
- కడుపునిండా తిండిపెట్టి పంపే జైల్!
- బెంగళూరులో అచ్చంగా జైలులెక్కనే ఉండే రెస్టారెంట్
- వినూత్న అనుభూతి కోసం క్యూ కడుతున్న ఫుడ్ లవర్స్
- ఫుడ్ వ్లాగర్ వీడియోను ట్వీట్ చేసిన హర్ష్ గోయెంకా
బెంగళూరు: ఏదైనా నేరం చేసిన వాళ్లను పోలీసులు తీసుకెళ్లి జైలులో పెడుతుంటారు.. బెంగళూరులోని ఓ జైలుకు మాత్రం ఆకలితో ఉన్నవాళ్లు వెళ్లి, కడుపునిండా తినేసి బయటకొస్తారు. అదేంటి.. జైలుకెళ్లి ఫుల్లుగా తిని రావడమేంటని అనుకుంటున్నారా! వెళ్లడం, తినడం, రావడం నిజమే కానీ జైలు మాత్రమే అబద్ధం. అంటే అదొక సెటప్ అన్నమాట! జైల్ థీమ్ తో వెలసిన హోటల్ అది. ఎంట్రన్స్ లో అచ్చంగా సెంట్రల్ జైలును పోలిన గేటు, పక్కనే బొమ్మ గార్డులు.. లోపలికి అడుగుపెట్టగానే జైలు గదులు, అందులో సరదాగా మాట్లాడుకుంటూ ఫుడ్ లాగిస్తున్న మనుషులు కనిపిస్తారు. ఖాళీగా ఉన్న టేబుల్‌పై కూర్చున్నాక ఖైదీ యూనిఫాంలోనో, వార్డర్ యూనిఫాంలోనో ఉన్న సర్వర్ మీ టేబుల్ దగ్గరికి వచ్చి ఆర్డర్ తీసుకుంటాడు.
ఖైదీల బొచ్చెలోనే తినాలె..
ఖైదీలకు ఇచ్చే ప్లేట్(బొచ్చె) లో మీరు ఆర్డర్ చేసిన పదార్థాలను వడ్డిస్తారు. హాయిగా తిన్నాక ఆ జైలు(రెస్టారెంట్)ను తిరిగి చూడొచ్చు. ఖైదీలు, వార్డర్లతో ఫొటోలు దిగొచ్చు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మరో ఖైదీ రూంలోకి వెళ్లి, చేతులకు బేడీలు తొడుక్కుని కటకటాల వెనకున్నట్లు ఫొటో తీసుకోవచ్చు. ఆపై తిన్నవాటికి బిల్ చెల్లించి బయటకు వచ్చేయడమే! ఓ ఫుడ్ వ్లాగర్ ఈ జైల్ రెస్టారెంట్‌ను డీటెయిల్డ్‌గా వ్లాగ్ చేసి యూట్యూబ్‌లో పెట్టారు. ఈ వీడియోను హర్ష్ గోయెంకా ట్వీట్చేయడంతో ట్విట్టర్లో వైరల్‌గా మారింది. కాగా, హైదరాబాద్‌లోనూ ఇలాంటి రెస్టారెంట్లు ఉన్నాయి. నారాయణగూడ, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్ తదితర ఏరియాల్లో ఉన్న జైల్ మండి రెస్టారెంట్లలో ఇలాంటి అనుభూతి పొందొచ్చు.