కొత్త ఆఫీస్‌లో చేరే ప్రతి ఎంప్లాయ్ మనసులో కలిగే ఆందోళన.. అక్కడి కొలీగ్స్, బాస్ గురించే. వాళ్లెలా ఉంటారు? ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? సరైన వాతావరణంలోనే పనిచేసుకోగలమా? లేదా? ఇలాంటి డౌట్స్ బోలెడు. ఈ విషయంలో ఎక్స్‌పర్ట్స్ అందిస్తున్న కొన్ని సజెషన్స్ ఇవి.
ఎక్కడ పనిచేసినా కొలీగ్స్‌లో ఫ్రెండ్స్ ఉంటే అది కెరీర్‌కు చాలా హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా పనిచేసే చోట ఫ్రెండ్స్ చాలా అవసరం. అప్పుడే ఆఫీస్‌కెళ్లేందుకు రోజూ ఇంట్రెస్ట్ ఉంటుంది. పర్సనల్ లైఫ్‌తోపాటు, ప్రొఫెషనల్ లైఫ్‌ను కూడా ఎంజాయ్ చేయగలుగుతారు. ఆఫీస్‌లో అన్ని రోజులూ ఒకేలా ఉండవు. కొన్నిసార్లు వర్క్ పరంగా చాలా ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు వాళ్లు హెల్ప్ అవుతారు. కెరీర్‌లో సక్సెస్, ఫెయిల్యూర్ రెండూ కామన్. కొలీగ్స్‌లో మంచి ఫ్రెండ్స్ ఉంటే.. ఫెయిల్యూర్‌లో కూడా తోడుగా ఉంటారు. సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తారు. అవసరమైన సలహాలు ఇస్తారు. బాస్ పొగిడినప్పుడే కాదు.. ఏదో ఒక సందర్భంలో బాస్‌తో తిట్లు తినాల్సి వచ్చినప్పుడు తిరిగి కాన్ఫిడెంట్‌ను ఇవ్వగలిగేది ఆ ఫ్రెండ్సే. అందుకే ఆఫీస్‌లో ఎంతమంది ఉన్నా, అందరితో ఫ్రెండ్లీగా ఉంటూ, కొందరికైనా బెస్ట్ ఫ్రెండ్‌గా ఉండగలగాలి. అలాంటి ఫ్రెండ్స్‌ను వెతుక్కోవాలి.
బాస్‌తో
బాస్ (మేనేజర్/టీమ్ లీడర్/ఇంఛార్జ్) తన కింది స్థాయి ఉద్యోగులతో ఫ్రెండ్లీగా ఉండొచ్చు. ఫన్నీగా ఉంటూ, జోక్స్ వేస్తూ సరదాగా ఉండొచ్చు. అంతమాత్రాన దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకోకూడదు. తను ఎంప్లాయ్స్‌తో ఎలా ఉన్నా, ఫైనల్‌గా బాస్ అనే సంగతి మర్చిపోవద్దు. ఎంప్లాయ్స్‌కు, బాస్‌కు మధ్య కచ్చితమైన హద్దులుంటాయి. వర్క్ గురించి మాట్లాడుతూ, సలహాలు తీసుకోవచ్చు. బాస్‌తో ఏదైనా ఒక అంశంపై తొందరపడి కామెంట్ చేయడం, సొంత అభిప్రాయంతో చర్చించడం, అనవసరమైన విషయాల గురించి మాట్లాడటం చేయొద్దు. అడిగినప్పుడు తప్ప, అనవసరంగా సలహాలు ఇవ్వొద్దు. లేదంటే ఆ ఉద్యోగి మీద తప్పుడు అభిప్రాయం ఏర్పడుతుంది. ఇది బాస్‌తో రిలేషన్ దెబ్బతీస్తుంది. దీని ప్రభావం వర్క్, కెరీర్‌పై కూడా పడొచ్చు.
ఫ్రెండ్లీ గ్రూపులు
ఆఫీస్‌లో ఒక వర్క్ చేసేవాళ్లు ఒక గ్రూప్‌గా ఉండటం కామన్. అయితే లంచ్ టైమ్‌లో, టీ బ్రేక్‌లో కబుర్లు చెప్పుకునేటప్పుడు వేరే గ్రూప్స్ వాళ్లు కూడా పరిచయం అవుతుంటారు. ఒకేరకమైన అభిప్రాయలు ఉన్నవాళ్లు ఈజీగా ఫ్రెండ్స్ అవుతుంటారు. అయితే వాళ్లలో కొంతమందితోనే క్లోజ్‌గా ఉంటూ, మిగతావాళ్లను పట్టించుకోకుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్లు రిలేషన్‌షిప్‌ని జస్ట్ ఫన్, అవసరం కోసమే అనుకునే ఛాన్స్ ఉంది. దీంతో వాళ్లు ఎదుటివాళ్లను ఇగ్నోర్ చేయొచ్చు. ఇది వర్క్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ తెచ్చిపెడుతుంది. అందువల్ల టీమ్‌లో ఎవరితోనైనా ఎక్కువ క్లోజ్‌గా ఉంటున్నా, మిగతావాళ్లను లెక్కచేయకుండా ఉండటం సరికాదు. గ్రూప్‌లో అందరితోనూ ఫ్రెండ్లీ రిలేషన్ మెయింటైన్ చేయాలి.
అందరికీ ఇంపార్టెన్స్
కొలీగ్స్‌లో ఒక్కొక్కరి లైఫ్‌స్టైల్, షెడ్యూల్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. కాబట్టి, వాళ్లకు అనుగుణంగా నడుచుకోవాలి. ఎవరి పర్సనల్ లైఫ్‌ను క్రిటిసైజ్ చేయకూడదు. కొందరు ఆఫీస్ అయిపోగానే ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్‌కు ఇంపార్టెన్స్ ఇవ్వొచ్చు. వాళ్ల ప్రయారిటీస్‌ను అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు ఒక పార్టీ అరేంజ్ చేస్తున్నారంటే అది అందరికీ కుదిరే టైమ్‌లో సెట్ చేసుకుంటే బెటర్. ప్రతి ఒక్కరికీ ముందుగానే చెప్పాలి. దీనివల్ల ఏ ఒక్కరినీ తక్కువ చేసినట్లు ఉండదు. ఒకవేళ ఎవరైనా వీలుకాకుండా, పార్టీకి అటెండ్ అవ్వని వాళ్లను విమర్శించడం సరికాదు. వాళ్ల లైఫ్‌స్టైల్ అంతే అనుకుని అర్థం చేసుకోవాలి.
డిపెండెన్సీ వద్దు
ఆఫీస్‌లో ఎవరితో ఎంత క్లోజ్‌గా ఉన్నా, వర్క్ విషయంలో సొంత టాలెంట్, హార్డ్‌వర్క్‌నే నమ్ముకోవాలి. ఎవరిపై ఆధారపడొద్దు. అవసరమైనప్పుడు సలహాలు తీసుకోవడం తప్పు లేదు. కానీ, పూర్తిగా ఇతరుల మీదే ఆధారపడి పనిచేస్తుంటే మాత్రం ఆ ఉద్యోగి సామర్థ్యంపై ఇతరులకు నమ్మకం పోతుంది. సమస్యొచ్చినప్పుడు ఫ్రెండ్స్ చూసుకుంటారులే అనే కాన్ఫిడెన్స్ కూడా మంచిది కాదు. కెరీర్‌లో ఎదగాలంటే ఎవరి స్కిల్స్ వాళ్లు పెంచుకుంటూనే ఉండాలి. ఎవరు లేకున్నా ఒంటరిగా సాధించగలననే నమ్మకం ఉండాలి.
కొన్ని కామన్ రూల్స్
ఆఫీస్‌కు రాగానే ప్రతి ఒక్కరిని నవ్వుతూ విష్ చేయాలి.
ఏ ఒక్కరిని నిర్లక్ష్యం చేసినా అది కొన్నిసార్లు బిగ్ మిస్టేక్ అవ్వొచ్చు
లంచ్ బ్రేక్స్, టీ బ్రేక్స్‌లో అందరితోపాటే కలిసి ఉండాలి. విడిగా ఉండేందుకు ప్రయత్నించొద్దు
మధ్యలో కాఫీ, స్నాక్స్ కోసం వెళ్లాల్సి వస్తే కొలీగ్స్‌ను కూడా ఇన్వైట్ చేయాలి.
అవసరాన్నిబట్టి వర్క్ విషయంలో హెల్ప్ అడగటం, చేయడంలో వెనకడుగు వేయొద్దు.
నెగెటివిటీకి దూరంగా ఉండండి. పదేపదే ఒకరిమీద కంప్లైంట్స్ చేయకూడదు. ఒకరిగురించి వాళ్లు లేనప్పుడు నెగెటివ్‌గా మాట్లాడకూడదు.