
బెంగుళూరు: ఐటీ రాజధాని బెంగుళూరులో ఈ మధ్య క్రైమ్స్ బాగా పెరిగిపోతున్నాయి. మోసాలు, హత్యలు, అత్యాచారాలు ఎక్కువైపోతున్నాయి. మొన్నా మా మధ్య ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన భార్యను చంపి సూట్ కేసులో కుక్కి పారిపోయిన విషయం మరువక ముందే.. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సారి మాత్రం ఓ కిలాడీ టీచర్ తన అందాల వలపుల వల విసిరి విద్యార్థి తండ్రిని బ్లాక్ మెయిల్ చేసింది. అక్రమ సంబంధం పెట్టుకుని.. ఆ తర్వాత తన వక్రబుద్ధి చూపించింది. వ్యక్తిగత ఫోటోలు లీక్ చేస్తానని బెదిరించి విద్యార్థి తండ్రి నుంచి లక్షలకు లక్షలు వసూల్ చేసింది. టీచర్ వేధింపులకు రోజు రోజుకు ఎక్కువైపోవడంతో భరించలేకపోయిన బాధితుడి పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిలాడీ టీచర్‌ను అరెస్ట్ చేసి కటాకటాల్లోకి నెట్టారు.
పోలీసుల వివరాల ప్రకారం.. గుజరాత్‌కు చెందిన ఓ అనే వ్యాపారి తన భార్య ముగ్గురు పిల్లలతో కలిసి వెస్ట్ బెంగళూరు ఏరియాలో నివసిస్తున్నాడు. ఈ క్రమంలోనే తన పిల్లలను ఇంటికి దగ్గర్లోని ఓ ప్రీ ప్రైమరీ స్కూల్లో జాయిన్ చేశాడు. అడ్మిషన్ ప్రక్రియ సమయంలో అతడికి శ్రీదేవి రుడాగి (25) అనే మహిళా టీచర్‌తో పరిచయం ఏర్పడింది. ఇరువురు నెంబర్లు మార్చుకుని.. చాటింగ్, వీడియో కాల్స్ మాట్లాడటం ప్రారంభించారు. ఈ క్రమంలోనే పరిచయం కాస్తా అక్రమ సంబంధానికి దారి తీసింది. శ్రీదేవి, విద్యార్థి తండ్రి చెట్టాపట్టాలేసుకుని తిరిగారు.
ఇక్కడ వరకు బానే ఉండగా.. ఆ తర్వాత టీచర్ శ్రీదేవి తనలోని మరో యాంగిల్ బయటపెట్టింది. విద్యార్థి తండ్రితో సన్నిహితంగా ఉన్నప్పుడు ఫొటోలు, వీడియోలు రికార్డ్ చేసింది. ఈ ఫొటోలు, వీడియోలు అడ్డు పెట్టుకుని అతడిని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించింది. బాధితుడి నుంచి రూ.4 లక్షలు బలవంతంగా వసూలు చేసింది. ఆ తర్వాత జనవరిలో మరో రూ.15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. రోజు రోజుకు శ్రీదేవి వేధింపులు ఎక్కువ కావడంతో బాధితుడు తన కుటుంబాన్ని గుజరాత్‌కు మార్చాలని నిర్ణయించుకున్నాడు.
ఈ నేపథ్యంలో పిల్లల టీసీల కోసం స్కూల్‌కు వెళ్లాడు. విషయం తెలుసుకున్న టీచర్ శ్రీదేవి మరో ఇద్దరితో కలిసి స్కూల్‌కు వెళ్లి మరోసారి బెదిరింపులకు పాల్పడ్డారు. రూ.20 లక్షలకు ఇవ్వకపోతే మన ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు మీ కుటుంబానికి పంపుతానని బెదిరించింది. దీంతో భయపడ్డ బాధితుడు 1.9 లక్షలు చెల్లించి.. మిగిలిన డబ్బులు తర్వాత ఇస్తానని చెప్పాడు. శ్రీదేవి వేధింపులు తీవ్రం కావడంతో భరించలేకపోయిన బాధితుడు ఇక చేసేదేమి లేక పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కిలాడీ టీచర్ ఆట కట్టించారు. ఆమెతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.