ఏదైనా కొత్త పని మొదలు పెట్టేముందు .. మంచి రోజు.. ఆరోజు మన జాతకానికి అనుకూలిస్తుందా.. ఆ రోజు సంచరించే గ్రహాలు ఎలా ఉన్నాయి. ఆరోజు తిథి .. వార నక్షత్రాలు ఏంటి .. ఇలా సవాలక్షా ఆలోచిస్తాం. హిందువులు చాలామంది.. వాస్తుశాస్త్రానికి .. జ్యోతిష్య శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. నిపుణుల సూచనలు.. సలహాలు తప్పక పాటిస్తారు. కొంతమంది గుండు సూది కొనాలన్నా మంచి రోజు చూస్తారు. ఇక కారుకొనాలంటే చెప్పాలా.. మంచిరోజు కోసం పండితులు సలహాలు తీసుకుంటారు. అయితే . నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్త కారును ఏ రోజున కొనాలి.. ఏరోజు కొంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. . . .
వాస్తు శాస్త్రం ప్రకారం ఏదైనా కొత్త వాహనం కొనాలన్నా.. కొత్తగా పనిని మొదలు పెట్టాలన్నా మంచి రోజును ఎంపిక చేసుకుంటారు. పండితులు తెలిపిన వివరాల ప్రకారం, సోమ, బుధ, గురు, శుక్ర వారాలు అనుకూలమైనవి.. మంగళ, శని వారాలు ప్రతికూలమైనవని చెబుతున్నారు. ఇక ఎప్పటినుంచో ఆదివారం సెలవు దినంగా ప్రకటించారు.
సోమవారం : చంద్రుడు ప్రాతినిథ్యం వహిస్తాడు. చంద్రుడు ప్రశాంతతను కలుగజేస్తాడు. ఈ రోజు కొత్తగా ఏ వ్యాపారం ప్రారంభించినా.. ఏదైనా కొత్త వస్తువు కొన్నా చాలా ప్రశాంతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు, సోమవారం కారు కొంటే.. కారు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా ప్రశాంతంగా .. సమతుల్యంగా ఉంటుందని చెబుతున్నారు.
బుధవారం: ఈ రోజు బుధుడు ప్రాతినిథ్యం వహిస్తాడు. ఇక బుధవారం కారు (వాహనం) కొంటే ఆర్థిక భద్రత పెరిగి.. సంపాదన పెరుగుతుంది. బుధుడు వ్యాపార రంగాన్ని అభివృద్ది చేస్తాడు. ఏదైనా వ్యవహారాన్ని అధిగమించాలంటే తెలివి, ఙ్ఞానం కావాలి. బుధుడు వీటిని కలుగజేస్తాడు. అంతేకాదు... బుధవారం బిజినెస్ చేయడానికి అనుకూలమైన రోజు.. ఆరోజు ఏ పని ప్రారంభించినా ఎలాంటి ఒడుదుడుకులు లేకుండా హాయిగా ఉంటుంది.
గురువారం: ఈరోజకు అధి దేవత బృహస్పతి.. ఈయన ఙ్ఞానాన్ని కలుగజేస్తాడు. ఈ రోజున కారు కుంటే శ్రేయస్సు.. అదృష్టం కలసి వస్తుంది. సంపద పెరుగుతుంది.
శుక్రవారం: శుక్రుడు ప్రాతినిథ్యం వహించే రోజు.. ఈయన ప్రేమ, అభిమానం, విలాసం మొదలైనవి కలుగజేస్తాడు, సంపదకు .. లక్ష్మీదేవికి ( డబ్బుకు) అనుకూలమైన రోజు. చాలామంది హిందువులు శుక్రవారం లక్ష్మీదేవికి పూజలు చేస్తారు. ఈ రోజున కారుకొంటే సాక్షాత్తు లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందని భావిస్తారు. సంపద పెరిగి జీవితంలో ఆనందం పొందుతారని పండితులు చెబుతున్నారు
ఏ రోజుల్లో కారు కొనకూడదంటే....
మంగళవారం : ఈ రోజు కుజుడు అధిపతి.. పండితులు తెలిపిన వివరాల ప్రకారం.. కుజుడు దూకుడు స్వభావం కలిగి ఉంటాడు. ఆ రోజు కారుకొంటే.. డబ్బులిచ్చి ఆవేశాన్ని ఇంటికి తెచ్చుకున్నట్టేనని చెబుతున్నారు. దూకుడుగా.. ఆవేశంగా.. స్పీడుగా కారు డ్రైవింగ్ చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అందుకే జాతకంలో కుజుడు సంచరించేటప్పుడు.. కోపం తగ్గించుకోమని.. ఆవేశం తగ్గడానికి జపాలు కూడా చేయిస్తుంటారు. కుజుడు వివాదాలను కూడా రెచ్చగొడతాడు.
శనివారం: ఈ రోజు శని దేవతకు అనుకూలమైన రోజు. శనిగ్రహం ఇబ్బందులను కలుగజేస్తుందని చెబుతుంటారు. ఈ రోజు ఏదైనా కొత్తపని ప్రారంభిస్తే పోరాటాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఈ రోజున కారు కొంటే ఇబ్బందులు సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
ఆదివారం: సహజంగా అన్ని షోరూంలకు.. పెద్ద పెద్ద కంపెనీలకు సెలవు ఉంటుంది.