బెస్ట్​ విద్యా విధానం కేరాఫ్​ ఫిన్లాండ్​ : ఏవీ సుధాకర్,

మార్కుల గోలలేదు. ర్యాంకులతో పనిలేదు. గ్రేడుల ఊసేలేదు ... అయినా నాణ్యమైన విద్యనందించడంలో గత ఇరవై సంవత్సరాలుగా ఫిన్లాండ్​ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. ఉత్తర ఐరోపాలో సార్వ భౌమాధికారం కలిగిన దేశాల్లో ఒకటి ఫిన్లాండ్. రాజధాని హెల్సింకి. మానవాభివృద్ధి, సుస్థిరాభివృద్ధిలో ముందున్న దేశంగా, అవినీతిని పూర్తిగా నిర్మూలించిన దేశంగా గుర్తింపు పొందింది. హ్యాపినెస్ ఇండెక్స్ లో ముందువరుసలో ఉంటున్నది. జనాభా రీత్యా, విస్తీర్ణంలో చిన్నదే అయినప్పటికీ అనేక విషయాల్లో ప్రపంచదేశాలకు పాఠాలు నేర్పుతున్నది. మనదేశంలో మెజారిటీ రాష్ట్రాల్లో పిల్లలకు రెండేండ్లు దాటగానే తల్లిదండ్రులు స్కూళ్లవేట మొదలు పెట్టడం పరిపాటిగా మారింది. పాఠశాలలో కాలు పెట్టకముందే రైమ్స్, అక్షరాలు, అంకెలను బట్టీకొట్టిస్తున్నారు. ర్యాంకుల పేరుతో, గ్రేడుల పేరుతో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఫలితాలు రాగానే ప్రకటనల రూపం లో హెూరెత్తిస్తున్నాయి. ఈ అంకెల వేటలో ఒత్తిడికి లోనై చిన్నారులు అందమైన బాల్యాన్ని కోల్పోతున్నారు. మనదేశంలో ముఖ్యంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి. అనేక విద్యాకమిటీలు, కమిషన్లు, నూతన విద్యావిధానాలు, ప్రణాళికలు వస్తున్నాయి, పోతున్నాయి. గుణాత్మక విద్యపై ఊకదంపుడు ఉపన్యాసాలు, చర్చలు, సెమినార్లు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ఆచరణ మాత్రం శూన్యం. నానాటికీ విద్యా ప్రమాణాలు దిగజారుతున్నాయి. ఈ పరిస్థితులు మారాలంటే ఫిన్లాండ్ విద్యావిధానాన్ని అధ్యయనం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.

అందరికీ ఒకే స్కూల్

ఫిన్లాండ్​లో శిశువు జన్మించిన వెంటనే తల్లిదండ్రులకు పిల్లల శిక్షణ గురించిన మూడు సాహితీ పుస్తకాలను అందజేస్తారు. తల్లి సంరక్షణలోనే పిల్లలు తొలి రోజుల్లో ఎదుగుతారు. 8 నెలల ప్రసూతి సెలవు తప్పనిసరి. ఏడాది నిండిన పిల్లలను డే కేర్ సెంటర్లలో చేరుస్తారు. ఇద్దరు శిక్షణ పొందిన నర్సుల పర్యవేక్షణలో డేకేర్ సెంటర్లు నిర్వహిస్తారు. ఈ సెంటర్​లో పిల్లలకు ఆటలు, పాటలు, కథలు, పెయింటింగ్, డ్రాయింగ్ తదితర అంశాల్లో ప్రాథమిక శిక్షణ ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ భాషా సామర్థ్యాలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలపై దృష్టి సారిస్తారు. చేతులకు, కాళ్లకు, నోటికి ఇచ్చే శిక్షణ మేథోవికాసానికి దారితీస్తుంది. చిన్న చిన్న యంత్రాలను విడదీయడం, బిగించడం, బంకమట్టితో బొమ్మలు చేయడం, పాదులు తీయడం, మొక్కలకు నీరు పోయడం వంటి అనేక కృత్యాల వల్ల పిల్లల్లో చురుకుదనం పెరిగి శారీరక, మానసిక వికాసాలు కలుగుతాయి. ఆరేండ్ల వరకు రాయడం, చదవడం లాంటివి ఫిన్లాండ్ విధానంలో కనిపించవు. ఆడియో విజువల్ పరికరాల ద్వారా అనేక విషయాలు పిల్లలకు పరిచయం చేస్తారు. ఫిన్లాండ్​లో పుట్టిన ప్రతి చిన్నారి చదువు బాధ్యతంతా ప్రభుత్వానిదే. ఒక సంవత్సరం నిండిన పిల్లలకు డేకేర్ సెంటర్​లో ఇచ్చే విద్య నుంచి 25 ఏండ్లు అంటే యూనివర్సిటీ విద్యనందించే వరకు బాధ్యత ప్రభుత్వానిదే. ప్రైవేటు విద్య ఫిన్లాండ్​లో నిషేధం. రోజువారీ దినసరి కూలీ నుంచి దేశాధినేత వరకు వారి పిల్లలందరూ ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదవాల్సిందే. చిన్న పల్లెటూరి నుంచి దేశ రాజధాని వరకు అన్ని స్కూళ్లలో ఒకే తరహా రక్షణ సౌకర్యాలు పిల్లలకు అందిస్తారు. అన్ని యూనివర్సిటీల్లో ఒకే తరహా నిధులు, ఒకే తరహా విద్యార్హతలు, సామర్థ్యాలున్న ఉపాధ్యాయులుంటారు.

మాతృభాషలోనే బోధన

7 సంవత్సరాల వయసు నుంచి16 ఏండ్ల వయసు వరకు ప్రతి ఒక్కరూ కచ్చితంగా చదువు కోవాలనేది ఫిన్లాండ్​లో నిబంధన. పాఠశాలల పనివేళలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం రెండున్నర వరకే. అరగంటకు మించి హోమ్​వర్క్ ఇవ్వరు. దాదాపు హైస్కూల్ పూర్తయ్యే వరకు ఒంటిపూట బడులే. నాలుగే పీరియడ్లు. పీరియడుకు, పీరియడుకు15 నిమిషాల విరామం ఉంటుంది. రోజువారీ టైమ్​టేబుల్​లో ఒక గంట ఆటలకు ప్రాధాన్యముంటుంది. ఒక్కో తరగతిలో 20కి మించి విద్యార్థులుండరు. విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి12 : 1. కనీసం నాలుగు తరగతుల వరకు ఒకే ఉపాధ్యాయ బృందం పిల్లలకు పాఠాలు బోధిస్తుంది. అందువల్ల ఉపాధ్యాయులకు పిల్లల సామర్థ్యాల పట్ల అవగాహన ఏర్పడి మరింత మెరుగైన శిక్షణనిస్తారు. తొమ్మిదో గ్రేడ్ చివర ఫిన్లాండ్ విద్యార్థులు తొలి పబ్లిక్ పరీక్ష రాస్తారు. ఈ పరీక్షలు కూడా కేవలం విద్యార్థుల ప్రాథమిక జ్ఞానాన్ని పరీక్షించే విధంగా మాత్రమే ఉంటాయి. చదువుపై ఆసక్తిలేని పిల్లలు వొకేషనల్ కోర్సుల్లో చేరి జీవితంలో స్థిరపడతారు. ఫిన్లాండ్​లో స్కూలు సిలబస్ తయారు చేసే బాధ్యత పూర్తిగా టీచర్లదే. పదకొండు సంవత్సరాల వరకు మాతృభాషలోనే బోధిస్తారు. ఈ దేశం అధికార భాష ఫినిష్. ఇక్కడ నిర్వహించే పరీక్షలు ఉపాధ్యాయులకు మాత్రమే ఉద్దేశించబడతాయి. పరీక్షా ఫలితాలను విద్యార్థులకు తెలియనివ్వరు. స్లో లెర్నర్స్​పై ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల విద్యార్థుల సామర్థ్యాల్లో తేడా 20 నుంచి 30 శాతం లోపే ఉంటుంది.

రాష్ట్రంలో విద్యారంగానికి నిధులు పెంచాలి

 ‘లెస్ ఈజ్ మోర్’ అనేది ఫిన్లాండ్ విద్యావిధానంలోని కీలకాంశం. మన విద్యావిధానంలో విద్యార్థులకు అనేక విషయాలను నేర్పించాలనే ఉద్దేశంతో సిలబస్​లో అనేక అంశాలను పొందుపరుస్తున్నాం. వీటిలో వారికి జీవితంలో ఉపయోగపడేవి తక్కువ. ఫిన్లాండ్ కరికులంలో విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడని అంశాలు ఉండవు. ఈ కోణంలో సిలబస్ ను ఎప్పటికప్పుడు అప్​డేట్ చేస్తూ ఉంటారు. ఫిన్లాండ్​లో ఉపాధ్యాయ వృత్తికి ఎనలేని గౌరవం ఉంటుంది. దేశంలో అధిక వేతనాలు లభించేది ఉపాధ్యాయులకే. అందుకే ఈ వృత్తికి పోటీ ఉంటుంది. కాగా దేశ జీడీపీలో 7 శాతం విద్యకు కేటాయిస్తున్నారు. ఫిన్లాండ్ స్కూళ్లలో అందించే పోషకాహారం తాము ఇంటివద్ద వారంలో ఒక్కసారైనా పెట్టలేకపోతున్నామని అక్కడి తల్లిదండ్రులు భావిస్తారట. ఫిన్లాండ్​లో అమలౌతున్న విద్యావిధానాలను అనేక దేశాలు అనుసరిస్తున్నాయి. యూరప్ దేశాలే కాకుండా న్యూజిలాండ్, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా వంటి దేశాలు కూడా ఇదే మార్గంలో నడుస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఫిన్లాండ్ విద్యావిధానంలోని అంశాలకు ప్రాధాన్యతనివ్వాలి. పాఠశాలల్లో వివిధ రకాల వసతుల కల్పనకు ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘మన ఊరు –- మన బడి’తో పాటు నాణ్యమైన విద్యపై దృష్టిసారించాలి. విద్యాహక్కు చట్టం అమలు కోసం పటిష్ట చర్యలు చేపట్టాలి. విద్యావిధానం రూపొందించే కమిటీల్లో మేధావులకు, విద్యావేత్తలకు అవకాశం కల్పించాలి. రాష్ట్ర బడ్జెట్​లో విద్యకు నిధుల కేటాయింపులు పెంచాలి. 

- ఏవీ సుధాకర్,
రాష్ట్ర అసోసియేట్​ అధ్యక్షులు, ఎస్టీయూటీఎస్​