో ఆ జీతం పొందాలనుకుంటే, క్లినిక్‌ని సందర్శించే రోగులు తప్పనిసరిగా శస్త్రచికిత్స చేయించుకోవాలని లేదా ఏదైనా ఇతర వైద్య చికిత్స చేయించుకోవాలని రోగులకు చెప్పాలని హెచ్ఆర్ చెప్పినట్టు మహిళ ప్రియుడు పోస్టులో తెలిపాడు.

"నా స్నేహితురాలు క్లినిక్‌కి కన్సల్టెంట్‌గా పని చేస్తుంది. ఆమెకు మూడు నెలలుగా జీతం రాలేదు. మొదటి రెండు నెలలు ఆమెకు వచ్చే నెల జీతం వస్తుందని హెచ్‌ఆర్ ఆమెకు చెప్పారు. కానీ ఈ నెలలో హెచ్‌ఆర్ చెప్పారు. క్లినిక్ నష్టాల్లో నడుస్తున్నందున తన బేసిక్ జీతం కూడా చెల్లించలేమని. తనకు డబ్బు కావాలంటే, వచ్చే రోగులకు ఏదైనా చికిత్స లేదా సర్జరీని చేయించుకోవాలని హామీ ఇవ్వాలని హెచ్‌ఆర్ ఆమెకు చెప్పారు" అని ఆ వ్యక్తి రాశాడు.

తన గర్ల్‌ఫ్రెండ్ రెండేళ్ల ఎంప్లాయిమెంట్ బాండ్‌పై సంతకం చేసిందని, ఇంకా ఆరు నెలల సర్వీస్ మిగిలి ఉందని ప్రియుడు చెప్పాడు. ఆ తర్వాత అవసరమైన అన్ని పత్రాలతో క్లినిక్ నుంచి నిష్క్రమించవచ్చని అతను తెలిపాడు. "నా గర్ల్‌ఫ్రెండ్‌కు అక్కడ 2 సంవత్సరాల బాండ్ ఉంది. ఆమె 1.5 సంవత్సరాలుగా అక్కడ పని చేస్తోంది. ఆమె తన వర్క్ ఎక్స్ పీరియన్స్ లెటర్ పొందనందున 6 నెలలు పూర్తికాకముందే క్లినిక్‌ని విడిచిపెట్టలేనని చెప్పింది. లేదంటే ఆమె ఎక్కడికెళ్లినా ప్రెషర్ లానే పరిగణించబడుతుంది" అని అతను పోస్టులో వివరించాడు.

"ఇతర వ్యక్తులు వారి జీతంలో కనీసం 25% డబ్బును పొందుతున్నారు. కానీ బాండ్‌లో ఉన్నందున ఆమెకు చెల్లించడం లేదు. అక్కడ ఉండడం తప్ప ఆమెకు వేరే మార్గం లేదు" అని చెబుతూ, ఏం చేయాలో సలహా ఇవ్వండంటూ అతను రెడ్డిట్ లో పోస్టు చేయడంతో చాలా మంది యూజర్లు దీనిపై స్పందించారు. మంచి లాయర్‌ని నియమించుకుని క్లినిక్‌కి లీగల్ నోటీసు పంపాలని కొందరు సూచించారు.