రామ్ జెఠ్మ‘లా’నీ రూటే వేరు

జనం ఒకలా ఆలోచిస్తుంటే జెఠ్మలానీ మరోలా కేసుని డీల్​ చేసేవారు. ఎవరో అనుకున్నారని నా ప్రొఫెషన్​కి అన్యాయం చేయను అనేవారు. ఏదైనా కేసుని జెఠ్మలానీ డీల్​ చేస్తున్నారంటే… దానిపై జనంలో ఆసక్తి పెరిగిపోయేది. దేశ విభజనతో కరాచీ నుంచి ముంబాయికి వచ్చేశారు. తొలినాళ్లలో ఆయన తీసుకున్నవన్నీ దొంగ సరుకుతో పట్టుబడ్డవాళ్లవే. దాంతో స్మగ్లర్ల లాయర్​గా ముద్ర పడింది. ఎమర్జెన్సీలో ఇందిరా గాంధీని, బోఫోర్స్​ కేసులో రాజీవ్​ గాంధీని ధైర్యంగా ఢీకొట్టారు. వాజ్​పేయి కేబినెట్​లో పనిచేసినా అణిగిమణిగి ఉండలేదు. రూల్​ ఆఫ్​ లాతో ప్రాక్టీసు చేసేవాళ్లకు ఆయన ఒక మోడల్.

రామ్ జెఠ్మలానీ దేశంలోని టాప్​–3 లాయర్లలో ఒకరు. ఎవరైనా ఆయన తర్వాతే. సుప్రీం కోర్టులో ఎంత గట్టిగా వాదిస్తారో, అవసరమైతే చిన్న కోర్టుకు హాజరవడానికికూడా వెనకాడేవారు కాదు. ‘నేను నా మనస్సాక్షిని నమ్ముతాను. జనం నమ్ముతున్నారన్న కోణంలో నిర్ణయం తీసుకోను. నేనే కాదు, లాయర్​ ఎవరైనాగానీ ఒక వ్యక్తిని జనం దోషి అనుకుంటున్నారు కాబట్టి, అతని తరఫున వాదించకూడదు అనుకుంటే పొరబాటు. అలాంటివాడు వృత్తికి ద్రోహం చేసినవాడవుతాడు’ అని ఒక సందర్భంలో జెఠ్మలానీ స్పష్టం చేశారు.

ఆయన వాదించిన కేసులన్నీ దాదాపుగా అలాంటివే. సమాజం ఒక తీరుగా ఆలోచిస్తూ… ఎవరికివారు సొంత అంచనాలతో నిర్ణయాలకు వచ్చేస్తుంటే… రామ్​ జెఠ్మలానీ ఆ కేసుని తీసుకుని తన వాదనాపటిమతో గెలిపించుకొచ్చేవారు. జయలలిత ఆస్తుల కేసును తీసుకున్నప్పుడు  ‘డిఫెన్స్​ కోరుకునేవారి తరఫున వాదించడమనేది న్యాయశాస్త్రం బేసిక్​ ప్రిన్సిపుల్’ అని సమర్ధించుకున్నారు. తాను వకాల్తా పుచ్చుకునే హై ప్రొఫైల్​ కేసుల్లో చాలా ఎక్కువ ఫీజు డిమాండ్​ చేసినా, చాలా మటుకు లో–ఇన్​కమ్​ క్లయింట్లకు తక్కువ ఫీజుతోనో, లేకపోతే అసలు ఫీజు తీసుకోకుండానో పనిచేసేవారు. ‘నా మొత్తం క్లయింట్లలో 10 శాతం మంది దగ్గరే నేను డబ్బు తీసుకుంటాను’ అని ఒక సందర్భంలో రామ్​ జెఠ్మలానీ చెప్పారు.

జెఠ్మలానీ అనగానే ఒక పొలిటీషియన్​గా, సెంట్రల్​ మినిస్టర్​గా కంటే…  డిఫరెంట్​ స్టయిల్​ లాయర్​గానే బాగా గుర్తుకు వస్తారు. ఆయన పార్టీషన్​ సమయంలో సింధు ప్రాంతం నుంచి వచ్చేశాక ముంబాయిలో ప్రాక్టీస్​ ఆరంభించారు. తొలి నాళ్లలో ఆయన తీసుకున్న కేసుల్లో ఎక్కువశాతం దొంగ సరుకుతో పట్టుబడ్డవాళ్లవే. దాంతో జెఠ్మలానీ ‘స్మగ్లర్ల లాయర్​’గా పేరుబడ్డారు. 1960 ప్రాంతాల్లో మారుమోగిన అండర్​వరల్డ్​ డాన్​​ హాజీ మస్తాన్​ కూడా జెఠ్మలానీ క్లయింటే.

ఇద్దరు ప్రధానుల హత్య కేసుల్లో జెఠ్మలానీ నిందితుల తరఫున వాదించారు. ఇందిరా గాంధీని కాల్చి చంపిన కేసులో నిందితులు హైకోర్టుకు అప్పీల్​ చేసుకున్న దశలో… తమకు లాయర్​గా రామ్​ జెఠ్మలానీ కావాలని కోరుకున్నారు. దాంతో హైకోర్టు ఆదేశాల మేరకు నిందితుల తరఫున వాదించి, వాళ్లలో ఒకరిని నిర్దోషిగా బయటపడేశారు. అలాగే, రాజీవ్​ గాంధీ హత్య కేసులో మురుగన్​ వకీలుగా సుప్రీం కోర్టులో వాదించారు. సూసైడ్​ అటాక్​ ఇండియాలో నేరమే కాదన్నారు. మరణ శిక్షలపై ఆయనకు తీవ్ర అభ్యంతరం ఉండేది. ఇండియాలో ఉరి శిక్షను తొందరగా అమలు చేయరని, ఖైదీల మెడకు ఉరితాడు తగిలించేసి వదిలేస్తారని, దాంతో వాళ్లు అనుక్షణం చస్తూ బతుకుతుంటారని జెఠ్మలానీ ఒక కేసులో ఆక్షేపించారు. పార్లమెంట్​పై దాడి కేసులో అఫ్జల్​ గురుకి ఉరిశిక్ష వేయడాన్ని తప్పుబట్టారు. అతనికి న్యాయం జరగలేదని, యావజ్జీవం వేస్తే సరిపోయేదని అన్నారు.

దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాక వైట్​ కాలర్​ క్రైమ్స్​ బాగా పెరిగాయి. 1990 తొలి రోజుల్లో షేర్​ మార్కెట్​ని బ్లఫ్​ చేసిన కేసులు ఎక్కువ.  స్టాక్​ బ్రోకర్లు హర్షద్​ మెహతా, కేతన్​ పారిఖ్​, తందూరీ మర్డర్​ (జెస్పికా లాల్​ హత్య) కేసులో నిందితుడైన ఆమె భర్త మను శర్మ తరఫున జెఠ్మలానీయే వాదించారు. అప్పట్నుంచే కేసును బట్టి కాకుండా, కోర్టులో అప్పీయరెన్స్​ని బట్టి ఫీజు తీసుకోవడమనే పద్ధతి మొదలైంది. ‘జెఠ్మలానీ వాయిదాకి లక్ష రూపాయల చొప్పున తీసుకునేవార’ని వెటరన్​ లాయర్​ రోహిత్​ కపాడియా చెప్పారు. జెఠ్మలానీ వాదించిన వాటిల్లో 2జీ స్కాంలో ఇరుక్కున్న కనిమొళి కేసుకూడా ఉంది. అలాగే, అరవింద్​ కేజ్రీవాల్​ అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్​ జైట్లీపై వేసిన పరువు నష్టం దావా జెఠ్మలానీయే నడిపించారు. దేశ విభజనతో ఇండియాకి వచ్చేసి… స్మగ్లర్ల లాయర్​గా ప్రాక్టీసు మొదలెట్టిన రామ్​ జెఠ్మలానీ… రిటైరయ్యే నాటికి యాంటీ కరప్షన్​ యాక్టివిస్టుగా మారిపోయారు.

ఒక్క కామెంట్​తో రాజీవ్​ని దెబ్బ కొట్టారు!

రాజీవ్​ గాంధీ (1984–89) హయాంలో బాగా మారుమోగిన పేరు రామ్​ జెఠ్మలానీదే. బోఫోర్స్​ కుంభకోణంపై దేశం అట్టుడికిపోతున్న రోజులవి. అప్పట్లో స్వయంగా ఆయన స్వీడన్​ వెళ్లి ఎంతో పరిశోధన చేసి, బోఫోర్స్​ స్కాంపై వివరాలు సేకరించుకొచ్చారు. రాగానే, ‘రోజుకో పది ప్రశ్నల చొప్పున 30 రోజులపాటు వేస్తాను. వాటికి బదులైనా ఇవ్వాలి. లేదా దిగిపోవాలి. ఏది ముందయితే అది’ అని రాజీవ్​కి సవాల్​ విసిరారు జెఠ్మలానీ.

దీనిపై చిర్రెత్తుకొచ్చింది రాజీవ్​కి. ‘మొరిగే ప్రతి కుక్కకీ సమాధానం ఇవ్వాల్సిన పని లేదు’ అని కామెంట్​ చేశారు.

దానిని తన లాయర్​ బుర్రతో జెఠ్మలానీ తిప్పికొట్టారు. ‘నిజమే, నేను వాచ్​ డాగ్​ని. దొంగల్ని చూసినప్పుడు మొరగడమే వాటి పని’ అని ఎదురు బదులిచ్చారు.

ఈ సమాధానంతో దేశంలో ప్రతి ఒక్కరిలోనూ బోఫోర్స్​పై ఆసక్తి పెరిగింది. అప్పటి వరకు క్రిమినల్​ లాయర్​గా ఉన్న జెఠ్మలానీ ఫోకస్​ పూర్తిగా టర్న్​ తిరిగింది. బోఫోర్స్​ స్కాం సెంటర్​ పాయింట్​గా ప్రధాని ఆఫీసు చుట్టూరా అల్లుకున్న వ్యవహారాన్నంతా తన వాదనలో చేర్చారు. రాజీవ్​ గాంధీకి అమితాబ్​ బచ్చన్​ తమ్ముడు అజితాబ్​ బచ్చన్​కిగల లావాదేవీలు, కమలా నెహ్రూ ట్రస్ట్​లో అజితాబ్​ పాత్ర, రాజీవ్​ స్పానిష్​ బావమరిది జోస్​ వాల్డెమోర్స్​ వ్యవహారం, తండ్రి ఆస్తుల్లో సోనియా వారసత్వం, రాజీవ్​కి జోర్డాన్​ రాజు ఇచ్చిన కార్ల బహుమానం, డూన్​ స్కూలు క్లాస్​మేట్​ ఎల్​.ఎం.థాపర్​ విమానాన్ని రాజీవ్​ వాడుకోవడం, విన్​ ఛద్దా ఆచూకీ మాయమవడం వంటి అనేక అంశాల్లో లోతుగా వెళ్లి మరీ బోఫోర్స్​ కేసును బలంగా మార్చేశారు.  ప్రతిపక్షాలకు ఇదొక ఆయుధంగా పనికొచ్చింది. 1984లో 414 సీట్లతో అధికారం దక్కించుకున్న రాజీవ్​ గాంధీ, 1989లో కేవలం 197 సీట్లకు పరిమితమయ్యారు.

రాజకీయాల్లోనూ…

1923 సెప్టెంబర్​ 14న ప్రస్తుత పాకిస్థాన్​లోని షికార్​పూర్​లో జఠ్మలానీ పుట్టారు. ఇండిపెండెన్స్​కి ముందు 17 ఏళ్లకే లా పూర్తిచేసి, 18వ ఏట కరాచీలో ప్రాక్టీస్​ మొదలుపెట్టారు. 70 ఏళ్లపాటు లాయర్​గా అనేక కేసుల్ని డీల్​ చేశాక, 1997లో రిటైర్మెంట్​ ప్రకటించారు. అప్పటినుంచీ ఆయన పాలిటికల్​ కరప్షన్​పై పూర్తిగా దృష్టి పెట్టారు. ఆయన ఎమర్జెన్సీ సమయంలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని ఢీకొట్టారు. 1977 నుంచి 1984 వరకు రెండుసార్లు ముంబాయి నార్త్​ వెస్ట్​ నుంచి లోక్​సభకు గెలిచారు. 1988 నుంచి ఇప్పటివరకు మధ్యలో కొంత గ్యాప్​ మినహా ఆరుసార్లు రాజ్యసభలో సభ్యుడిగా ఉన్నారు. ఆ హోదాలోనే కన్నుమూశారు.  వాజ్​పేయి ప్రభుత్వంలో న్యాయ, కంపెనీ వ్యవహారాలు,  పట్టణాభివృద్ధి వంటి వివిధ శాఖల మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2004 లోక్​సభ ఎన్నికల్లో ఆయన లక్నో నుంచి వాజ్​పేయిపైనే ఇండిపెండెంట్​గా పోటీకి దిగారు. మళ్లీ బీజేపీలో చేరి రాజ్యసభకు ఎన్నికవ్వడం చెప్పుకోదగ్గ విషయం.

Best mind in criminal law Ram Jethmalani