
ప్రతియేటా విద్యార్థుల ఫీజుల చెల్లింపులో పేరెంట్స్కి తిప్పలు తప్పడం లేదు.ఇష్టారాజ్యంగా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఫీజులు పెంచడం..ఇదేంటని పేరెంట్స్ గొడవపడటం షరా మామూలే అవుతోంది. ఈ ఫీజుల విషయంలో ప్రైవేట్ పాఠశాలలకు అడ్డుఅదుపు లేకుండా పోయిందని పేరెంట్స్ చెబుతున్నారు. ప్రతి యేటా పెరుగుతున్న ఫీజులతో పిల్లల చదువులు భారంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఫీజుల పెంపు విషయంలో ప్రైవేట పాఠశాలలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ప్రతియేటా ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యం 30 శాతం వరకు ఫీజులు పెంచేస్తు న్నాయి. ఇలా పెంచుకుంటే ఎలా..? మే లేదా జూన్ నెలల్లో విద్యాసంవత్సరం ప్రారంభం అవుతుండగా.. అంతకంటే ముందే మొదటి విడత ఫీజులు చెల్లించాల నిడిమాండ్ చేస్తున్నాయని ప్రైవేట్ సంస్థలపై విద్యార్థుల పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరులో ప్రైవేట్ పాఠశాలలు పెంచుతున్న ఫీజుల వల్ల లక్షలు చెల్లించాల్సింది వస్తుందని పేరెంట్స్ వెల్ఫేర్ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
బెంగళూరులో ప్రైవేట్ పాఠశాలలు ఫీజుల మోత మోగిస్తున్నారు. ప్రతి సంవత్సరం దాదాపు 10 నుంచి 15శాతం వరకు పెంచేస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో 30 శాతం పెంచుతున్నారు. దీనివల్ల ఏటా 10వేలకు పైగా అదనపు భారం పడుతోంది. ప్రత్యేక ఫీజు స్ట్రక్చర్ లేదని యాజమాన్యం ఇష్టమొచ్చినట్లు యడాపెడా పెంచేస్తున్నారని విద్యార్థుల పేరెంట్స్ అందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల ఫీజుల పెంపును నియంత్రించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్నారు.
అయితే ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల పెంపుపై ప్రైవేట్ పాఠశాలల యాజ మాన్య సంఘాలు మరోలా స్పందించాయి. ఉపాధ్యాయుల జీతాలు, పాఠశాలల నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నందున ఫీజులు పెంచక తప్పడం లేదని వాదిస్తున్నాయి. ప్రైవేట్ పాఠశాలల్లో 30 నుంచి 40 శాతం కంటే ఎక్కువ ఫీజులు వసూలు చేస్తే పేరెంట్స్ ఫిర్యాదు చేయొచ్చని చెబుతున్నారు.
ఈ విషయంతో కర్ణాటక విద్యాశాఖ మంత్రి స్పందిస్తూ.. ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేయకూడదని విజ్ణప్తి చేశారు. పేరెంట్స్ ప్రభుత్వ పాఠశాలలను కూడా ఓ ఎంపికగా చేసుకోవాలని సూచించారు. అయితే స్వంత ప్రయోజనాలకోసమే ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాల్లో అధిక ఫీజులను ప్రోత్సహిస్తోందని ప్రతిపక్ష నేతలు అంటున్నారు.