దరిద్రం అంటే ఇదే కావొచ్చు. ఇంట్లో పాత బెడ్ అమ్ముకుందామని ఆన్లైన్లో పెడితే..ఏకంగా బ్యాంకు ఖాతా ఖాళీ అయింది. నిరుపయోగంగా ఉన్న పాత మంచాన్ని విక్రయించేందుకు OLX ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ లో పెడితే.. కొంటానని నమ్మించి ఓ టెకీ ఉద్యోగి బ్యాంకు ఖాతాను మొత్తం ఊడ్చేశారు సైబర్ కేటుగాళ్లు. వివరాల్లోకి వెళితే..
బెంగళూరు కు చెందిన 39 యేళ్ల ఆదిష్ అనే టెకీ.. తన ఇంట్లో ఉన్న పాత డబుల్ కాట్ మంచాన్ని అమ్మాలని ఆన్ లైన్ మార్కెట్ ప్లేస్ OLXలో ఒక ప్రకటన చేయడం ద్వారా రూ. 68 లక్షలు పోగొట్టుకున్నాడు. మోసపోయానని తెలుసుకుని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఆదిష్ ఫిర్యాదు మేరకు ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు దోచుకున్న అతిపెద్ద మొత్తం ఇదేనట. ఓటీపీ పంపించడం ద్వారా సైబర్ నేరగాళ్ల ఆదిష్ ఖాతానుంచి డబ్బులు కొల్లగొట్టారని పోలీసులు తెలిపారు.
పాత బెడ్ అమ్మేందుకు ఆదిష్ ఆన్ లైన్ మార్కెట్ ప్లేస్ OLX లో ఓ ప్రకటన ఇచ్చాడు. ప్రకటన చూసిన సైబర్ నేరగాడు.. స్థానికంగా ఉండే ఓ వ్యాపారి పేరుతో కాల్ చేసి బెడ్ కొంటామని చెప్పారు. బెడ్ రేటును రూ. 15వేలకు నిర్ణయించగా ఆన్ లైన్ ద్వారా పే చేస్తామని సైబర్ కేటుగాళ్లు చెప్పారు.. అది నమ్మిన టెకీ ఆదీష్ సరే అన్నాడు.. అయితే తన యూపీఐ ఐడీ ద్వారా డబ్బులు ట్రాన్స్ ఫర్ కావడంలేదని చెప్పారు స్కామర్లు.
తన యూపీఐ ఐడీని ద్వారా రూ. 1 పంపించమని కోరారు. వ్యాపారికి యూపీఐ ఉపయోగించడంలో అవగాహన లేదని అనుకొని ఆదిష్ పంపించాడు. వెంటనే రూ. 10 ఆదిష్ ఖాతాను పంపించారు కేటుగాళ్లు. మరో రూ. 5వేలు పంపించండి.. రూ. 10వేలు పంపుతాను అని చెప్పడంతో పంపించాడు ఆదిష్.
ఇలా మరో 7వేల 500పంపించండి అని ఆదిష్ కు OTP పంపించారు వ్యాపారినంటూ చెప్పుకున్న సైబర్ స్కామర్లు. ఇంకేముంది ఆదిష్ ఖాతానుంచి రూ. 68 లక్షలు స్కామర్ల ఖాతాకు జమ అయ్యాయి. మోస పోయానని గుర్తించిన ఆదిష్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
సో.. ఆన్ లైన్ లో కొనుగోళ్లు చేసేటప్పుడు, అమౌంట్ ట్రాన్స్ ఫర్ చేస్తున్నపుడు చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు.