బెంగళూరు రోడ్లపై తెల్లటి ఫోమ్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

బెంగళూరు రోడ్లపై తెల్లటి ఫోమ్..  సోషల్ మీడియాలో వీడియో వైరల్

బెంగళూరు: బెంగళూరులో రెండు రోజుల కింద కురిసిన వర్షానికి రోడ్లన్నీ తెల్లటి ఫోమ్​తో దర్శనం ఇస్తున్నాయి. దట్టమైన మంచు దుప్పటి కప్పేసినట్లు అనిపిస్తున్నది. నిహమ్స్ డెయిరీ సర్కిల్ ఏరియాలో ఈ ఫోమ్ ఎక్కువగా కనిపిస్తున్నది. నురుగ మాదిరి ఉండటంతో ఆ రోడ్డు వెంట వెళ్తున్న వారందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మిలన్ అనే ఓ ఇన్​స్టాగ్రామ్ యూజర్ థిక్ ఫోమ్​కు సంబంధించిన వీడియో తీసి అప్​లోడ్ చేశాడు. 

‘‘బెంగళూరులో అసలు ఏం జరుగుతున్నదో ఎవరికైనా తెలుసా? అనుకోకుండా ఎండా కాలంలో కురిసిన వర్షానికి రోడ్లన్నీ ఇలా ఫోమ్​తో దర్శనం ఇస్తున్నాయి’’అని క్యాప్షన్  ఇచ్చాడు. దీంతో కొన్ని గంటల్లోనే వీడియో తెగ వైరల్ అయింది. ఈ పోస్టుపై కొందరు నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తుంటే.. మరికొందరు ఆ ఫోమ్​కు కారణం ఏమై ఉంటుందో చెప్తున్నారు. నిహమ్స్ డెయిరీ సర్కిల్ ఏరియాలో రోడ్లకు ఇరువైపులా షికాకాయ్ చెట్లు ఉన్నాయి. వీటికి కాచే కాయలను షాంపుల తయారీకి వాడుతుంటారు. కొందరు సంప్రదాయబద్ధంగా షికాకాయ్​ను దంచి జుట్టుకు పట్టిస్తారు. 

‘‘రోడ్డుపై నురగ ఏర్పడటానికి షికాకాయ్ చెట్లకు కాచిన పువ్వులే కారణం. వీటిని సోప్​నట్ ట్రీస్ అంటారు. వర్షం కురిసినప్పుడు ఈ పువ్వులు కిందపడ్డాయి. నీళ్లు, పువ్వులపై నుంచి వెహికల్స్ వెళ్లడంతో నురగా వస్తున్నది. ఇలాంటి రోడ్లపై నుంచి టూ వీలర్స్ వెళ్లడం చాలా ప్రమాదకరం. స్లిప్ అవుతారు’’అని చెప్పాడు. నురగకు సోప్​నట్ ట్రీస్ కారణమని, ఇది కామన్ అని మరో నెటిజన్ తెలిపాడు. ‘‘ఎవరో ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు రోడ్డుపై సర్ఫ్ ఎక్సెల్ పౌడర్ పడేశారు’’అని మరో నెటిజన్ ఫన్నీ కామెంట్ చేశాడు. 

‘‘ఇంటికెళ్తున్నప్పుడు రోడ్డుపై స్నో మాదిరి ఫోమ్ చూసి మనాలీలో ఉన్న ఫీలింగ్ వచ్చింది. కృత్రిమంగా మంచు కురిపించారా అని అనుకున్నాను’’ అని మరో నెటిజన్ అన్నాడు. బెంగళూరులోని సగానికిపైగా రోడ్డన్నీ ఇలాగే దర్శనం ఇచ్చాయి. డిటర్జెంట్ లేదంటే మురుగు నీరు రోడ్డుపై చేరడంతో నురుగ ఏర్పడి ఉంటుందని ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పరిశోధకులు తెలిపారు.