- ఏప్రిల్‌లో ఉత్తమ జీపీగా ఎంపికైన కొనగట్టుపల్లి
- రూ.కోటి నజరానా ప్రకటించి నిధులు మంజూరు చేసిన కేంద్రం
- తొమ్మిది నెలలుగా ఫండ్స్‌ను వినియోగించడంలో ఫెయిల్యూర్
మహబూబ్‌నగర్/హన్వాడ, వెలుగు : మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం కొనగట్టుపల్లి వంద శాతం సామాజిక భద్రత లో 2023 బెస్ట్ గ్రామపంచాయతీగా అవార్డు అందుకుంది. అందుకు కేంద్రం రూ. కోటి రివార్డు కూడా మంజూరు చేసింది. కానీ, ఇప్పటికీ ఆ నిధులను వాడుకోలేదు. ఆ నిధులకు గ్రామఆభివృద్ధి కోసం చేపట్టవలసిన పనులపై ప్రాతి పాదనలు పంపినా గత ప్రభుత్వ హాయంలో అధికారుల నుంచి ఆమోదం రాలేదు. కొత్త సర్కారు రావడంతో ఇప్పటికైనా మోక్షం కలుగుతుందేమో అని గ్రామ ప్రజలు ఆశిస్తున్నారు.
ప్రపోజల్స్ పంపినా.. స్పందన లేదు..
గ్రామంలో అభివృద్ధి పనుల ప్రపోజల్స్ పంపినా ఇంత వరకు ఒక్క పనికి కూడా శాంక్షన్ కాలేదు. గ్రామ పంచాయతీలో 1,665 జనాభా ఉండగా, 421 కుటుంబాలున్నాయి. ఈ పంచాయతీకి కిందటి ఏడాది మార్చి 31న రాష్ట్ర స్థాయి, ఏప్రిల్ 7న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు కూడా అందుకుంది. దీంతో సెంట్రల్ గవర్నమెంట్ ఈ జీపీకి రూ.కోటి రివార్డు ప్రకటించింది. అదే రోజు ఫండ్స్‌ను మంజూరు చేసింది.
ఈ పనులపై తీర్మానం
కేంద్రం నిధులతో సోలార్ స్ర్టీట్ లైట్స్, సీసీ రోడ్లు, అంగన్వాడీ సెంటర్ డెవలప్మెంట్, సర్కారు బడిలో డిజిటల్ క్లాసులు, పాత జీపీ భవనం స్థానంలో కొత్త జీపీ భవన నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు చేపట్టాలని గ్రామ సభల్లో తీర్మానించారు. కాపీని కలెక్టర్‌కు పంపించారు. కానీ, ఏ ఉపయోగం లేకుండా పోయింది. గత రాష్ర్ట ప్రభుత్వం కూడా ఈ జీపీకి అవార్డు ఇచ్చిన సమయంలోనే రూ.30 లక్షల నజారాను ప్రకటించింది. కానీ, ప్రొసిడింగ్స్ ఆలస్యంగా జారీ చేసింది. ప్రొసిడింగ్స్‌ను జారీ చేసిన రెండు రోజులకే కోడ్ అమల్లోకి రావడంతో పనులు చేపట్టే అవకాశం రాలేదు.
రాజకీయ ఒత్తిళ్లతోనే ..
కేంద్రం ఇచ్చిన రూ. కోటితో పనలు చేపట్టకుండా.. ఓ లీడరే అడ్డంపడ్డట్టు తెలుస్తోంది. ఎన్నికల ముందు పనులు చేయడం దండుగ అని, ఎన్నికల తర్వాత ఏం చేయాలో చూద్దామని అధికారులకు చెప్పినట్టు సమాచారం. అలాగే ఈ గ్రామ, మండల లీడర్ల మధ్య ఉన్న విబేధాలు కూడా పనులు కాకపోవడానికి కారణంగా తెలుస్తోంది. మొత్తం ఫండ్స్ ఇప్పుడే వాడితే తర్వాత వచ్చే సర్పంచులు పనులు చేసుకోవడానికి ఎలాంటి నిధులుండవని, ఈ నిధులను వాడొద్దని లీడర్ల మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. దీనికితోడు మండల ఆఫీసర్లు కూడా గత ప్రభుత్వంలోని కొందరు లీడర్ల ఆదేశాలతో డెవలప్మెంట్ పనులకు ప్రపోజల్స్ పంపినా పక్కన పెట్టినట్లు తెలిసింది.
పనుల్లో డొల్లతనం :
ఈ జీపీలో చేసిన డెవలప్మెంట్ పనుల్లో డొల్లతనం బయట పడుతోంది. గత మార్చిలో ఈ గ్రామంలో సీసీ రోడ్లు నిర్మించారు. ఏడాది కాక ముందే ఈ రోడ్లకు పగుళ్లు వచ్చాయి. నాసిరకంగా పనులు చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. డ్రైనేజీల్లో పూడిక తీయకపోవడంతో కాలువలు నిండిపోయాయి మురుగు నీరు మొత్తం రోడ్లపైనే పారుతోంది. మూడు నెలలుగా స్ర్టీట్ లైట్లు వెలగడం లేదు. బల్బులు కాలిపోయినా వాటిని రీప్లేస్ చేయలేదు. కొన్నిచోట్ల కరెంటు కనెక్షన్లు తెగిపోయినా ఇప్పటి వరకు సరి చేయలేదు. దాదాపు అర్ధ ఎకరా నుంచి ఎకరా స్థలంలో క్రీడా ప్రాంగణాన్ని నిర్మించాల్సి ఉండగా, కేవలం ఆరేడు గుంటల స్థలంలోనే దీన్ని నిర్మించారు. ఈ ప్రాంగణం పక్కనే పెంట దిబ్బ ఉంది. దానికి ఆనుకొని చిన్న బావి ఉండటంతో వాసన వస్తోంది. ఉన్న ఆరేడు గుంటల స్థలంలో ఎక్సర్సైజ్ చేసుకునేందు కోసం ఇనుప రాడ్స్ ఏర్పాటు చేయగా, వాటి పక్కనే రెండు కరెంట్ పోల్స్ ఉండటంతో వీటి దగ్గరికి ఎవరూ రావడం లేదు.
ఆఫీసర్లు సహకరిస్తలేరు..
రాజకీయ ఒత్తిళ్ల వల్ల కొందరు అధికారులు సహకరించడం లేదు. పలు పనులకు తీర్మానం చేసి మండల అధికారుల ద్వారా కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపాం. ఆ నిధుల నుంచి ఒక్క రూపాయి కూడా ఇంత వరకు ఖర్చు కాలేదు. ప్రొసిడింగ్ వస్తే అభివృద్ధి పనులు ప్రారంభిస్తాం.
మానస, సర్పంచ్, కొనగట్టుపల్లి, హన్వాడ మండలం
ప్రపోజల్స్ మళ్లీ పంపిస్తాం
కొనగట్టుపల్లికి జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అవార్డులు వచ్చాయి. కేంద్రం రూ.కోటి ప్రకటించింది. గత ప్రభుత్వం రూ.30 లక్షలు ప్రకటించగా , ప్రొసిడింగ్ ఇచ్చాక ఎలక్షన్ కోడ్ వచ్చింది. అప్పట్లో పలు పనులకు ప్రపోజల్స్ పంపాం. ఇప్పుడు మళ్లీ కొత్తగా డెవలప్మెంట్ పనులకు ప్రపోజల్స్ పంపిస్తాం
శ్రీనివాస్, పంచాయతీ సెక్రటరీ