బెంగుళూర్: ప్రైవేట్ వీడియోలు బయటపెడతానని లవర్‌ను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూల్ చేసిన యువకుడిని బెంగుళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కటకటాల్లోకి నెట్టారు. పోలీసుల వివరాల ప్రకారం.. బెంగుళూరుకు చెందిన మోహన్ అనే వ్యక్తి బాధితురాలు స్కూల్ ఫ్రెండ్స్. స్కూలింగ్ తర్వాత విడిపోయిన వీరిద్దరూ ఇటీవల మళ్లీ కలుసుకున్నారు. కొన్నాళ్లు ఇద్దరూ ఫ్రెండ్ షిప్ చేశారు. ఈ స్నేహం కాస్త ప్రేమగా చిగురించింది. ఇంకేముంది.. ప్రేమ పేరుతో ఇద్దరూ చెట్టపట్టాలేసుకుని విచ్చలవిడిగా తిరిగారు. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకుంటానని ప్రియురాలిని నమ్మించిన మోహన్.. శారీరంగా లొంగదీసుకున్నాడు.
ప్రియురాలితో సన్నిహితంగా ఉన్న సమయంలో ఫొటోలు, వీడియోలు తీశాడు. ఈ ఫొటోలు, వీడియోల్లో తన ఫేస్ కనబడకుండా జాగ్రత్తపడ్డాడు మోహన్. యువతితో కొన్నాళ్లు తిరిగాక బోర్ కొట్టి.. ఇక ప్రియురాలిని బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు. యువతి ఆర్థికంగా పటిష్టంగా ఉండటం గ్రహించిన మోహన్ తనకు డబ్బులు ఇవ్వాలని.. లేదంటే మన పర్సనల్ వీడియోలు, సన్నిహితంగా దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. ప్రియుడు నుండి ఈ ఊహించిన పరిణామంతో భయాందోళనకు గురైన యువతి.. ఏం చేయాలో అర్థం కాక ప్రియుడు అడిగిన వెంటనే డబ్బులు ఇచ్చింది. మోహన్ బెదిరించిన ప్రతిసారి చేసేదేమి లేక అడిగినన్ని డబ్బులు పంపింది.
Also Read : నడిరోడ్డుపై వ్యాపారవేత్తను కాల్చి చంపిన దుండగులు
వివిధ సందర్భాల్లో మొత్తం రూ.2.57 కోట్లు ప్రియుడికి బదిలీ చేసింది. ఇక్కడితో ఆగని మోహన్ తనకు విలాసవంతమైన వాచీలు, నగలు, అత్యాధునిక కారు ఇప్పించమని ప్రియురాలిని మరింత టార్చర్ చేశాడు. రోజు రోజుకు మోహన్ బ్లాక్ మెయిల్ మరింత ఎక్కువ కావడంతో తట్టుకోలేకపోయిన బాధితురాలు ధైర్యం చేసి బెంగుళూరు పోలీసులను ఆశ్రయించింది. ప్రియుడి నుండి ఎదురైన వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. మోహన్‌ను అరెస్ట్ చేశారు. బీఎన్ఎస్ యాక్ట్ లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాధితురాలి నుండి తీసుకున్న డబ్బుల్లో రూ.80 లక్షలను నిందితుడు మోహన్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.