బెంగళూరులో చుక్కలు చూపిస్తున్న ఇంటి అద్దెలు.. నెలకు 40 వేల రెంట్.. 5 లక్షల అడ్వాన్స్ కట్టాలంట..!

బెంగళూరులో చుక్కలు చూపిస్తున్న ఇంటి అద్దెలు.. నెలకు 40 వేల రెంట్.. 5 లక్షల అడ్వాన్స్ కట్టాలంట..!

మెట్రో నగరాల్లో ఈ మధ్య అద్దె ఇల్లు దొరకడమే కనాకష్టంగా మారింది. బెంగళూరు నగరంలో అయితే పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. బెంగళూరులో ఇంటి ఓనర్ల గొంతెమ్మ కోరికలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిస్తే అవాక్కవడం పక్కా. హర్నీద్ కౌర్ అనే ఒక ‘ఎక్స్’ యూజర్ పోస్ట్ చేసిన ట్వీట్ ఈ విషయాన్ని బయటపెట్టింది. ఈ అంశం నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 4 లక్షలకు పైగా వ్యూస్ ఆమె పోస్ట్కు వచ్చాయంటే ఎంతలా విషయం వైరల్ అయిందో అర్థం చేసుకోవచ్చు.

‘5 lakh deposit for a flat with 40k rent :))))) I’m so tired :))))’. బెంగళూరులో తాను అద్దె ఇంటి కోసం విసిగివేసారిపోయానని, 40 వేల అద్దెతో ఒక ఫ్లాట్ దొరికిందని.. కానీ ఆ ఫ్లాట్లో అద్దెకు దిగాలంటే 5 లక్షలు డిపాజిట్ కట్టాలని ఆ ఫ్లాట్ ఓనర్ చెప్పారని ఆ మహిళ వాపోయింది. ‘‘ఇంక బెంగళూరులో అద్దె ఇంటి కోసం వెతుకులాట నా వల్ల కాదు బాబోయ్.. నేను అలసిపోయాను’’ అనే రీతిలో ఆమె పోస్ట్ ఉంది. ఆమె పోస్ట్పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

ALSO READ | బెంగళూరులో తెలుగు జనానికి ఈ విషయం తెలుసో.. లేదో.. ఇక తిప్పలు తప్పాయ్..!

బెంగళూరులో అద్దెకు ఇల్లు దొరకడం రానురాను ఒక సవాల్గా మారిందని, పరిస్థితి చేయి దాటిపోతుందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా.. బెంగళూరు నగరంతో పోల్చితే దేశ రాజధాని ఢిల్లీలోనే అద్దె ఇంటి ఓనర్ల తీరు కాస్త మెరుగ్గా ఉందని కొందరు అభిప్రాయపడ్డారు. ఒక నెల లేదా రెండు నెలల రెంట్ మాత్రమే సెక్యూరిటీ డిపాజిట్స్గా అదేనండీ అడ్వాన్స్గా అడుగుతున్నారని.. బెంగళూరులో మాత్రం ఒక సంవత్సరానికి సరిపడ అద్దె మొత్తం డిపాజిట్గా అడగటం దారుణమని కౌర్ పోస్ట్పై కొందరు రియాక్ట్ అయ్యారు. 

ఇలా మనం ఇచ్చే డిపాజిట్ డబ్బును ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయే సమయంలో తిరిగి ఇస్తామని చెబుతారని, కానీ ఇవ్వకుండా ఎగ్గొడతారని కొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. బెంగళూరులో ఉండే కొందరు ఇంటి ఓనర్లు మాత్రం డిపాజిట్ అమౌంట్ మరీ ఎక్కువగా ఉందనే అభిప్రాయాన్ని కొట్టిపారేస్తున్నారు. బెంగళూరు లాంటి ఒక మహా నగరంలో ఒక ఇంటిని సొంతంగా కష్టపడి కట్టుకుంటే తెలుస్తుందని, అయినా ఒక ప్రైవేట్ ప్రాపర్టీకి నచ్చిన రూల్స్ పెట్టుకునే హక్కు ఓనర్కు ఉందని, ఇకనైనా ఇలాంటి ఏడుపులు ఆపాలని బెంగళూరులోని కొందరు ఇంటి ఓనర్లు కౌర్ ట్వీట్పై పెదవి విరిచారు.