నన్ను జైల్లో పెట్టండి.. ఇంటికి మాత్రం వెళ్లను : భార్యా బాధిత సాఫ్ట్ వేర్ ఉద్యోగి వేడుకోలు

నన్ను జైల్లో పెట్టండి.. ఇంటికి మాత్రం వెళ్లను : భార్యా బాధిత సాఫ్ట్ వేర్ ఉద్యోగి వేడుకోలు

అతను సాఫ్ట్ వేర్ ఉద్యోగి.. బెంగళూరులో ఉద్యోగం.. లక్షల్లో జీతం.. మూడేళ్ల క్రితం ఓ డైవర్స్ మహిళను పెళ్లి చేసుకున్నాడు.. ఆ తర్వాత అతనికి టార్చర్ ఎలా ఉంటుందో తెలిసిందంట.. పెళ్లాం బాధితుడిగా.. మూడేళ్లు నరకం అనుభవించాను.. ఇక నా వల్ల కాదు.. కావాలంటే నన్ను జైల్లో పెట్టండి.. జైలుకు పంపించండి.. సంతోషంగా వెళతాను.. అంతేకానీ ఇంటికి మాత్రం పంపించొద్దు అంటూ ఏకంగా పోలీసుల ఎదుట కన్నీటి పర్యంతం అయ్యాడు.. పోలీసులకు సైతం ఏం చేయాలో తెలియలేదు.. మిస్సింగ్ కేసు మూసివేయాలంటే మీరు కచ్చితంగా ఇంటికి వెళ్లాల్సిందే.. మిమ్మల్ని జైలుకు పంపించే అవకాశం లేదంటూ.. బలవంతంగా ఆ సాఫ్ట్ వేర్ ఎంప్లాయిని ఇంటికి పంపించారు. అసలు ఈ భార్యా బాధితుడి కథేంటో తెలుసుకుందామా.. 

బెంగళూరుకు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి.. తన ఫోన్ లోని సిమ్ కార్డ్ తీసేసి.. 2024, ఆగస్ట్ 4వ తేదీన బెంగళూరులోని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. రాత్రికి కూడా భర్త ఇంటికి రాకపోవటంతో.. పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేసింది భార్య. వారం తర్వాత అతని ఫోన్ యాక్టివేట్ అయ్యింది. పాత ఫోన్ లో కొత్త సిమ్ కార్డు వేయటంతో పోలీసులు అతన్ని గుర్తించారు. నోయిడాలో ఉన్నట్లు గుర్తించి.. ముగ్గురు పోలీసులు నోయిడా వెళ్లారు. అతను ఓ మాల్ నుంచి బయటకు వస్తుండగా చుట్టుముట్టారు. ఎంతైనా ఐటీ ఉద్యోగి కదా.. వచ్చినోళ్లు పోలీసులు అని గుర్తించారు. 

అక్కడే విచారణ చేశారు. ఆ ఐటీ ఉద్యోగి ఒకే ఒక్క మాట చెప్పాడు.. నన్ను అరెస్ట్ చేయండి.. జైలుకు పంపించండి.. అంతేకానీ ఇంటికి మాత్రం తీసుకెళ్లొద్దు అంటూ పదేపదే వేడుకున్నాడు. పోలీసులకు అర్థం కాలేదు. వివరంగా చెప్పాలని కోరారు. అప్పుడు తన బాధలు చెప్పటం మొదలుపెట్టాడు ఆ టెకీ.. మూడేళ్ల క్రితం కుమార్తె ఉన్న విడాకులు తీసుకున్న మహిళను పెళ్లి చేసుకున్నాను.. మాకు 8 నెలల పాప కూడా ఉంది. భార్య పెళ్లి చిత్ర హింసలు అలా ఇలా లేవు. ఏ బట్టలు వేసుకోవాలి.. ఏం తినాలి.. ఎలా తినాలి.. ఏం తాగాలి అని మొత్తం నా భార్యనే డిసైడ్ చేస్తుంది. కనీసం బయటకు వెళ్లి టీ కూడా ప్రశాంతంగా తాగలేను. చిత్రహింసలు భరించలేక చచ్చిపోదాం అనుకున్నా.. ఆ దైర్యం లేక ఇంటి నుంచి పారిపోయాను.. మీరు వచ్చి పట్టుకున్నారు.. మీకు దండం పెడతా.. నన్ను మాత్రం బెంగళూరు ఇంటికి పంపించొద్దు అంటూ వేడుకున్నాడు.

మిస్సింగ్ కేసు నమోదు అయ్యిందని.. మిమ్మల్ని మీ ఇంటికి పంపించాల్సిందే అంటూ పోలీసులు రూల్స్ ప్రకారం ఫాలో అయ్యారు. నోయిడా నుంచి విమానంలో బెంగళూరు తీసుకొచ్చి.. పోలీస్ స్టేషన్ లో సంతకాలు చేయించుకుని.. తన భార్యకు అప్పగించారు పోలీసులు.

ఈ అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పోలీసులకు మానవత్వం లేదా అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తుంటే.. పాపం భార్యా బాధితుడిని మళ్లీ అండమాన్ జైలుకు తరలించారా అంటూ మరికొంత మంది సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి వద్దు బ్రో అంటే వినరే అంటూ మరికొంత మంది తమ స్టయిల్ లో కామెంట్స్ చేస్తున్నారు. లక్షల్లో జీతం వస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఉన్నా.. ఇంట్లో పెళ్లాం పోరు భరించలేం కదా అని మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు.