బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. పరుగులు పెట్టిన రోగులు

బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. పరుగులు పెట్టిన రోగులు

బెంగళూరులోని MS రామయ్య మెమోరియల్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. గురువారం ( సెప్టెంబర్ 19) షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎంఎస్ రామయ్య మెమోరియల్ ఆస్పత్రిలోని మూడో అంతస్తులో కార్డియాక్ యూనిట్ సమీపంలో మంటలు చెలరేగాయి. దీంతో మూడో అంతస్తు పూర్తిగా దగ్ధమైంది. పెద్ద ఎత్తున మంట లు, పొగ రావడంతో రోగులు, ఆస్పత్రి సిబ్బంది పరుగులు పెట్టారు.  

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆస్పత్రికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఐసీయూలో ఉన్న ఏడుగురు కార్డియాక్ పేషెంట్లు ఎలాంటి గాయాలే కుండా సురక్షితంగా బయటపడ్డారు. 

ఎంఎస్ రామయ్య మెమోరియల్ ఆస్పత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంపై ఆస్పత్రి సీఈవో శ్రీనివాస్ మూర్తి ధృవీకరించారు. ఆస్పత్రి సిబ్బంది, ఫైర్ సిబ్బంది తక్షణ సహాయక చర్యల్లో పాల్గొని బాధిత రోగులను ప్రమాద స్థలం నుంచి ఖాళీ చేసి రక్షించారని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆస్పత్రిలో విద్యుత్ సరఫరా నిలిపివేయడం, అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో ప్రాణ నష్టం, భారీ ఆస్థి నష్టం జరగలేదన్నారు.