బెంగళూరు రేస్‌‌‌‌‌‌‌‌లోనే .. 60 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో పంజాబ్‌‌‌‌‌‌‌‌పై గెలుపు

బెంగళూరు రేస్‌‌‌‌‌‌‌‌లోనే .. 60 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో పంజాబ్‌‌‌‌‌‌‌‌పై గెలుపు
  • ప్లే ఆఫ్స్‌‌‌‌‌‌‌‌కు దూరమైన కింగ్స్‌‌‌‌‌‌‌‌
  • చెలరేగిన కోహ్లీ, రజత్‌‌‌‌‌‌‌‌, గ్రీన్‌‌‌‌‌‌‌‌, సిరాజ్‌‌‌‌‌‌‌‌
  • రోసోవ్‌‌‌‌‌‌‌‌, శశాంక్‌‌‌‌‌‌‌‌ పోరాటం వృథా

ధర్మశాల: ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ చివరి దశలో పుంజుకున్న రాయల్‌‌‌‌‌‌‌‌ చాలెంజర్స్‌‌‌‌‌‌‌‌ బెంగళూరు వరుసగా నాలుగో విక్టరీని అందుకుంది. విరాట్‌‌‌‌‌‌‌‌ కోహ్లీ (47 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 7 ఫోర్లు, 6 సిక్స్‌‌‌‌‌‌‌‌లతో 92), రజత్‌‌‌‌‌‌‌‌ పటీదార్‌‌‌‌‌‌‌‌ (23 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 3 ఫోర్లు, 6 సిక్స్‌‌‌‌‌‌‌‌లతో 55), కామెరూన్‌‌‌‌‌‌‌‌ గ్రీన్‌‌‌‌‌‌‌‌ (27 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌‌‌‌‌తో 46) చెలరేగడంతో.. గురువారం జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో 60 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో పంజాబ్‌‌‌‌‌‌‌‌ కింగ్స్‌‌‌‌‌‌‌‌కు చెక్‌‌‌‌‌‌‌‌ పెట్టింది. దీంతో పంజాబ్‌‌‌‌‌‌‌‌ ప్లే ఆఫ్స్‌‌‌‌‌‌‌‌ రేస్‌‌‌‌‌‌‌‌ నుంచి నిష్క్రమించగా, ఆర్‌‌‌‌‌‌‌‌సీబీ ఇంకా రేస్‌‌‌‌‌‌‌‌లోనే కొనసాగుతున్నది. టాస్‌‌‌‌‌‌‌‌ ఓడిన బెంగళూరు 20 ఓవర్లలో 241/7 స్కోరు చేసింది. తర్వాత పంజాబ్‌‌‌‌‌‌‌‌ 17 ఓవర్లలో 181 రన్స్‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. రిలీ రోసోవ్‌‌‌‌‌‌‌‌ (61) టాప్‌‌‌‌‌‌‌‌ స్కోరర్‌‌‌‌‌‌‌‌. శశాంక్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ (37) ఫర్వాలేదనిపించాడు. కోహ్లీకి ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌’ అవార్డు లభించింది. 

కోహ్లీ అదరహో..

ఫ్లాట్‌‌‌‌‌‌‌‌ వికెట్‌‌‌‌‌‌‌‌పై కోహ్లీ బ్యాట్‌‌‌‌‌‌‌‌ ఝుళిపిస్తే.. పంజాబ్‌‌‌‌‌‌‌‌ బౌలర్‌‌‌‌‌‌‌‌ కావేరప్ప (2/36) ఆరంభంలోనే ఝలక్‌‌‌‌‌‌‌‌ ఇచ్చాడు. తన వరుస ఓవర్లలో డుప్లెసిస్‌‌‌‌‌‌‌‌ (9), విల్‌‌‌‌‌‌‌‌ జాక్స్‌‌‌‌‌‌‌‌ (12)ను పెవిలియన్‌‌‌‌‌‌‌‌కు పంపాడు. దీంతో 43/2 స్కోరుతో కష్టాల్లో పడిన ఆర్‌‌‌‌‌‌‌‌సీబీని కోహ్లీ, రజత్‌‌‌‌‌‌‌‌ పటీదార్‌‌‌‌‌‌‌‌ గట్టెక్కించారు. ఆరో ఓవర్‌‌‌‌‌‌‌‌లో రజత్‌‌‌‌‌‌‌‌ మూడు ఫోర్లు కొట్టడంతో ఆర్‌‌‌‌‌‌‌‌సీబీ 56/2తో పవర్‌‌‌‌‌‌‌‌ప్లేను ముగించింది. ఏడో ఓవర్‌‌‌‌‌‌‌‌లో కోహ్లీ, రజత్‌‌‌‌‌‌‌‌ చెరో సిక్స్‌‌‌‌‌‌‌‌తో జోరు పెంచారు. 8వ ఓవర్‌‌‌‌‌‌‌‌ నుంచి పటీదార్‌‌‌‌‌‌‌‌ ఆట మరో మెట్టు ఎక్కింది. ఈ ఓవర్‌‌‌‌‌‌‌‌లో హ్యాట్రిక్‌‌‌‌‌‌‌‌ సిక్స్‌‌‌‌‌‌‌‌లు, తర్వాతి ఓవర్‌‌‌‌‌‌‌‌లో మరో సిక్స్‌‌‌‌‌‌‌‌ దంచాడు.

కానీ లాస్ట్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌కు కరన్‌‌‌‌‌‌‌‌ (1/50) ఔట్‌‌‌‌‌‌‌‌ చేయడంతో థర్డ్‌‌‌‌‌‌‌‌ వికెట్‌‌‌‌‌‌‌‌కు 76 రన్స్‌‌‌‌‌‌‌‌ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ ముగిసింది. 10వ ఓవర్లలో 119/3తో ఉన్న ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌కు వర్షం కాసేపు అంతరాయం కలిగించింది. కోహ్లీతో కలిసి గ్రీన్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌తో స్ట్రయిక్‌‌‌‌‌‌‌‌ రొటేట్‌‌‌‌‌‌‌‌ చేశాడు. ఈ క్రమంలో విరాట్‌‌‌‌‌‌‌‌ 32 బాల్స్‌‌‌‌‌‌‌‌లో ఫిఫ్టీ మార్క్‌‌‌‌‌‌‌‌ అందుకున్నాడు. మధ్యలో ఫోర్లు కొట్టిన కోహ్లీ.. కరన్‌‌‌‌‌‌‌‌, లివింగ్‌‌‌‌‌‌‌‌స్టోన్‌‌‌‌‌‌‌‌ను టార్గెట్‌‌‌‌‌‌‌‌ చేసి రెండు భారీ సిక్స్‌‌‌‌‌‌‌‌లు బాదాడు. దీంతో 16వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో 21 రన్స్‌‌‌‌‌‌‌‌ వచ్చాయి. 17వ  ఓవర్‌‌‌‌‌‌‌‌లో గ్రీన్‌‌‌‌‌‌‌‌ 4, 6 కొట్టగా, 18వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో 4, 6 కొట్టి కోహ్లీ ఔటయ్యాడు. ఫలితంగా నాలుగో వికెట్‌‌‌‌‌‌‌‌కు 92 రన్స్‌‌‌‌‌‌‌‌ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ బ్రేక్‌‌‌‌‌‌‌‌ అయ్యింది. చివర్లో గ్రీన్‌‌‌‌‌‌‌‌, కార్తీక్‌‌‌‌‌‌‌‌ (18) వేగంగా ఆడారు. 

రోసోవ్‌‌‌‌‌‌‌‌ ఒక్కడే..

భారీ టార్గెట్‌‌‌‌‌‌‌‌ ఛేదనను పంజాబ్‌‌‌‌‌‌‌‌ కూడా వేగంగా మొదలుపెట్టింది. నాలుగో బాల్‌‌‌‌‌‌‌‌కు ప్రభుసిమ్రాన్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ (6) ఔటైనా, బెయిర్‌‌‌‌‌‌‌‌స్టో, రోసోవ్‌‌‌‌‌‌‌‌ దుమ్మురేపారు. వీరిద్దరు వరుసపెట్టి బౌండ్రీలు బాదడంతో స్కోరు బోర్డు పరుగెత్తింది. కానీ ఆరో ఓవర్‌‌‌‌‌‌‌‌లో ఫెర్గుసన్‌‌‌‌‌‌‌‌ (2/29) ఈ జోడీకి బ్రేక్‌‌‌‌‌‌‌‌లు వేశాడు. బెయిర్‌‌‌‌‌‌‌‌స్టో ఇచ్చిన క్యాచ్‌‌‌‌‌‌‌‌ను మిడాఫ్‌‌‌‌‌‌‌‌లో డుప్లెసిస్‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌గా అందుకోవడంతో రెండో వికెట్‌‌‌‌‌‌‌‌కు 65 రన్స్‌‌‌‌‌‌‌‌ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ ముగిసింది.

పవర్‌‌‌‌‌‌‌‌ప్లేలో 75/2 స్కోరు చేసిన పంజాబ్‌‌‌‌‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో రోసోవ్‌‌‌‌‌‌‌‌ భారీ సిక్సర్లతో మరింత దూకుడు పెంచాడు. గ్రీన్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో 4, 6, 4, ఆ వెంటనే కర్న్‌‌‌‌‌‌‌‌ శర్మ (2/36)కు 4, 6 రుచి చూపెట్టి ఔటయ్యాడు. దీంతో మూడో వికెట్‌‌‌‌‌‌‌‌కు 36 రన్స్‌‌‌‌‌‌‌‌ ముగిశాయి. 10 ఓవర్లలో పంజాబ్‌‌‌‌‌‌‌‌ 114/3తో మంచి స్థితిలో కనిపించింది. ఈ దశలో ఓ ఎండ్‌‌‌‌‌‌‌‌లో శశాంక్‌‌‌‌‌‌‌‌ నిలకడగా ఆడినా, రెండో ఎండ్‌‌‌‌‌‌‌‌లో సిరాజ్‌‌‌‌‌‌‌‌ (3/43), స్వప్నిల్‌‌‌‌‌‌‌‌ (2/28) దెబ్బకు వరుస విరామాల్లో జితేశ్‌‌‌‌‌‌‌‌ (5), లివింగ్‌‌‌‌‌‌‌‌స్టోన్‌‌‌‌‌‌‌‌ (0), అశుతోష్‌‌‌‌‌‌‌‌ శర్మ (8), సామ్‌‌‌‌‌‌‌‌ కరన్‌‌‌‌‌‌‌‌ (22), హర్షల్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌ (0), అర్ష్‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ (4) తక్కువ స్కోర్లకే ఔట్‌‌‌‌‌‌‌‌కావడంతో పంజాబ్‌‌‌‌‌‌‌‌ పూర్తి ఓవర్లు ఆడలేకపోయింది. 

సంక్షిప్త స్కోర్లు


బెంగళూరు: 20 ఓవర్లలో 241/7 (కోహ్లీ 92, రజత్‌‌‌‌‌‌‌‌ 55, హర్షల్‌‌‌‌‌‌‌‌ 3/38).

పంజాబ్‌‌‌‌‌‌‌‌: 17 ఓవర్లలో 181 ఆలౌట్‌‌‌‌‌‌‌‌ (రోసోవ్‌‌‌‌‌‌‌‌ 61, శశాంక్‌‌‌‌‌‌‌‌ 37, సిరాజ్‌‌‌‌‌‌‌‌ 3/43).