సుపరిపాలనకు కేరాఫ్​ అటల్​జీ

సుపరిపాలనకు కేరాఫ్​ అటల్​జీ

డిసెంబర్ 25. ఈరోజు మనందరికీ చాలా ప్రత్యేకమైన రోజు. దేశ ప్రజలు ప్రియతమ మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్‌‌‌‌పేయీ జీ శత జయంతిని జరుపుకొంటున్న వేళ ఇది. ఆయన ఎంతో మందికి ప్రేరణను ఇస్తూ ఒక రాజనీతి కోవిదునిగా సమున్నత స్థానంలో నిలిచారు. దేశాన్ని 21వ శతాబ్దంలోకి నడిపిన మహనీయునిగా అటల్ జీకి మన దేశ ప్రజలు ఎన్నటికీ రుణపడి ఉంటారు.  

ఆయన 1998లో ప్రధానిగా పదవిని స్వీకరించిన తరుణంలో... మన దేశం రాజకీయ అస్థిరత్వంతో కొట్టుమిట్టాడుతోంది. దాదాపు తొమ్మిదేళ్లలో నాలుగుసార్లు లోక్‌‌‌‌సభకు ఎన్నికలు జరగడాన్ని మనం చూశాం.  దేశ ప్రజానీకం సహనాన్ని కోల్పోతూ, ఈ ప్రభుత్వాలు వాటి బాధ్యతను సమర్థంగా నెరవేర్చగలుగుతాయా? అనే అనుమానంలో పడిపోయారు.  ఈ స్థితిని అటల్ జీ మార్చివేసి స్థిరమైన, ప్రభావవంతమైన పాలనను అందించారు.  

ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఆయన సామాన్య పౌరుల కష్టాలు అర్థం చేసుకున్నారు. ప్రభుత్వానికి దక్షత ఉంటే ఎంతటి పరివర్తనను తీసుకురావచ్చో ఆయన చేతల్లో చూపించారు.  ఆయన పదవీ కాలంలో సమాచార సాంకేతిక విజ్ఞానం (ఐటీ), టెలికాం, కమ్యూనికేషన్స్ రంగాల్లో గొప్ప పురోగతి చోటుచేసుకొంది.  యువశక్తి అత్యంత  చైతన్యవంతంగా ఉన్న భారత్ వంటి ఒక దేశానికి ఇది చాలా ముఖ్యం. అటల్ జీ నాయకత్వంలో ఏర్పాటైన ఎన్‌‌‌‌డీఏ ప్రభుత్వం టెక్నాలజీని సామాన్య పౌరులకు అందుబాటులోకి తేవడానికి  చాలా శ్రద్ధ తీసుకుంది. 

అటల్​జీ పాలనకు గొప్ప గుర్తులు

స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టును ఈనాటికీ చాలా మంది గుర్తుపెట్టుకుంటున్నారు.  ఈ ప్రాజెక్టు దేశంలో అనేక ప్రాంతాలను ఒకదానితో మరొక దాన్ని అనుసంధానం చేసింది. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన వంటి కార్యక్రమాలను అమలుచేయడం ద్వారా స్థానికంగా కూడా సంధానాన్ని పెంపొందింప చేయడానికి వాజ్‌‌‌‌పేయి ప్రభుత్వం చేసిన కృషి అంతే గుర్తించదగ్గది.  ఇదే మాదిరి ఆయన ప్రభుత్వం ఢిల్లీ మెట్రోను ఏర్పాటు చేయడానికి పడ్డ శ్రమ అంతా ఇంతా కాదు. ఇది మెట్రో కనెక్టివిటీకి ఊతాన్నిచ్చింది.  ఢిల్లీ మెట్రోకు ఒక ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల రంగ ప్రాజెక్టు అనే పేరు ప్రఖ్యాతులున్నాయి.  వాజ్‌‌‌‌పేయి ప్రభుత్వం ఆర్థిక వృద్ధిని పెంచడమొక్కటే కాక, దూరదూరాల్లో ఉన్న ప్రాంతాలను చేరువచేసి ఏకత, సమగ్రత వర్ధిల్లేటట్టు చూసింది.

సామాజిక సంక్షేమం

సామాజిక రంగం విషయానికి వస్తే, సర్వ శిక్షా అభియాన్ వంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రజలకు, ముఖ్యంగా పేదలకూ, సమాజం లో ఆదరణకు నోచుకోకుండా ఉండిపోయిన వర్గాలవారికీ ఆధునిక విద్యను అందుబాటులోకి తేగలిగే ఒక భారతదేశాన్ని ఆవిష్కరించాలని అటల్ జీ కన్న కలను గురించి ప్రధానంగా చెబుతుంది.  అలాగే, ఆశ్రిత పక్షపాతం, దశాబ్దాల పాటు ఎదుగూబొదుగూ లేని ఆర్థిక ఆలోచనావిధానాలతో సాగిన దేశంలో..ఆర్థిక పురోగతికి  బాటవేసి, అనేక ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టేందుకు ఆయన ఆధ్వర్యంలోని ప్రభుత్వం చొరవ తీసుకుంది.

పోఖ్రాన్​ అణుపరీక్షలు

వాజ్‌‌‌‌పేయి గారి అద్భుత నాయకత్వానికో చక్కటి ఉదాహరణ 1998 వేసవిలో జరిగిన ఒక సంఘటనే తార్కాణం. ఆయన ప్రభుత్వం మే 11న పదవీ బాధ్యతలు చేపట్టింది.  వెనువెంటనే పోఖ్రాన్‌‌‌‌లో అణు పరీక్షలను నిర్వహించింది, ‘ఆపరేషన్ శక్తి’ పేరిట ఈ పరీక్షలు ప్రసిద్ధమయ్యాయి.  ఈ పరీక్షలు భారత్ శాస్త్రవేత్తల శక్తిని నిరూపించాయి.  భారత్ ఈ రకమైన పరీక్షలను నిర్వహించడమా..? అని ప్రపంచం విస్తుపోయింది.  ప్రపంచ దేశాలు వాటి ఆగ్రహాన్ని చాలా స్పష్టంగా వ్యక్తం చేశాయి.  ఆ సమయంలో ఏ సామాన్య నేత అయినా ఒత్తిడికి తలొగ్గేవారు.  

కానీ, అటల్ జీ భిన్నమైన వ్యక్తి.  భారత్ దృఢంగా నిలబడటమే కాక, మరో రెండు రోజుల తరువాత అంటే మే 13న రెండో దఫా పరీక్షలు నిర్వహించింది. 11వ తేదీనాటి పరీక్షలు విజ్ఞానశాస్త్ర నైపుణ్యాన్ని చాటితే, 13వ తేదీన నిర్వహించిన పరీక్షలు సిసలైన నాయకత్వం అంటే ఏమిటో రుజువుచేశాయి.  బెదిరింపులకో, ఒత్తిడికో లొంగిపోయే రోజులు గతించిపోయాయని ప్రపంచానికి ఆయన ఒక సందేశాన్ని పంపారు.  అప్పటి వాజ్‌‌‌‌పేయి జీ నాయకత్వంలోని ఎన్‌‌‌‌డీఏ ప్రభుత్వం అంతర్జాతీయ ఆంక్షల్ని ఎదుర్కొంటూనే గట్టిగా నిలబడింది. భారత్ తన సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకొనే హక్కును నిలబెట్టుకొంటూ, ఏక కాలంలో ప్రపంచ శాంతిని  అత్యంత బలంగా సమర్థించే దేశంగా కూడా నిలిచింది.

ఎన్​డీఏ రూపకర్త

భారత ప్రజాస్వామ్య వ్యవస్థను, దాన్ని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని అటల్‌‌‌‌జీ అర్థం చేసుకున్నారు. దేశ రాజకీయాల్లో సంకీర్ణాలను పునర్నిర్వచించిన ఎన్‌‌‌‌డీయేకు అటల్‌‌‌‌జీ నాయకత్వం వహించారు. అందరినీ ఒక్క చోట చేర్చి అభివృద్ధి, జాతీయ ప్రగతి, ప్రాంతీయ ఆకాంక్షలను నెరవేర్చే శక్తిగా ఎన్డీయేను తయారుచేశారు. ఆయన రాజకీయ ప్రయాణంలో అడుగడుగునా రాజనీతిజ్ఞత కనిపిస్తుంది. గుప్పెడు మంది ఎంపీలున్న పార్టీకి చెందిన వ్యక్తి అయినప్పటికీ ఆయన మాటలు ఆ సమయంలో శక్తిమంతమైన కాంగ్రెస్ పార్టీని గడగడలాడించేవి. ప్రధానమంత్రిగా తనదైన శైలిలో విపక్షాల విమర్శలను తిప్పికొట్టేవారు. ఎక్కువ కాలం ప్రతిపక్షంలోనే ఉన్నప్పటికీ, తనను ద్రోహిగా ముద్ర వేసే స్థాయికి కాంగ్రెస్ పార్టీ దిగజారినప్పటికీ ఎవరిపైనా ఆయన ద్వేషం పెంచుకోలేదు.

విదేశీ వ్యవహారాల మంత్రిగా..

భారతీయ సంస్కృతితో అటల్‌‌‌‌జీ ఎంతగా మమేకమయ్యారో కూడా గమనించాల్సిందే. భారత విదేశీ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన, ఐక్యరాజ్య సమితిలో హిందీలో ప్రసంగించిన తొలి భారతీయ నేతగా నిలిచారు. భారతీయ వారసత్వం, గుర్తింపు పట్ల ఆయన ఎంత గర్వంగా ఉండేవారో అంతర్జాతీయ వేదికపై చెరగని ముద్ర వేసిన ఈ ఒక్క ఉదాహరణ చాలు. అటల్‌‌‌‌జీ వ్యక్తిత్వం అయస్కాంతం లాంటిది. ఆయన జీవితం సాహిత్యం, అభివ్యక్తి పట్ల ప్రేమతో నిండిపోయింది. ఆయన ఓ గొప్ప రచయిత, కవి. స్పూర్తి నింపేందుకు, ఆలోచనలను రేకెత్తించేందుకు, ఓదార్పును అందించేందుకు తన మాటలను ఉపయోగించేవారు. ఆయన అంతర్మథనానికి, దేశం పట్ల ఉన్న ఆకాంక్షలకు ఆయన కవిత్వం అద్దం పడుతుంది. వయసుతో నిమిత్తం లేకుండా ప్రజలందరినీ ఉత్తేజపరుస్తూనే ఉంటుంది.

అటల్​జీ యే  ప్రత్యామ్నాయానికి బాట

అటల్‌‌‌‌జీ నుంచి నేర్చుకొనే, సంభాషించే అవకాశం దక్కడం నాలాంటి ఎంతో మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఓ గొప్ప వరం.  బీజేపీకి ఆయన అందించిన సేవలు వెలకట్టలేనివి. ఆ రోజుల్లో కాంగ్రెస్ ఆధిపత్యానికి ప్రత్యామ్నాయంగా నిలిచిన ఒక దీటైన వ్యక్తి వాజపేయిజీ. పార్టీ తొలినాళ్ళ నుంచి  ఎటువంటి సవాళ్లు ఎదురైనప్పటికీ  శ్రీ ఎల్‌‌‌‌కే అద్వానీ, డా. మురళీ మనోహర్ జోషి లాంటి దిగ్గజాలతో కలసి వాటిని సమర్ధంగా ఎదుర్కొంటూ పార్టీని విజయపథంలో నడిపించారు. సిద్ధాంతం, అధికారం మధ్య ఒకదాన్ని ఎంచుకోవాల్సిన సందర్భాలు ఎదురైతే ఆయన మొదటి దానినే ఎంచుకొనేవారు. కాంగ్రెస్ చూపిస్తున్న ప్రపంచాన్ని కాకుండా, మరో దృక్కోణంలో ప్రపంచాన్ని చూడటం సాధ్యమేనని ఆయన దేశాన్ని ఒప్పించగలిగారు.


అటల్ జీ శత జయంతి వేళ ఆయన ఆశయాలను, ఆకాంక్షలను నెరవేర్చేందుకు మనల్ని మనం పునరంకితం చేసుకోవాలి. ఆయన అనుసరించిన సుపరిపాలన, ఐక్యత, ప్రగతి అనే నియమాలను ప్రతిబింబించే భారత్‌‌‌‌ను నిర్మించడానికి మనం కృషి చేద్దాం. మన దేశ సామర్థ్యంపై అటల్ జీకి ఉన్న అచంచలమైన విశ్వాసం ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని, కష్టపడి పనిచేసేలా మనల్ని ప్రేరేపిస్తోంది.

రాజీపడని రాజనీతిజ్ఞుడు

అధికారం కోసం ఏనాడూ ఆయన అవకాశవాద రాజకీయాలకు పాల్పడలేదు. 1996లో ప్రతికూల పరిస్థితుల్లో సైతం ఆయన రాజీనామా చేయడానికి  మొగ్గు చూపారే తప్ప ఎలాంటి నీచ రాజకీయాలకు, బేరసారాలకు పాల్పడలేదు.1999 లో కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో ఆయన ప్రభుత్వం కూలిపోయింది. ఆ సమయంలో జరిగిన అనైతిక రాజకీయాలను సవాలు చేయమని చాలా మంది చెప్పినప్పటికీ ఆయన మాత్రం న్యాయబద్ధంగానే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. చివరకు అద్భుతమైన ప్రజాతీర్పుతో తిరిగి అధికారాన్ని చేపట్టారు. 

రాజ్యాంగాన్ని పరిరక్షించే విషయంలో అటల్‌‌‌‌జీ ఉన్నత స్థానంలోనే ఉంటారు. డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదానం ఆయన్ను తీవ్రంగా ప్రభావితం చేసింది. కొన్నేళ్ల తర్వాత జరిగిన ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో ఆయన ప్రధాన భూమిక పోషించారు. ఆత్యయిక పరిస్థితి తర్వాత, 1977 ఎన్నికలకు ముందు తాను స్థాపించిన (జన్ సంఘ్) పార్టీని జనతా పార్టీలో విలీనం చేసేందుకు ఆయన అంగీకరించారు. ఇది ఆయనతో పాటు ఇతరులను సైతం బాధించిన నిర్ణయమని నేను భావిస్తున్నాను. కానీ రాజ్యాంగాన్ని పరిరక్షించడమే ఆయనకు ప్రధానం.

- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి-