Travel : ఈ వీకెండ్ కరీంనగర్ అందాలు చూసొద్దామా..

తెలంగాణలో అడుగడుగునా రాజుల కాలం నాటి కోటలు కనిపిస్తాయి. చరిత్రకు సాక్ష్యంగా నిలిచే ఇలాంటి కోటలు కరీంనగర్​లో కూడా ఉన్నాయి. వాటిలో మానేరు నది ఒడ్డున ఉన్న ఎలగందల కోట చాలా ఫేమస్​. అంతేకాదు మొలంగూర్‌‌‌‌‌‌‌‌​ కోట దగ్గరి పురాతన బావిలో తేటగా, తియ్యగా ఉండే నీళ్లు తాగాలంటే కరీంనగర్​ వెళ్లాల్సిందే. వీకెండ్ టూర్​కి ఈ జిల్లాకు వెళ్తే..  చెట్లు, కొండల మధ్య నుంచి పాలధారలా కిందకు దుమికే రాయికల్​ జలపాతంతో పాటు లోయర్ మానేరు డ్యాంని కూడా చూడొచ్చు. 

కరీంనగర్​ అనగానే... ఎలగందల కోట గుర్తుకు వస్తుంది. కానీ, దీంతో పాటు కాకతీయుల కాలం నాటి మొలంగూర్ కోట కూడా చాలా పాపులర్. శంకర​పట్నం మండలంలోని మొలంగూర్​ ఊళ్లో పెద్ద బండరాళ్ల మీద ఉంది ఈ కోట. దీన్ని ప్రతాప రుద్రుడి దగ్గర ఆఫీసర్​గా చేసిన వొరగిరి మొగ్గరాజు కట్టించాడని చెప్తారు. వరంగల్ కోట నుంచి ఎలగందల్​ కోటకు వెళ్లే దారిలో విశ్రాంతి తీసుకోవడం కోసం ఈ కోటని కట్టారట. కోట మీదకు వెళ్లేందుకు రాళ్లతో కట్టిన మెట్ల దారి ఉంటుంది. ఒకప్పుడు రాజుల విడిదిగా వెలిగిన ఈ కోట ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది. ఈ  కోట కింద  పురాతనమైన‘పాల బావి’ (దూద్​బౌలి) ఉంది. దీన్ని ‘పాల బావి’ అని పిలవడానికి కారణం...  ఇందులోని నీళ్లు తేటగా, తియ్యగా ఉండటమే. ఈ బావిలోని నీళ్లను నిజాం రాజులు కూడా తాగారని చెప్తారు అక్కడివాళ్లు. ఇప్పటికీ ఈ బావి నీళ్లను చేదుకుని తాగడమే కాకుండా క్యాన్లలో నింపి ఇంటికి తీసుకెళ్తారు చాలామంది. కరీంనగర్ నుంచి 31 కిలోమీటర్ల దూరంలో ఉంది మొలంగూర్ కోట.

లోయర్ మానేరు డ్యాం

ఇక్కడికి వెళ్తే పరవళ్లు తొక్కే మానేరు నదిని చూడొచ్చు. ఈ డ్యాంను అలుగునూరు గ్రామంలో గోదావరి ఉపనది అయిన మానేరు నది మీద కట్టారు. 27 మీటర్ల ఎత్తున్న ఈ డ్యాంకి 20 గేట్లు ఉంటాయి. ఇక్కడికి వెళ్తే బోటు రైడింగ్ చేయొచ్చు. ఇక్కడ సంధ్యవేళలో సూర్య కిరణాలు నీళ్లపై పడే దృశ్యాన్ని చూసేందుకు చాలామంది వెళ్తారు. ఈ డ్యాంకి దగ్గర్లోనే రాజీవ్​ గాంధీ జింకల పార్క్​ ఉంది. ఇందులో మ్యూజియంతో పాటు చిల్డ్రన్​​ పార్క్​, పజిల్ గార్డెన్​ ఉన్నాయి. 

మానసా దేవి గుడి


ఖాసీంపేట గ్రామంలో స్వయంభువుగా వెలిసిన మానసా దేవి అమ్మవారిని చూడొచ్చు. దాదాపు 800 ఏండ్ల చరిత్ర ఉన్న ఈ దేవతకు కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా పేరుంది. ఇక్కడ కొలువైన లక్ష్మి దేవిని ‘అపురూప లక్ష్మి’గా పూజిస్తారు. శివుడి విగ్రహం చుట్టూ నాగదేవత బొమ్మలు  ఉన్న108 శివలింగాలు ఉంటాయి. గుడి ఆవరణలో నల్లని ఏకశిల మీద   ఆంజనేయుడి విగ్రహం కనిపిస్తుంది.  ఏకశిలతో చెక్కిన ద్వజస్తంభం ఉండడం ఈ గుడి ప్రత్యేకత. 


రాయికల్​ జలపాతం


చుట్టూరా కొండలు, పచ్చని చెట్ల మధ్యలోంచి జాలువారే రాయికల్ జలపాతం చూడముచ్చటగా ఉంటుంది. సైదాపూర్ మండలంలోని  రాయికల్​ అనే గ్రామంలో ఉంది ఈ జలపాతం.  ఇక్కడ కోటగిరి గుట్టల నుంచి,  దాదాపు రెండొందల మీటర్ల ఎత్తున్న  ‘జెండా గుట్ట’ అనే కొండ మీద నుంచి నీళ్లు జలపాతంలా కిందకు దుముకుతాయి. పై నుంచి కిందికి దొంతరలుగా పేర్చినట్టు ఉండే నల్లని రాళ్ల మీద నుంచి జలపాతం కిందకు వస్తున్న నీళ్లు పాలధారలా కనిపిస్తాయి.

ఇదే కొండ మీద మూడు చిన్న జలపాతాల్ని కూడా చూడొచ్చు. ఇక్కడికి వెళ్లాలంటే... రాయికల్ నుంచి మూడు కిలోమీటర్ల దూరం మట్టి, రాళ్లు రప్పలతో నిండిన దారిలో ట్రెక్కింగ్ చేయాలి. అయితే...దారిపొడవునా పచ్చని చెట్లు, రకరకాల పక్షుల్ని చూస్తూ నడుస్తుంటే అలసట తెలియదు. వర్షాకాలంలో ఈ జలపాతాన్ని చూసేందుకు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా టూరిస్ట్​లు వెళ్తుంటారు. 

ఇలా వెళ్లాలి


హైదరాబాద్ నుంచి కరీంనగర్​ 163  కిలోమీటర్ల దూరం. కరీంనగర్​ నుంచి 40 కిలోమీటర్లు జర్నీ చేస్తే రాయికల్ జలపాతం దగ్గరికి చేరుకోవచ్చు. కరీంనగర్​ నుంచి సిరిసిల్ల రోడ్డు మీదుగా 10 కిలోమీటర్ల దూరం జర్నీ చేస్తే ఎలగందల్ కోట వస్తుంది.