బెంగళూరులో భారీ వర్షం.. మునిగిన రోడ్లు

బెంగళూరులో భారీ వర్షం.. మునిగిన రోడ్లు

కర్ణాటక రాజధాని బెంగళూరులో భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో రోడ్లు, వీధులు వర్షపు నీటిలో  మునిగిపోయాయి. వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. దీంతో వాహనదారులు, నగర ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు ప్రతికూల వాతావరణ పరిస్థితుల ప్రభావం విమానాల రాకపోకలపై కూడా పడినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక భారీ వర్షపు నీటిలోనే వాహనాలు రాకపోకలు సాగించిన వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. 

శాంతినగర్, మల్లేశ్వరం, రిచ్మండ్ సర్కిల్, మహదేవపురాలో రోడ్లపై నీరు ప్రవహిస్తోంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 30 నిమిషాల వర్షానికే ఇంత పెద్ద నగరంలో వరద నీరు నిలవడమేంటని ప్రజలు మండిపడుతున్నారు.ఈ రోజు( ఏప్రిల్​ 3)  రాత్రికి  కూడా వర్షం కురుస్తుందని వాతావరణశాఖ తెలిపింది.

 పలు ప్రాంతాలలో రోడ్లు వర్షపు నీటితో జలమయం కావడంతో వాహనదారులు ట్రాఫిక్ లో చిక్కుకుని అనేక ఇబ్బందులు పడుతున్నారు.  లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచిపోవడంతో పాదచారులకు సైతం నడిచేందుకు నానా కష్టాలు ఎదుర్కొంటున్నారు.   ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయో..  ఎక్కడ  డ్రైనేజీలు ఉన్నాయో అర్థం కాక తికమక పడ్డారు. అధికారులు వర్షపు నీరు రోడ్లపై నిలవకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. వర్షపు నీటితో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. మరోవైపు సమ్మర్ కావడంతో బెంగళూరులో నీటి సమస్య తీవ్రం అయిందని స్థానికులు చెబుతున్నారు.