
- తల్లి మందలించిందని సూసైడ్ చేస్కున్న టెన్త్ క్లాస్ అమ్మాయి
- కర్నాటకలోని బెంగళూరులో విషాదం
బెంగళూరు: ఫోన్ వాడొద్దని తల్లి మందలించినందుకు టెన్త్ క్లాస్ చదువుతున్న కూతురు ఆత్మహత్యకు పాల్పడింది. అపార్ట్మెంట్లోని 20వ అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. కర్నాటకలోని బెంగళూరులో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది.
మధ్యప్రదేశ్‌కు చెందిన దంపతులు ఉద్యోగరీత్యా బెంగళూరు శివారులో నివాసం ఉంటున్నారు. వైట్ ఫీల్డ్ ఏరియాలోని సీబీఎస్సీ స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతున్న వీళ్ల కూతురు అవంతిక చౌరాసియా(15)కు వచ్చే ఫిబ్రవరిలో యాన్యువల్ ఎగ్జామ్స్ ఉన్నాయి.
ఇటీవల జరిగిన ఎగ్జామ్స్‌లోనూ ఆమెకు మార్కులు తక్కువగానే వచ్చాయి. దీంతో ఇకపై ఫోన్ వాడొద్దని, చదువులపై దృష్టిపెట్టాలని అవంతికను తల్లి మందలించింది.
అదే సమయంలో ఫోన్ పట్టుకుని కూర్చున్న ఆమె చేతిలోంచి ఫోన్ లాక్కుంది. దీంతో తీవ్ర భావోద్వేగానికి గురైన అవంతిక.. వాళ్లు ఉంటున్న 20వ అంతస్తు బాల్కనీలోంచి కిందకు దూకేసింది.
రెప్పపాటు సమయంలో జరిగిన ఈ ఘటనలో బాలిక స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకుని విచారణ చేపట్టారు. తల్లిదండ్రుల నుంచి వాంగ్మూలం తీసుకుని సూసైడ్ కేసుగా ఫైల్ చేశారు.