చైనాలో HMPV కలకలం సృష్టిస్తోన్న వేళ.. భారత్‌లో ఆ వైరస్ బయటపడిన విషయం తెలిసిందే. కర్ణాటక రాజధాని బెంగళూరులో రెండు కేసులు వెలుగు చూశాయి. బెంగళూరుకు చెందిన 3, 8 నెలల వయసున్న ఇద్దరు చిన్నారులకు ఈ వైరస్ సోకినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. వీరిలో మూడు నెలల శిశువు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా, ఎనిమిది నెలల పాప ప్రస్తుతం చికిత్స పొందుతోంది.
అయితే, రాష్ట్రంలోని ల్యాబ్‌లో శాంపిల్స్‌ను పరీక్షించలేదని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఆ రిపోర్ట్ ఓ ప్రైవేటు ఆసుపత్రి నుంచి వచ్చినట్లు తెలిపాయి. తదుపరి పరీక్షల కోసం చిన్నారుల నమూనాలను పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(NIV)కి పంపినట్లు కర్ణాటక ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ఆ రిపోర్ట్ ఆధారంగా భారత్‌లో బయటపడిన వైరస్.. చైనాలో ప్రబలిస్తోన్న వేరియంట్ ఒకటేనా..! కాదా..! అనే నిర్ధారణకు రానున్నారు.
జనవరి 2న పరీక్షలు..
జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలతో జనవరి 2న శిశువు ఆస్పత్రిలో చేరినట్లు కర్ణాటక ఆరోగ్య మంత్రి దినేష్ గుండు రావు తెలిపారు. సదరు చిన్నారికి జనవరి 2న మధ్యాహ్నం 12.28 గంటల సమయంలో ల్యాబొరేటరీ పరీక్షలు నిర్వహించగా, జనవరి 3న మధ్యాహ్నం 1.22 గంటలకు రిపోర్ట్ ఇచ్చినట్లు.. అందులో HMPV వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు వెల్లడించారు.
ALSO READ | ఊరు దాటి వెళ్లలేదు.. అలాంటి చిన్నారులకు చైనా వైరస్ ఎలా ఎటాక్ అయ్యింది..!
PCR పరీక్షలో శిశువుల నమూనాలలో HMPV వైరస్‌కు అనుగుణంగా మైక్రోబియల్ RNA/DNA ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.